పంచ్ డైలాగులు ఆయనపైనేనటగా

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అంటే ఫైర్ బ్రాండ్ అంటారు. ఆయనకు ముక్కు మీదే కోపం ఉంటుంది. అది భగ్గుమంటే మాత్రం మంటలు [more]

Update: 2019-10-12 03:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అంటే ఫైర్ బ్రాండ్ అంటారు. ఆయనకు ముక్కు మీదే కోపం ఉంటుంది. అది భగ్గుమంటే మాత్రం మంటలు పుట్టాల్సిందే. అపుడు అధినేత చంద్రబాబు అయినా చూడకుండా ఆయన విరుచుకుపడతారంతే. తాను టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ ని అని చెప్పగల దమ్ము అయ్యన్నపాత్రుడికే ఉంది. అంతే కాదు, కాంగ్రెస్ తో ఏపీలో పొత్తు పెట్టుకుంటే జనం బట్టలూడదీసికొడతారు అన్న హాట్ కామెంట్స్ చేయగల సత్తా అయ్యన్నపాత్రుడుకే ఉందంటారు. అటువంటి అయ్యన్నపాత్రుడు తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాలపైన తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఏపీలో అయారాం, గయారాం రాజకీయం ఎక్కువైందని అయ్యన్నపాత్రుడు అనడం విడ్డూరమే.

అధికారమే పరమావధి….

కొంతమంది టీడీపీ నేతలకు అధికారమే పరమావధిగా మారిందని, ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకోవడం అలవాటుగా మారిందని అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇపుడు విశాఖ జిల్లాలో సంచలనం రేపుతున్నాయి. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ వైసీపీలో చేరడం పట్ల ఆయన స్పందిస్తూ రాజకీయాల్లో ఇలా పార్టీలు మారడం దారుణమని అన్నారు. రాజకీయ నేతలు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి తప్ప అధికారానికి కాద‌ని అయ్యన్నపాత్రుడు అన్నారు. తాను టీడీపీ పెట్టిన దగ్గర నుంచి పార్టీలో ఉన్నానని, ఇప్పటికి తమ పార్టీ నాలుగు సార్లు ఓటమి పాలు అయిందని, ఆయినా కొనసాగుతున్నానని అయ్యన్నపాత్రుడు చెప్పుకున్నారు. నాయకుడు అన్న వాడు పట్టిన జెండాకు, పార్టీకి వన్నె తేవాలని అయ్యన్న సుద్దులు చెప్పారు.

నాలుగు పార్టీ జెండాలు కప్పుకోను…..

నిజంగా అయ్యన్నపాత్రుడు సీరియస్ గా ఈ డైలాగులు కొట్టారనుకోవాలి. నాలుగు పార్టీలు మార్చి పదవులు పొందిన నాయకుల మాదిరిగా తాను చచ్చినా ఉండబోనని అయ్యన్నపాత్రుడు చెప్పుకున్నారు. తాను చనిపోయిన తరువాత తన మీద టీడీపీ జెండాయే కప్పాలన్నది తన కోరికని అయ్యన్నపాత్రుడు చెప్పారు. పార్టీలు మారుతూ పదవుల కోసం వెంపర్లాడేవారు రాజకీయాల్లో చెదపురుగులు అంటూ అయ్యన్న సంచలన‌ వ్యాఖ్యలు చేశారు. అటువంటి వారిని రాజకీయాల నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే అయ్యన్నపాత్రుడు చేసిన ఈ హాట్ కామెంట్స్ సొంత పార్టీలో తన రాజకీయ ప్రత్యర్ధి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని ఉద్దేశించి చేశారని టీడీపీలోనే చర్చ సాగుతోంది. నాలుగు పార్టీలు మారడం అన్న మాటలు కావాలనే అయ్యన్నపాత్రుడు ప్రయోగించారని అంటున్నారు. మరి చూడాలి అయ్యన్నపాత్రుడు హాట్ కామెంట్స్ కి మాజీ మంత్రి గంటా స్పందన ఎలా ఉంటుందో.

Tags:    

Similar News