ట్రాక్ రికార్డు చూసుకోకుండానే అయ్యన్న

విశాఖ ఎంపీ సీటు మీద సవాల్ చేస్తున్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. దమ్ముంటే విశాఖ ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు పెట్టించండి. టీడీపీ గెలిచి చూపించకపోతే [more]

Update: 2020-10-18 13:30 GMT

విశాఖ ఎంపీ సీటు మీద సవాల్ చేస్తున్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. దమ్ముంటే విశాఖ ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు పెట్టించండి. టీడీపీ గెలిచి చూపించకపోతే అపుడు అడగండి అంటూ ఆయన బిగ్ చాలెంజ్ చేస్తున్నారు. విశాఖలో తమకు బలముందని చెప్పుకోవడానికే అయ్యన్నపాత్రుడు ఇలా అంటున్నారన్నది తెలిసిందే. అంతే కాదు, విశాఖ ఎంపీ సీటు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కేవలం మూడు వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో వైసీపీ గెలుచుకుంది. అపుడు జనసేన తరఫున పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ రెండున్నర లక్షలకు పైగా ఓట్లు చీల్చారు. ఆ ఓట్లు అన్నీ కూడా టీడీపీవే. దాంతో ఇపుడు డైరెక్ట్ ఫైట్ పెడితే తాము గెలుస్తామని అయ్యన్నపాత్రుడు అంచనా కాబోలు.

రెండు దశాబ్దాలుగా……

అయినా విశాఖ ఎంపీ సీట్లో టీడీపీ జెండా పాతి రెండు దశాబ్దాలు పైదాటింది. చివరిసారిగా 1999 ఎన్నికల్లో ఎంవీవీఎస్ మూర్తి విశాఖ ఎంపీ సీటుని గెలుచుకున్నారు. ఆ తరువాత చూస్తే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నేదురుమల్లి జనార్ధనరెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి, 2014 నాటికి బీజేపీ తరఫున కంభం పాటి హరిబాబు గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంవీవీఎ సత్యనారాయణ గెలిచారు. ట్రాక్ రికార్డు ఇలా ఉంటే అయ్యన్న విశాఖ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక పెట్టండి, మేమే పెద్ద తోపులమని గర్జించడం వెనక వ్యూహమేంటన్నది తమ్ముళ్లకే అర్ధం కావడం లేదుగా.

నిఖార్సుగా ఒక్కరేగా….?

ఇక విశాఖ అర్బన్ జిల్లా పరిధిలో టీడీపీకి బలంగా ఒకపుడు ఉండేది. అయితే 2019 ఎన్నికల్లో సిటీ పరిధిలోని నాలుగు అసెంబ్లీ సీట్లు తప్ప మొత్తం అంతటా టీడీపీ ఓడిపోయింది. అదే సమయంలో విశాఖలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో కూడా వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి జై కొట్టేశారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రేపో మాపో సైకిల్ దిగిపోనున్నారు. మరో ఎమ్మెల్యే గణబాబు కూడా తమ వాడేనని వైసీపీ లెక్కలు వేస్తోంది. కచ్చితంగా మిగిలేది తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు తప్ప మరెవరూ కాదు, ఏడు అసెంబ్లీ సీట్లలో ఆరింట వైసీపీకి పెట్టుకుని అయ్యన్న చేసిన సవాల్ కి అర్ధముందా అన్నది కూడా చర్చగా ఉందిట.

జరగదనేగా…?

తీరి కూర్చుని విశాఖ ఎంపీ సీటుకు ఎంవీవీ సత్యనారాయణను రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తెచ్చిపెట్టే తెలివితక్కువ పని ఎటూ వైసీపీ చేయదన్న ధీమాతోనే అయ్యన్నపాత్రుడు ఈ కొత్తరకం డిమాండ్ ని ముందుకు తెచ్చారని అంటున్నారు. పైగా విశాఖలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా తాము బలంగా ఉన్నామని అటు క్యాడర్ కి ఇటు జనాలకు చెప్పుకోవడానికే ఆయన ఈ ఆవేశపు స్సవాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఏడాది జీవీఎంసీ ఎన్నికలు జరుగుతాయి కదా. మేయర్ సీటుని కనుక టీడీపీ గెలుచుకుంటే అయ్యన్నపాత్రుడు తన సవాల్ ని నిలబెట్టుకున్నట్లేనని వైసీపీ నేతలు సమాధానం ఇస్తున్నారు. తాను పోటీ చేసిన నర్శీపట్నంలో పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిన అయ్యన్నపాత్రుడు విశాఖలో తొడకొట్టుడు రాజకీయాలకు తెరలేపడమేంటని కూడా మండిపడుతున్నారు.

Tags:    

Similar News