కొంప ముంచేటట్లున్నాడే

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్ తానేనని గట్టిగా చెప్పే నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. అయ్యన్నపాత్రుడుకు ఫైర్ బ్రాండ్ అన్న ముద్ర కూడా ఉంది. [more]

Update: 2019-12-19 00:30 GMT

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్ తానేనని గట్టిగా చెప్పే నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. అయ్యన్నపాత్రుడుకు ఫైర్ బ్రాండ్ అన్న ముద్ర కూడా ఉంది. బాబు సైతం ఆయనతో జాగ్రత్తగా ఉంటారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే జనం బట్టలూడదీసి కొడతారు అంటూ అయ్యన్నపాత్రుడు అప్పట్లో పొత్తులపైన చేసిన హాట్ కామెంట్స్ టీడీపీ హై కమాండ్ కి ముచ్చెమటలు పుట్టించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత అయ్యన్నపాత్రుడు కొంత తగ్గారు. మరో వైపు ఆయన సొంత ఇంట్లో కూడా రాజకీయం మారింది. ఏకంగా తమ్ముడే వైసీపీలోకి చేరిపోయారు. తాను చనిపోయేవరకూ టీడీపీని వీడను అంటూ అయ్యన్నపాత్రుడు చెప్పినా కూడా ఆయన ఇంటిపై ఇపుడు వైసీపీ జెండా ఎగరడం ఓ విధంగా తమ్ముడు పుణ్యమే మరి. అయినా ఏం చేయలేక మల్లగుల్లాలు పడుతున్నారు.

ఆ భేటీ వెనక…?

విశాఖ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడిల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అటువంటిది ఏకంగా గంటా భుజంపై చేయి వేసి మరీ గ్రూప్ ఫోటోకు అయ్యన్నపాత్రుడు ఫోజులు ఇచ్చారంటే ఆ కధ ఏంటన్నది టీడీపీలోనే చర్చగా ఉంది. వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజుతో అయ్యన్న ఎందుకు భేటీ అయ్యారన్నది ఒక ప్రశ్న అయితే పక్కన గంటా ఉండడం, మరో వైపు అయ్యన్నపాత్రుడుకు బాగా సన్నిహితుడైన బీజేపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉండడం, ఇంకోవైపు వైసీపీ సర్కార్ లో ప్రతిష్టాత్మకమైన అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్న యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వంటి వారు ఉండడంతో విశాఖ రాజకీయంలో కొత్త మలుపులు ఏమైనా ఉంటాయా అన్న డౌట్లు పుట్టుకువస్తున్నాయి.

బీజేపీ వలలో….

ఉత్తరాంధ్రాలో బీజేపీకి అసలు పట్టులేదు. విశాఖ నగరంలో ఒకటి రెండు చోట్ల తప్ప మూడు జిల్లాల్లో ఏ మాత్రం బలం లేదు. ఇపుడు ఈ ప్రాంతంలో కూడా కమల వికాసం జరగాలని బీజేపీ ఎత్తులు వేస్తోంది. దాంతో గంటా శ్రీనివాసరావుని చేర్చుకోవాలని కూడా పావులు కదుపుతున్న సంగతి విదితమే. ఇక ఇపుడు అయ్యన్నపాత్రుడు కూడా గంటా పక్కన నిలబడి నవ్వులు చిందిస్తూ కనిపించడంతో ఆయన మీద కూడా బీజేపీ వల వేసిందా అన్న ఆలోచనలు పుట్టుకువస్తున్నాయి. అయ్యన్నపాత్రుడు బలమైన బీసీ నేత. ముఖ్యంగా రూరల్ జిల్లాలో ఆయనకు చెప్పుకోదగిన పట్టు ఉంది. ఆయన్ని కనుక దువ్వితే రాజకీయ కధ సాఫీగా సాగుతుందని బీజేపీ పెద్దలు ఏమైనా వ్యూహరచన చేశారా అన్న సందేహాలు వస్తున్నాయి.

అదే జరిగితే….

విశాఖ జిల్లాలో అయ్యన్నపాత్రుడు లాంటి సీనియర్లను చూసుకునే చంద్రబాబు ఇప్పటివరకూ నిబ్బరంగా ఉన్నారు. మాస్ లీడర్ గా తనకంటూ ఫాలోయింగ్ సంపాదించుకున్న అయ్యన్నపాత్రుడు కనుక కొత్త ఆలోచనలు చేస్తే కనుక టీడీపీకి అతి పెద్ద దెబ్బ పడిపోవడం ఖాయమని అంటున్నారు. విశాఖ జిల్లాలో ఆది నుంచి టీడీపీని అట్టేబెట్టుకుని ఉన్న ఏకైక కుటుంబం అయ్యన్నదే. మరి ఆయన రాజకీయంగా ఇపుడు ఇబ్బందులో ఉన్నారు. మరి అడుగులు వెరేగా పడితే మాత్రం పసుపు పార్టీకి భారీ షాక్ తప్పదంటున్నారు.

Tags:    

Similar News