అయ్యన్న ఫ్యామిలీ పాక్ హిట్ అవుతుందా..?

విశాఖ జిల్లా రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. చంద్రబాబు కంటే టీడీపీలో సీనియర్ అయిన అయ్యన్న పాత్రుడు పొలిట్ బ్యూరో మెంబర్ గా [more]

Update: 2021-03-10 00:30 GMT

విశాఖ జిల్లా రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. చంద్రబాబు కంటే టీడీపీలో సీనియర్ అయిన అయ్యన్న పాత్రుడు పొలిట్ బ్యూరో మెంబర్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఇపుడు అయ్యన్న ప్రతిష్టకు అసలైన సవాల్ వచ్చిపడింది. ఒక చిన్న పంచాయతీగా ఉన్న నర్శీపట్నం తరువాత మేజర్ పంచాయతీ అయింది. ఆ మీదట మునిసిపాలిటీ అయింది. నర్శీపట్నం ఎంత ఎదిగినా కూడా అయ్యన్న పాత్రుడు కుటుంబీకుల చేతుల్లోనే పాలనా పగ్గాలు ఇప్పటిదాకా ఉంటూ వచ్చాయి.

తాత నుంచి అలా …..?

అయ్యన్నపాత్రుడు తండ్రిది ఈ ప్రాంతం కాదని అంటారు. ఆయన గోదావరి జిల్లాల నుంచి వలస వచ్చారని ప్రచారంలో ఉంది. మరి అయ్యన్న పాత్రుడు ఇంట్లో రాజకీయం ఎలా ప్రవేశించింది అంటే ఆయన తల్లి తరఫున నుంచే వచ్చింది అని అంటారు. అయ్యన్న తాత లచ్చాపాత్రుడు ఆ రోజుల్లోనే నర్శీపట్నంలో నాయకుడిగా ఉంటూ అందరి మన్ననలు అందుకున్నారు. ఆయన నర్శీపట్నం పంచాయతీకి తిరుగులేని నాయకుడిగా దశాబ్దలా పాటు సేవలు అందించారు. ఆయన తరువాత కుమార్తె. అయ్యన్న పాత్రుడు తల్లి కూడా కొన్నేళ్ళ పాటు సర్పంచ్ గా సేవలు అందించారు. ఇక అయ్యన సోదరుడు కూడా సర్పంచ్ గా పనిచేశారు. మేజర్ పంచాయతీ స్థాయికి ఎదిగిన నర్శీపట్నాన్ని 2013 నాటికి మునిసిపాలిటీ చేశారు. అలా తొలి ఎన్నికల్లో కూడా అయ్యన్న కుటుంబమే జెండా ఎగరేసింది.

బస్తీ మే సవాల్…

ఇక ఇపుడు అసలైన పరీక్ష అయ్యన్నకు ఎదురవుతోంది. 2013 ప్రాంతంలో అయితే కాంగ్రెస్ ని నెట్టేసి మరీ మునిసిపాలిటీని గెలుచుకున్న అయ్యన్న పాత్రుడికి తోడుగా తమ్ముడు సన్యాసిపాత్రుడు కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో బీసీ మహిళకు చైర్ పర్సన్ రిజర్వ్ కావడంతో అయ్యన్న మరదలు అనిత తొలి చైర్ పర్సన్ అయ్యారు. వైఎస్ చైర్మన్ గా సన్యాసిపాత్రుడు వ్యవహరించారు. గత ఎన్నికల ముందు సన్యాసిపాత్రుడు వైసీపీలోకి చేరిపోవడంతో ఇపుడు కొడుకులతో కలసి అయ్యన్న పాత్రుడు మునిసిపల్ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వైసీపీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ దూకుడు మీద ఉన్నారు. దాంతో అయ్యన్నకు ఈసారి మునిసిపాలిటీలో జెండా ఎగరేయడం బాగా కష్టమవుతోంది అంటున్నారు.

ఫ్యామిలీ రెడీ…?

ఇక ఇప్పటికే అయ్యన్న పాత్రుడు, ఆయన పెద్ద కుమారుడు విజయ్ పాత్రుడు రాజకీయాల్లో ఉన్నారు. ఇపుడు సతీమణి పద్మావతి, రెండవ కుమారుడు రాజేష్ పాత్రుడు కూడా మునిసిపల్ ఎన్నికల వేళ రంగంలోకి దిగిపోయారు. వారిద్దరు చేరో వార్డు నుంచి కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. నర్శీపట్నం చైర్ పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. అందువల్ల వైఎస్ చైర్మన్ పదవిని చేపట్టి మొత్తం మునిసిపాలిటీ మీద ఆధిపత్యం చలాయించాలని అయ్యన్న పాత్రుడు భారీ వ్యూహం రూపొందించారు. అందుకే ఇంటి నుంచే ఇద్దరిని పోటీకి దింపేశారు. మరి అయ్యన్న పాత్రుడి కుటుంబం పట్ల ఆదరణ కనబరుస్తున్న నర్శీపట్నం ప్రజలు ఈసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా. లేక ఫ్యామిలీ పాక్ ని హిట్ చేస్తారా అన్నది చూడాల్సిందే.

Tags:    

Similar News