అవంతి పట్టు సాధించలేక

విశాఖ జిల్లా రాజకీయాల్లో అనూహ్యంగా వచ్చి ఎమ్మెల్యే, ఎంపీగా పదవులు చేపట్టిన అవంతి శ్రీనివాసరావు తాజా ఎన్నికల్లో వైసీపీలోకి ఫిరాయించి మరీ మంత్రి పదవిని కొట్టేశారు. ఇచ్చిన [more]

Update: 2019-09-05 06:30 GMT

విశాఖ జిల్లా రాజకీయాల్లో అనూహ్యంగా వచ్చి ఎమ్మెల్యే, ఎంపీగా పదవులు చేపట్టిన అవంతి శ్రీనివాసరావు తాజా ఎన్నికల్లో వైసీపీలోకి ఫిరాయించి మరీ మంత్రి పదవిని కొట్టేశారు. ఇచ్చిన మాట ప్రకారం జగన్ ఆయన్ని మంత్రిని చేసి మూడు నెలలు దాటుతోంది. అవంతి శ్రీనివాసరావు తనదైన ముద్ర జిల్లా రాజకీయాల్లో వేసుకున్నారా అంటే లేదని చెప్పాలి. ఆయన విశాలమైన విశాఖకు మంత్రిగా ఉన్నా కూడా శాసించే విధంగా పాలన చేయలేకపోతున్నారని అంటున్నారు. దూకుడు మాటల్లో తప్ప చేతల్లో ఎక్కడా కనిపించడంలేదని కూడా అనేస్తున్నారు. మరో వైపు సొంత పార్టీలోనూ అవంతి శ్రీనివాసరావుకు మద్దతు లేదన్న మాట కూడా గట్టిగా వినిపిస్తోంది. ఇంకోవైపు అధికారులను కట్టడి చేసి పాలనని గాడిలో పెట్టడంలోనూ అవంతి శ్రీనివాసరావు విఫలమవుతున్నారని విమర్శలు ఉన్నాయి.

ఎమ్మెల్యేలు దూరమా…?

జిల్లాకు ఏకైక మంత్రిగా ఉన్నా అవంతి శ్రీనివాసరావుకి వైసీపీ ఎమ్మెల్యేల పూర్తి మద్దతు మాత్రం కరవు అయిందనే చెప్పాలి. మంత్రిగా అందరినీ తన వైపు తిప్పుకోవడంతో అవంతి శ్రీనివాసరావు చొరవ చూపలేకపోతున్నారని అంటున్నారు. జగన్ ఎన్నో ఆశలతో అవంతి శ్రీనివాసరావుకి పదవి ఇస్తే ఆయన మాత్రం ఏమీ కాకుండా మిగిలిపోతున్నారని అంటున్నారు. విశాఖ జిల్లాలో చూసుకుంటే మొదటి నుంచి వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ అవంతిని పట్టించుకోవడంలేదని అంటున్నారు. మంత్రి ఓ విధంగా ఒంటరి అయ్యారన్న మాట వినిపిస్తోంది. విశాఖ రూరల్ జిల్లా తీసుకుంటే సీనియర్ ఎమ్మెల్యే కన్నబాబురాజు, గొల్ల బాబూరావు, బూడి ముత్యాలనాయుడు వంటి వారు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. మరో వైపు యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ తనకు రావాల్సిన పదవి అవంతికి వరించిందన్న బాధతో ఉన్నారు. ఇంకో వైపు పార్టీలో వర్గ పోరు కూడా పెరిగిపోతోంది. దాన్ని లేకుండా చేయడంలో అవంతి శ్రీనివాసరావు ఫెయిల్ అయ్యారని, స్వయంగా ఆయనే గ్రూపులు కడుతున్నారని అంటున్నారు.

ద్రోణంరాజుతో వైరం…..

ఇక విశాఖ మెట్రో రీజియన్ అధారిటీ చైర్మన్ గా ఉన్న సీనియర్ నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ కి మంత్రి అవంతి శ్రీనివాసరావుకి పడడం లేదని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. నిజానికి ద్రోణంరాజు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన్నే మంత్రిని చేయాలని జగన్ కి ఉందన్న మాట బయటకు రావడంతో తనకు పోటీ అన్న భావనతో అవంతి శ్రీనివాసరావు ఉన్నారని అంటున్నారు. ఇంకో వైపు అవంతి ఒంటెద్దు పోకడలపై ఎప్పటికపుడు నివేదికలు ద్రోణంరాజు హై కమాండ్ కి పంపుతున్నారని ప్రచారం సాగుతోంది. ద్రోణంరాజు మీద కూడా అవంతి శ్రీనివాసరావు ఫిర్యాదులు చేస్తున్నారని చెబుతున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలు కూడా అవంతి శ్రీనివాసరావు తీరుతో నొచ్చుకుంటూ హై కమాండ్ కి ఫిర్యాదులు చేస్తున్నారుట. ఇలా వైసీపీలో అన్ని రకాలుగా అవంతి ఎదురీదుతున్నారని, ఈ సంగతులు అన్నీ తెలిసే మాజీ మంత్రి, అవంతి ఒకనాటి మిత్రుడు గంటా శ్రీనివాసరావు అవంతిని మంత్రిగా తాను గుర్తించడంలేదని ఒకే ఒక్క మాట అనేసి ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టారని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో జిల్లా రాజకీయ పరిణామాలు ఎటువైపు మలుపు తిరుగుతాయో చూడాలి.

Tags:    

Similar News