అవంతికి యమ టెన్షన్.. కోరి తెచ్చుకున్నదేగా?

విశాఖ జిల్లాకు చెందిన ఏకైక మంత్రి అవంతి శ్రీనివాసరావుకు పెద్దగా రాజకీయ వత్తిడులు లేవు. ఆయన జిల్లాకు మంత్రిగా ఉన్నా కూడా అసలు కధ అంతా వైసీపీ [more]

Update: 2021-03-10 03:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన ఏకైక మంత్రి అవంతి శ్రీనివాసరావుకు పెద్దగా రాజకీయ వత్తిడులు లేవు. ఆయన జిల్లాకు మంత్రిగా ఉన్నా కూడా అసలు కధ అంతా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కరే నడుపుతారు. రాజకీయ లాభం నష్టం అన్నీ కూడా ఆయన ఖాతాలోనే పడతాయి. ఒక విధంగా అవంతి శ్రీనివాసరావుకు ఇది మేలు అయిన వ్యవహారమే. ఆయన జిల్లా మొత్తం బాధ్యతలు చక్కబెట్టాల్సిన పని లేదు. తన సొంత నియోజకవర్గం భీమిలీలో పార్టీని గెలిపిస్తే చాలు, జగన్ వద్ద పాస్ మార్కులు పడిపోతాయి.

వద్దన్నా కూడా ….?

గత ఏడాది స్థానిక ఎన్నికల వేళ జగన్ పార్టీ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. తమ వారసులను ఎవరినీ బరిలోకి దించరాదు అని ఆయన స్పష్టంగా చెప్పేశారు. కానీ చాలా మంది నేతలు వినకుండా తమ వారిని ముగ్గులోకి దించారు. అలా జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ గా తన కుమార్తె లక్ష్మీ ప్రియాంకను అవంతి శ్రీనివాసరావు పోటీకి పెట్టేసారు. ఆమె విశాఖ శివారు పరిధిలోకి వచ్చే ఆరవ వార్డు నుంచి వైసీపీ అభ్యర్ధీగా బరిలో ఉన్నారు. నాడే ఎన్నికలు జరిగి ఉంటే ప్రియాంక విజయం నల్లేరు మీద నడకే. కానీ ఏడాది గడచింది రాజకీయం కూడా మారింది. దాంతో ఇపుడు కూతురు గెలుపు కోసం అంటూ అవంతి శ్రీనివాసరావు యమ టెన్షన్ పడుతున్నారు.

ఆ కార్డుతో చెక్…..

అవంతి శ్రీనివాసరావు కుమార్తె డాక్టర్ కోర్సు పూర్తి చేశారు. ఆమె అవంతి విద్యా సంస్థలను చూసుకుంటున్నారు. అయితే తండ్రితో గత సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి రావడంతో ఆమెకు పాలిటిక్స్ మీద ఆసక్తి కలిగింది అని చెబుతారు. దాంతో ఆమె పోటీకి సిధ్దమని చెప్పడంతో మంత్రి కూడా ఓకే చేశారుట. ఇపుడు ఆరవ వార్డులో చూసుకుంటే లోకల్ కార్డుని ప్రత్యర్ధులు తీస్తున్నారు. అవంతి శ్రీనివాసరావుయే విశాఖ జిల్లాకు చెందిన వారు కాదని ఒక వాదన ఉన్నా ఆయన భీమిలీలో చాలా వరకూ పాతుకుపోయారు. ఇపుడు ఆయన కుమార్తె నాన్ లోకల్ అంటూ టీడీపీ జనసేన కొత్త ప్రచారాన్ని మొదలెట్టేశారు. ఆమెను గెలిపిస్తే అసలు దొరకరు అంటూ ఆయా పార్టీలు చేస్తున్న ప్రచారం మంత్రికి గట్టిగానే షాక్ కొట్టేలా ఉందిట.

అదే గీటు రాయి …

అవంతి శ్రీనివాసరావుకి ఇపుడు భీమిలీలో ఉన్న అన్ని కార్పోరేటర్ సీట్లను గెలిపించుకోవాలి. దాంతో పాటుగా తన కుమార్తె సీటు కూడా పోకుండా కాపాడుకోవాలి. దాంతో అవంతి శ్రీనివాసరావు ఇక మొత్తం జీవీఎంసీ ఎన్నికల్లో ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు. ఆయన భీమిలీ మొత్తం గెలిచినా కూడా సొంత కూతురు ఓడిపోతే చాలు టోటల్ గా పరువు పోతుందని భయపడుతున్నారు. అలాగే కూతురునే గెలిపించుకుని మిగిలినవి వదిలేసినా కూడా మంత్రి సీటుకు దెబ్బ పడుతుందని భయపడుతున్నారు. మొత్తానికి ఎరక్కపోయి ఇరుక్కుపోయాను అన్నట్లుగా మంత్రి పరిస్థితి తయారైంట. మంత్రి కుమార్తె పోటీలో ఉన్న ఆరవ వార్డులో జనసేన, టీడీపీ కూడా గట్టిగానే ఉన్నాయిట. చివరి నిముషంలో ఈ రెండు పార్టీలు కుమ్మక్కు అయితే మాత్రం అవంతి శ్రీనివాసరావు కూతురుకి ఓటమి తప్పదు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News