కూతురుకి డిప్యూటీ మేయ‌ర్ కోసం పాట్లు ?

ఏపీలో జ‌రుగుతోన్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అంద‌రి దృష్టి మూడు కార్పొరేష‌న్ల మీదే ఉంది. విజ‌య‌వాడ‌, గుంటూరుతో పాటు కొత్తగా రాజ‌ధానిగా అవ‌త‌రించ‌బోతోన్న గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌ల ఫ‌లితాలు [more]

Update: 2021-03-04 08:00 GMT

ఏపీలో జ‌రుగుతోన్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అంద‌రి దృష్టి మూడు కార్పొరేష‌న్ల మీదే ఉంది. విజ‌య‌వాడ‌, గుంటూరుతో పాటు కొత్తగా రాజ‌ధానిగా అవ‌త‌రించ‌బోతోన్న గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ? ఉండ‌బోతున్నాయ‌న్న ఉత్కంఠ ఉంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నిక‌లు అటు విజ‌యసాయిరెడ్డితో పాటు విశాఖ జిల్లా మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్‌కు అగ్నిప‌రీక్షగా మారాయి. అవంతి మరో ఏడెనిమిది నెల‌ల్లో జ‌రిగే మార్పులు, చేర్పుల్లో కేబినెట్లో కొన‌సాగుతారా ? లేదా ? అన్నది ఈ ఫ‌లితాలే నిర్ణయిస్తాయి. మరోవైపు జిల్లా నుంచి కేబినెట్ లో చోటు కోసం ఇదే కాపు వ‌ర్గంలో గుడివాడ అమ‌ర్నాథ్‌తో పాటు బూడి ముత్యాల‌నాయుడు కాచుకుని కూర్చొని ఉన్నారు. వాళ్ల ఆశ ఎలా ఉన్నా ముందు త‌న పీఠం కాపాడుకోవాలంటే విశాఖ మేయ‌ర్ పీఠంపై వైసీపీ జెండా ఎగర వేయ‌డ‌మే అవంతి ముందున్న టార్గెట్.

కార్పొరేటర్ గా పోటీ….

ఈ క్రమంలోనే త‌న కుమార్తెను సైతం అవంతి శ్రీనివాస్‌ కార్పొరేట‌ర్‌గా పోటీ చేయిస్తున్నారు. డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విపై క‌న్నేసి ఆయ‌న త‌న కుమార్తెను కార్పొరేట‌ర్‌గా పోటీ చేయిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్ట‌లు అన్న చందంగా ఇటు కార్పొరేష‌న్ గెలిపించుకుని త‌న మంత్రి ప‌ద‌విని సేఫ్‌గా ఉంచుకోవ‌డంతో పాటు అటు కుమార్తెను డిప్యూటీ మేయ‌ర్ చేసుకోవ‌చ్చన్నదే అవంతి శ్రీనివాస్‌ ప్లాన్‌. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆధిక్యత చాటుకున్నా జీవీఎంసీ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం సాధించాల‌ని జ‌గ‌న్ ఇప్పటికే మంత్రి అవంతితో పాటు అటు న‌గ‌ర‌, జిల్లా నేత‌ల‌కు సైతం ఆదేశాలు జారీ చేశారు.

పక్కా ప్లానింగ్ తోనే….

వైసీపీ గెల‌వ‌క‌పోతే విశాఖ నేత‌ల‌కు జ‌గ‌న్ చాకిరేవు త‌ప్పదు. అందుకే మంత్రి అవంతి శ్రీనివాస‌రావు నెత్తిన ఇది పెద్ద బాధ్యతే. ఈ క్రమంలోనే ఆయ‌న జీవీఎంసీలో ఆరో వార్డు నుంచి త‌న కుమార్తె డాక్టర్ ల‌క్ష్మీ ప్రియాంకను వైసీపీ కార్పొరేట‌ర్ అభ్యర్థిగా నిల‌బెట్టారు. జీవీఎంసీ మేయ‌ర్ బీసీ అవ్వడంతో డిప్యూటీ మేయ‌ర్‌ను ఓసీ + మహిళా కోటాలో అధిష్టానంతో ఏదోలా లాబీయింగ్ చేసుకుని డిప్యూటీ మేయ‌ర్ త‌న కుమార్తెకు ఇప్పించుకోవాల‌నే అవంతి శ్రీనివాస్‌ ప‌క్కా ప్లానింగ్‌తో ఉన్నారు. దీంతో అవంతికి అన్ని విధాలా జీవీఎంసీ ఎన్నిక ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది.

రాజధాని అంశం కూడా….

పైగా జీవీఎంసీ ప‌రిధిలో జ‌న‌సేన కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. ఇక్కడ తేడా వ‌స్తే అవంతి ఇజ్జత్ మొత్తం పోతుంది. విప‌క్షాలు… టీడీపీ వాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ర‌చ్చ చేస్తాయి. పైగా విశాఖ‌ను రాజ‌ధానిగా చేసినా ఉప‌యోగం లేద‌న్న భావ‌న ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్లేందుకు కాచుకుని ఉన్నాయి. వీట‌న్నింటికి చెక్ పెట్టాలంటే అవంతి శ్రీనివాస్‌ అటు కుమార్తెనే కాకుండా… ఇటు జీవీఎంసీపై వైసీపీ జెండా ఎగ‌ర వేసేలా చూడాలి. మ‌రి అవంతి శ్రీనివాస్‌ ఈ విష‌యంలో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో ? చూడాలి.

Tags:    

Similar News