అవంతిని ముంచనున్న పంచ గ్రామాలు ?

వైసీపీకి విశాఖ జిల్లాలో ఏకైక మంత్రిగా అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన ప్రమేయం లేకుండా అనేక కార్యక్రమాలు జరిగిపోతున్నా కూడా అవంతి మంత్రి కాబట్టి ఇటు జనాలూ [more]

Update: 2020-12-24 14:30 GMT

వైసీపీకి విశాఖ జిల్లాలో ఏకైక మంత్రిగా అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన ప్రమేయం లేకుండా అనేక కార్యక్రమాలు జరిగిపోతున్నా కూడా అవంతి మంత్రి కాబట్టి ఇటు జనాలూ అటు రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఆయన వైపే వేలెత్తి చూపిస్తారు. ఇక అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీలో సమస్యలు సాకారం కాలేదంటే ఒక ఎమ్మెల్యేగా కూడా ఆయన మీద జనాలు విరుచుకుపడతారు. ఇలా ఎడా పెడా వ్యతిరేకతను అవంతి మూటకట్టుకుంటున్నారు. అవంతికి దైవ భక్తి అధికమే. కానీ ఇపుడు ఆ సింహాద్రి అప్పన్నే అవంతికి అతి పెద్ద అగ్ని పరీక్ష పెడుతున్నారు.

పంచగ్రామాల చిచ్చు…..

ఇది అవంతి శ్రీనివాస్ తోనే వచ్చిన సమస్య కాదు, కానీ అవంతికి సింహాచలం భూముల విషయంలో వారసత్వంగా వచ్చిన సమస్య. పాతికేళ్ళ నాటి ఈ సమస్యను పరిష్కరించలేక ముఖ్యమంత్రులే చేతులెత్తేశారు. జగన్ కి ముందు నలుగురు ముఖ్యమంత్రులు ఈ సమస్యను దగ్గరుండి చూశారు. కానీ పరిష్కారం చూపలేకపోయారు. ఇపుడు అది జగన్ వద్దకు పంచాయతీకి వచ్చింది. ఈ పంచగ్రామాల భూ సమస్య వెనక చిక్కుముడులు కూడా ఎన్నో ఉన్నాయి. కోర్టులో కేసులు ఉన్నాయి. దాంతో దీన్ని పరిష్కరిస్తామని ఎవరైనా అంటున్నారే కానీ అయిదేళ్ల కాలం సరిపోవడంలేదు. మళ్ళీ ఎన్నికలు ఆ వెంటనే కొత్త ప్రభుత్వాలు, కమిటీలూ.. ఇలా కాలయాపనతో ఇక్కడ ప్రజలు విసిగిపోతున్నారు.

అల్టిమేటమేనా ?

సింహాచలం పంచగ్రామాల సమస్య ఇపుడు అవంతి శ్రీనివాస్ కి చికాకు పెట్టేలా ఉంది. ఇందులో కొన్ని గ్రామాలు అవంతి ప్రాతినిధ్యం వహించే భీమిలీలో ఉన్నాయి. దీంతో లాక్కోలేక పీక్కోలేక అన్నట్లుగా మంత్రికి ఈ సమస్య పట్టి పీడిస్తోంది. ఇక తాజాగా పంచగ్రామాల సమస్య విషయమై మంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలుగుదేశానికి ఆయుధాలుగా మారుతున్నాయి. ఇక్కడ భూములు తీసుకుని ఇళ్ళు కట్టుకున్న వారిని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆక్రమణదారులు అన్నారంటూ టీడీపీ నేతలు వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టేశారు. అర్హులకు న్యాయం చేస్తామని, అక్రమార్కుల భరతం పడతామని మంత్రి అనడమే ఇపుడు ముప్పు తెచ్చేలా ఉంది. టీడీపీ నేతల తీరు చూస్తూంటే అక్రమార్కులకు కూడా న్యాయం చేయమంటున్నారని వైసీపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నా కూడా ఈ సెగ ఇపుడు మంత్రికి నేరుగానే తగులుతోంది.

ఎదురీత తప్పదా…?

పంచ గ్రామాల సమస్యను పరిష్కరించిన మీదటనే మంత్రి అవంతి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగాలని బాధిత ప్రజల తరఫున తెలుగుదేశం నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. చేయాలంటే ఇది హై లెవెల్లో ఉంది. కోర్టుల్లో ఉంది. కమిటీలు వేసినా కూడా ప్రయోజనం కనిపించడంలేదు. దాంతో మంత్రి ఈ విషయంలో ఏం చేయలేక సతమతమవుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలుపు విషయం ఇపుడే డౌట్లో పెట్టేలా పంచగ్రామాల అంశాన్ని టీడీపీ హైలెట్ చేస్తోంది. మరి అవంతి శ్రీనివాస్ కి జగన్ వద్ద ఉన్న పలుకుపడి ఏంటో తెలియదు కానీ దాన్ని మొత్తంగా ఉపయోగించి అయినా బాధితులకు న్యాయం చేయకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చినా భీమిలీ నుంచి పోటీ చేయడానికి అవంతికే బెదురు పుట్టవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News