అవంతి గొంతు చించుకున్నా ఫలితం లేదా?

ఎక్కడైనా గురువు కానీ రాజకీయాల్లో కాదని ఊరకే అంటారా. రాజకీయాల్లో గురువుకి పంగనామాలు పెడితే తప్ప ముందుకు వెళ్లలేరు. ఇది పాలిటిక్స్ నేర్పిన పరమ సత్యం. ఇక్కడ [more]

Update: 2020-08-13 00:30 GMT

ఎక్కడైనా గురువు కానీ రాజకీయాల్లో కాదని ఊరకే అంటారా. రాజకీయాల్లో గురువుకి పంగనామాలు పెడితే తప్ప ముందుకు వెళ్లలేరు. ఇది పాలిటిక్స్ నేర్పిన పరమ సత్యం. ఇక్కడ గురువు ఎవరు అంటే గంటా శ్రీనివాసరావు, శిష్యుడు వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్. గంటాది ఇరవయ్యేళ్ల రాజకీయమైతే శిష్యుడిది పదేళ్ల ప్రయాణం. గంటా కూడా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పదేళ్ళకే మంత్రి అయ్యారు. మధ్యలో ఎంపీ, ఎమ్మెల్యేగా పదవులు వరసగా గెలిచారు. అంతే కాదు, పార్టీలు, నియోజకవర్గాలు కూడా మార్చారు. అవంతి శ్రీనివాస్ కూడా డిటో డిటో. అందుకే గురువుని మించిన శిష్యుడికి గంటా అంటే పడడంలేదంటారు.

గేట్లు మూయాల్సిందే….

గంటాకు వైసీపీలో నో ఎంట్రీ అని మంత్రి హోదాలో అవంతి శ్రీనివాస్ గొంతు చించుకుంటున్నాడు. తనకు రాజకీయ బిక్ష పెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన గురువుకు వైసీపీలో చోటు లేదని చెప్పేస్తున్నాడు. అందుకోసం మాటల దాడి చేశాడు, ఇపుడు చేతలకు దిగుతున్నారు. భీమిలీలో తన వర్గం చేత గంటాకు వ్యతిరేకంగా భారీ నిరసనలు వినిపిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో గురువు రావద్దు, ఇదే శిష్యుడి నినాదం, అందుకోసం ఎందాకైనా అన్నట్లుగా ఆయన తీరు ఉంది.

ఈయన అంతేగా….?

ఇక మరో శిష్యుడు ఉన్నాడు. ఈయనకు అవంతి శ్రీనివాస్ గురువు. ఏ విధంగా అంటే రాజకీయంగా మాత్రం కాదు, అవంతి పెట్టిన కళాశాల‌ల్లో విద్యాబుద్ధులు గరపి అదే అవంతి చేతిలో ఓడిన శిష్యుడు. రాజకీయంగా పై చేయి సాధించడానికి ఎక్కడ చాన్స్ దొరికినా వదలుకోలేని శిష్యుడు. తాను మొదటి నుంచీ పార్టీలో ఉంటే తనను కాదని మంత్రి పదవి కొట్టేసిన గురువు అవంతి శ్రీనివాస్ మీద పీకబండెడు కోపం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ ఆమరనాధ్ కి ఉంది. దాంతో ఆయన్ని గత ఏడాదిగా వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. ఇపుడు సరైన సమయం చూసి గంటాను వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా గురువు గారికి బాగానే గుణపాఠం చెప్పాలనుకుంటున్నాడు. గంటా రావడం ఖాయమైన వేళ తన గురువు అవంతి శ్రీనివాస్ కి దిమ్మదిరికే షాకేనని మురిసిపోతున్నాడు. మరో వైపు వైసీపీలో తనకు ఉన్నత పదవులూ, టికెట్లు రావడానికి కారణమైన గురువు విజయసాయిరెడ్డికి కూడా టొకరా ఇచ్చేసిన సిసలైన శిష్యుడు గుడివాడ మరి.

గుగ్గురువేగా…

గురువులకు గురువు గుగ్గురువు అంటారు. అలాంటి వారు గంటా శ్రీనివాసరావు, తాను నేర్పిన విద్యలే తన ముందు ప్రదర్శించే శిష్యులను అదుపు చేయడానికి కొత్త విధ్యను బయటకు తీయడం గంటాకు ఎపుడూ అలవాటే. పెదవి విప్పకుండా పని కానిచ్చేయడంతో గంటా సాటి మరొకరు లేరుగా. తాను ఇంకా టీడీపీలోనే ఉన్నారు. వైసీపీలో మాత్రం శిష్యుడు అవంతి శ్రీనివాస్ కి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అంతేకాదు ఉత్తరాంధ్రా నయా గురువు విజయసాయిరెడ్డికి కూడా గట్టిగా చెక్ చెప్పేస్తున్నారు. మొత్తానికి ఒక్క దెబ్బకు అందరినీ పక్కకు నెట్టి గంటా వైసీపీలోకి ఇస్తున్న బిగ్ ఎంట్రీ ఇపుడు గురువుల పరువు.. బరువూ ఏంటో చెబుతోంది. చూడాలి రింగ్ మాస్టర్ గంటా రాజకీయం వైసీపీలో ఎలా పండుతుందో.

Tags:    

Similar News