అవంతి అవధి దాటేస్తున్నారా ?

వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి ముక్కునే కోపం ఉంటుందని అంటారు. ఆయనకు రాజకీయ వ్యూహాలు ఉన్నాయి కానీ దాన్ని మించి ఆవేశం ఉండడం చేత ఇబ్బందిపడుతున్నారని [more]

Update: 2020-08-10 12:30 GMT

వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి ముక్కునే కోపం ఉంటుందని అంటారు. ఆయనకు రాజకీయ వ్యూహాలు ఉన్నాయి కానీ దాన్ని మించి ఆవేశం ఉండడం చేత ఇబ్బందిపడుతున్నారని అంటున్నారు. తాజాగా ఆయన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ మీద మండిపడ్డారు. గంటాను ఫిరాయింపు నేతగా అభివర్ణించారు. ఆయనకు గోడ దూకడం అలవాటు అంటూ సెటైర్లు వేశారు. గంటా అధికార పార్టీలోనే ఎపుడూ ఉంటారని కూడా చెప్పుకొచ్చారు. కేసుల నుంచి తప్పించుకొవడానికే గంటా వైసీపీలోకి రావడానికి చూస్తున్నారని కూడా హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

దొడ్డిదారినా…?

గంటా వైసీపీలోకి వచ్చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ చెప్పకనే చెప్పేస్తున్నారు. దొడ్డి దారిన వైసీపీలోకి రావడానికి గంటా చూస్తున్నారు అని అవంతి చేసిన విమర్శలు చూస్తూంటే వైసీపీలోకి మాజీ మంత్రి రావడం ఖాయమని తేలిపోతోంది. ఇక దాన్ని తట్టుకోలేక అవంతి బయటపడిపోతున్నారు. తన మాజీ గురువు తన పక్కనే ఉంటే తనకు వైసీపీలో ప్రాముఖ్యత తగ్గిపోతుందని ఆలోచిస్తున్నట్లుగా ఉంది. అయితే అవంతి శ్రీనివాస్ తో పోలిస్తే గంటా బలమైన నాయకుడనే జగన్ ఆయన్ని తెస్తున్నారని వైసీపీలో మరో వైపు చర్చ సాగుతోంది. ఇప్పటికే వైసీపీలో ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో అవంతి శ్రీనివాస్ కి సఖ్యత లేదు. తాజా పరిణామాలతో ఆయన ఇటు హైకమాండ్ దృష్టిలో కూడా పడ్డారని అంటున్నారు.

జగన్ మీదనే ……

గంటా శ్రీనివాస్ అవినీతిపరుడు, ఆయన మంత్రిగా ఉన్నపుడే విశాఖ‌లో భూ కుంభకోణం జరిగిందని అవంతి శ్రీనివాస్ అంటున్నారు. ఇక గంటా చూసిన విద్యా మంత్రిత్వ శాఖలో సైకిల్ కుంభకోణం చోటు చేసుకుందని అవంతి శ్రీనివాస్ గట్టిగా తగులుకుంటున్నారు. అటువంటి గంటాను తీసుకువస్తే పార్టికి ఇబ్బందే అన్న తీరున ఆయన మాట్లాడుతున్నారు. అయితే గంటాను పార్టీలోకి తీసుకోవాలనుకుంటోంది స్వయంగా ముఖ్యమంత్రి జగన్. మరి గంటాను రావద్దు అనడానికి అవంతి శ్రీనివాస్ ఎవరు అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఒక విధంగా జగన్ నిర్ణయాన్నే అవంతి ధిక్కరిస్తున్నారా అన్న సౌండ్ కూడా పార్టీలో ఉంది.

కష్టమేనా ….?

అవంతి శ్రీనివాస్ అయినా అయిదేళ్ళు అధికార తెలుగుదేశంలో ఉంటూ ఎన్నికల వేళ కదా వైసీపీలో చేరింది. ఆయన వస్తూనే ఇక్కడ మంత్రిగా అయిపోయారు. పాతకాపులుగా పార్టీని పట్టుకుని పదేళ్ళుగా పనిచేస్తున్న వైసీపీ నేతలు ఎంతమంది ఉన్నా కూడా అవంతి శ్రీనివాస్ ని జగన్ మినిస్టర్ని చేశారు కదా అని సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. జగన్ కావాలనుకున్నారు, అవంతి వచ్చారు, ఆనాడు తాము ఏమీ అభ్యంతరం పెట్టలేదు కదా, ఇపుడు గంటా కావాలని ఇదే జగన్ అనుకుంటున్న వేళ అవంతి శ్రీనివాస్ అడ్డుపెట్టడం ఎందుకు అన్నది వైసీపీలో ఇతర నాయకుల మాట. పైగా జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే అదే సుప్రీం. దాన్ని మళ్లీ మీడియా ముందు పెట్టి రచ్చ చేయాలనుకుంటే రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజుకు పట్టిన గతే పడుతుందని కూడా అంటున్నారు. ఇవన్నీ తెలిసేనా అవంతి శ్రీనివాస్ ఇలా బాహాటంగా గంటా రాకను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు అని కూడా అంటున్నారు. జగన్ని ఎదిరించి పార్టీలో ఉందామనుకుంటే కుదరదు అని కూడా క్లారిటీగా చెబుతున్నారు. మొత్తానికి గంటా రాక అన్నది అవంతి శ్రీనివాస్ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగని బయటకు అనకుండా ఉండలేకపోతున్నారు. ఏది ఏమైనా అవంతికి ఇపుడు వైసీపీలో కష్టాలు ఒక్కసారిగా వచ్చిపడ్డాయని అంటున్నారు.

Tags:    

Similar News