అవంతి అవుటేనటగా.. ఈయనతో పాటు ఆమె కూడా ?

జగన్ విస్తరణ అంటూ చేపడితే ఉత్తరాంధ్రాలో అర్జంటుగా ఇద్దరి మంత్రుల పదవులకు గండం ఉందని ప్రచారం సాగుతోంది. వారిలో అక్షర క్రమంలో మొదటివారు అయిన మంత్రి అవంతి [more]

Update: 2020-07-03 13:30 GMT

జగన్ విస్తరణ అంటూ చేపడితే ఉత్తరాంధ్రాలో అర్జంటుగా ఇద్దరి మంత్రుల పదవులకు గండం ఉందని ప్రచారం సాగుతోంది. వారిలో అక్షర క్రమంలో మొదటివారు అయిన మంత్రి అవంతి శ్రీనివాస్ బెర్త్ ఖాళీ అవుతుందని అంటున్నారు. టూరిజం మంత్రిగా అవంతి పనితీరు జగన్ కి అసలు నచ్చడంలేదుట. ఆయన రాజకీయంగానూ పెద్దగా ప్రభావం చూపడంలేదని అంటున్నారు. అతి పెద్ద విశాఖ జిల్లాకు ఏకైక‌ మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ ప్రతిపక్ష టీడీపీ దూకుడుని అడ్డుకోవడంతో ఘోరంగా విఫలం చెందారని పార్టీకి నివేదికలు ఉన్నాయని చెబుతున్నారు.

ఎందుకిలా …?

అవంతి శ్రీనివాస్ ని గత ఎన్నికల ముందు వైసీపీలోని జగన్ తీసుకున్నారు. బలమైన కాపు సామాజికవర్గం నేతగా, మాజీ మంత్రి గంటాకు అనుచరుడిగా ధీటైన పోటీ ఇవ్వగలరని, విశాఖ జిల్లా రాజకీయాల్లో వైసీపీదే పై చేయిగా ఉంచుతారని భావించారు. కానీ ఏడాది గడచిపోయినా అవంతి శ్రీనివాస్ పనితీరులో మార్పు లేదు. అధికారులతో సమన్వయం లేదు, పార్టీ ఎమ్మెల్యేలతో కలసి కూర్చున్నది లేదు, ఇక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లాంటి వారు మాటలతో చెడుగుడు ఆడుతూంటే, మత్తు డాక్టర్ సుధాకర్ లాంటి వారు రోడ్ల మీదకు వచ్చి సర్కార్ని తూర్పరా పడుతూంటే జిల్లా మంత్రిగా అవంతి శ్రీనివాస్ నియంత్రించలేకపోయారని విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. అన్నింటికీ మించి విశాఖ నగరంలో ఇసుమంత అయినా వైసీపీ రాజకీయ బలాన్ని అవంతి శ్రీనివాస్ పెంచలేకపోయారని అసంతృప్రి వైసీపీ పెద్దల్లో ఉంది.

మౌనమేనా…?

ఇక విజయనగరం జిల్లావరకూ వస్తే ఉప ముఖ్యమంత్రి వంటి కీలకమైన పదవిని కేవలం 31 ఏళ్ళకే పుష్ప శ్రీవాణికి దక్కింది. ఆ పదవి విలువ గౌరవం పెంచాల్సిన మంత్రి గారు తన‌కేం పట్టనట్లుగా ఉండిపోతున్నారు. ఆమె చేయాల్సింది చాలానే ఉంది. ఆరు గిరిజన అసెంబ్లీ సీట్లు ఉత్తరాంధ్రాలో ఉన్నాయి. అవన్నీ కూడా వైసీపీ పరం అయ్యాయి. అటువంటి చోట పార్టీని పటిష్టం చేస్తూ అభివ్రుధ్ధి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఆమె మీద ఉంది. కానీ ఆమె కురుపాం నుంచి బయటకు రావడంలేదు. జిల్లాలో అధికారులతో సమీక్షలు నిర్వహించడంలేదు. మరో మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో కీలకం అవుతున్న వేళ జిల్లాలో పట్టు కోసం ఆమె ప్రయత్నం చేయలేదు, వైసీపీకి అండగా లేరన్న విమర్శలూ ఉన్నాయి. ఇక ఆమె గడచిన కాలంలో కనీసంగా కూడా మీడియా ముందుకు వచ్చి ఎక్కువగా మాట్లాడిందీ లేదు. దీంతో ఉప ముఖ్యమంత్రి పదవి ఆమెకు భారమైందా అన్న చర్చ కూడా వస్తోంది. దాంతో ఆమెకు ఉద్వాసన ఖాయమని వార్తలు వస్తున్నాయి.

ధర్మానకే…?

ఇక జగన్ ఉత్తరాంధ్రాలో ఉన్న ఇద్దరు బీసీ మంత్రుల్లో వెలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన కృష్ణ దాస్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. అంటే పుష్ప శ్రీవాణి పదవి పోయినట్లేనని చెబుతున్నారు. కృష్ణ దాస్ విధేయత, నిజాయతీతో పాటు వెలమలకు మరింత రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ అనుకోవడంతో డిప్యూటీ సీఎం అవుతారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్రా నుంచి మరో ఇద్దరు కొత్త వారికి పదవులు దక్కుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అవంతి, పుష్ప శ్రీవాణిల అవుట్ ఖాయమని, బంగారం లాంటి చాన్స్ వారు మిస్ చేసుకున్నారని వైసీపీలో వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News