కాని వాడు అయ్యారు….స్కోర్ చేయలేక పోతున్నారు

ఆయన ఉన్న పార్టీ, వదిలి వెళ్ళిన పార్టీ రెండూ కూడా టార్గెట్ చేస్తున్నాయి. నిజానికి అవంతి శ్రీనివాస్ కి కోపం తప్ప రాజకీయం పెద్దగా తెలియదు అని [more]

Update: 2020-05-15 14:30 GMT

ఆయన ఉన్న పార్టీ, వదిలి వెళ్ళిన పార్టీ రెండూ కూడా టార్గెట్ చేస్తున్నాయి. నిజానికి అవంతి శ్రీనివాస్ కి కోపం తప్ప రాజకీయం పెద్దగా తెలియదు అని అంటారు. అందుకే ఆయన తానున్న వైసీపీలోనే మార్కులు స్కోర్ చేయలేకపోతున్నారు. మరో వైపు చూసుకుంటే జగన్ కి కుడి భుజం లాంటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో విభేధాలు పెంచుకుంటున్నారు. ఇక సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కూడా అవంతి శ్రీనివాస్ సంపాదించలేకపోయారు. ఏడాది అవుతున్నా పట్టుని సాధించలేని విఫల మంత్రిగా వైసీపీయే ముద్ర వేసింది. ఇక టీడీపీ అయితే అవంతి శ్రీనివాస్ తో చెడుగుడు ఆడేస్తోంది. తాజాగా టీడీపీ నేతలు అవంతి శ్రీనివాస్ ని పట్టుకుని మంత్రిగా అసలు పనికి రారు అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో అవంతికి ఇంటా బయటా ఉక్క బోత ఎక్కువైపోతోంది. ఏడాదికే అమాత్య హోదా చుక్కలు చూపించేస్తోంది.

నలుగురితోనే …

అవంతి శ్రీనివాస్ కి ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. విశాఖ వంటి పెద్ద జిల్లాకు తాను ఏకైన మంత్రిని కాబట్టి తన హవా చాటుకోవాల‌ని ఆరాటం, ఉబలాటం ఎక్కువగానే ఉంది. కానీ సరైన వ్యూహాలు లేకపోవడంతో ఎక్కడికక్కడ అవంతి శ్రీనివాస్ దొరికిపోతున్నారు. అధికారం దర్జా చూపించాలనుకుంటే ముందు సొంత పార్టీని విశ్వాసంలోకి తీసుకోవాలి. వారిని మద్దతుగా చేసుకోవాలి. కానీ అవంతి శ్రీనివాస్ కి ఆ కలివిడితనం లేదని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయన ఎపుడూ జిల్లాలో నలుగురితో నారాయణ అన్నట్లుగా ఒక మంత్రిగానే ఉన్నారు. ఇంచార్జి మంత్రిగా కన్నబాబు, పొరుగు జిల్లా నుంచి సీనియర్ మంత్రిగా బొత్స సత్యనారాయణ వంటి వారిని కూడా విశాఖ వ్యవహారాలు చూడమని జగన్ కీలక బాధ్యతలు అప్పగించడంతో అవంతి శ్రీనివాస్ తెగ నొచ్చుకుంటున్నారుట.

విభీషణుడా…?

అవంతి శ్రీనివాస్ ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా వచ్చి కాంగ్రెస్ లో అడుగు పెట్టి, టీడీపీలో చేరి ఎంపీ అయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరి మంత్రి అయిపోయారు. కేవలం పదేళ్ళ రాజకీయ జీవితంలో నాలుగు పార్టీలు మారారు. దీంతో ఆయన్ని విభీషణుడు అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ అవంతి శ్రీనివాస్ ని గట్టిగా టార్గెట్ చేస్తోంది. తమ పార్టీలో ఉండి అయిదేళ్ళ పాటు ఎంపీ పదవిని అనుభవించి ఎన్నికల వేళ దెబ్బ తీసి వైసీపీలోకి వెళ్ళారని, దాని ప్రభావం జిల్లా మొత్తం మీద పడిందని టీడీపీ భావిస్తోంది. దాంతో అవంతి శ్రీనివాస్ ని తరచూ టార్గెట్ చేసి విమర్శలు చేస్తంది. అవంతిని చేతకాని మంత్రి అంటూ టీడీపీ విశాఖ ప్రెసిడెంట్ వాసుపల్లి గణేష్ కుమార్ అంటున్నారు.

వలస జీవి అట…

ఇక అంతటితో ఊరుకోవడంలేదు. అవంతి శ్రీనివాస్ వలస జీవి అని, ఇతర జిల్లాల నుంచి వచ్చి విశాఖలో రాజకీయం చేస్తున్నారని వాసుపల్లి విమర్శిస్తున్నారు. ఆయనకు విశాఖ గురించి ఏమి తెలుసు అంటూ తగులుకుంటున్నారు. ఓ వైపు సొంత పార్టీలో తనకు మర్యాద తక్కువపోతోందని, మంత్రి హోదాను పూర్తిగా అనుభవించలేకపోతున్నానని మధన పడుతున్న అవంతి శ్రీనివాస్ కి టీడీపీ నుంచి దూసుకువస్తున్న బాణాలు గుక్కతిప్పుకోనీయడంలేదు. మంత్రి స్థాయి వ్యక్తి మీద టీడీపీ హాట్ కామెంట్స్ చేస్తూంటే అవంతికి మద్దతుగా వైసీపీలో నేతలు ఎవరూ పెదవి విప్పకపోవడం చిత్రం.

అర్ధమయ్యేసరికి…?

వైసీపీకి అవంతి శ్రీనివాస్ కాని వాడు అయ్యాడు, టీడీపీకి పరాయివాడు అయ్యారు. మొత్తం మీద చూసుకుంటే మంత్రిగా ప్రమాణం చేశారన్న మాటే కానీ అవంతి శ్రీనివాస్ కి నిందలు తప్ప గంటా మాదిరిగా జిల్లాను శాసించాలన్న కోరిక మాత్రం తీరడం లేదు. అయితే ఇక్కడ ఆయనతో పాటు చాలా మందికి అర్ధం కాని విషయం ఏంటి అంటే పదవి వచ్చినా కూడా దాన్ని పదింతలు పెంచుకుని దర్జా చేసే ఎత్తుగడలు వ్యూహాలు ఉండాలి. లేకపోతే ఎంత పెద్ద సింహాసనం అయినా కూడా మామూలుగానే ఉంటుంది మరి. అవంతి శ్రీనివాస్ ఈ రాజకీయం అర్ధం చేసుకునేసరికి ఆయన రెండున్నరేళ్ళ మంత్రి పదవీ కాలం పూర్తవుతుందేమో.

.

Tags:    

Similar News