అవంతిలో అస‌హ‌నం క‌ట్టలు తెగుతోందా..? ఏం జ‌రిగింది..?

విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు, మంత్రి అవంతి శ్రీనివాస‌రావు తీవ్ర అస‌హ‌నంలో మునిగి పోయారా ? ఇటీవ‌ల కాలంలో ఆయ‌న తీవ్రంగా మాన‌సిక క్షోభ‌కు [more]

Update: 2020-05-03 05:00 GMT

విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు, మంత్రి అవంతి శ్రీనివాస‌రావు తీవ్ర అస‌హ‌నంలో మునిగి పోయారా ? ఇటీవ‌ల కాలంలో ఆయ‌న తీవ్రంగా మాన‌సిక క్షోభ‌కు గుర‌వుతున్నారా ? వైసీపీకే చెందిన కీలక నేత వ్యవ‌హారంతో అవంతి ఇబ్బంది ప‌డుతున్నారా ? అంటే.. విశాఖ రాజ‌కీయ విశ్లేష‌కులు ఔన‌నే అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. టీడీపీలో ఎంపీగా ఉన్న స‌మయంలో ఆయ‌న రాజ‌కీయంగా చేయ‌డానికేం లేకుండా పోయింది. ఇక మంత్రి అవ్వాల‌న్న కోరిక‌తో పార్టీ మారి వైసీపీ త‌రఫున ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకుని మొత్తానికి మంత్రి అయ్యారు. కీల‌క‌మైన విశాఖ జిల్లా నుంచి ఏకైక మంత్రి కావ‌డంతో జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌కు తిరుగు ఉండ‌ద‌నే ఆయ‌న అనుకున్నారు.

పాత పార్టీల నేతలపైనే….?

ఎక్కడా మొహ‌మాటం కూడా లేకుండా త‌న పాత పార్టీ టీడీపీపై విమ‌ర్శలు ఎక్కుపెడుతున్నారు. అదే స‌మయంలో స‌మ‌యానికి త‌గిన విధంగా స్పందిస్తూ.. త‌న ప‌రిధిలో ప్రభుత్వంపై ఎక్కడా విమ‌ర్శలు రాకుండా ప‌నిచేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ‌ను రాజ‌ధానిగా చేస్తామ‌ని సీఎం జ‌గ‌న్ ప్రక‌టించిన త‌ర్వాత అవంతి శ్రీనివాస‌రావు దానికి అనుకూలంగా విశాఖ‌లో జ‌న‌స‌మీక‌ర‌ణ చేశారు. ఇక‌, క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలోనూ ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్యల‌ను ఆయ‌న ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్లారు. విప‌క్షం టీడీపీ చేసిన విమ‌ర్శల‌పై త‌న‌దైన శైలిలో ఆయ‌న కౌంట‌ర్లు ఇచ్చారు.

విజయసాయి రెడ్డి జోక్యంతో…..

ఇలా దూసుకుపోతున్న అవంతి శ్రీనివాస‌రావు గ‌త కొద్ది వారాలుగా సైలెంట్ అయిపోయారు. ఆయ‌న రాజ‌కీయంలో దూకుడు.. మాట‌ల్లో ప‌దును త‌గ్గింద‌న్న టాక్ అయితే వ‌చ్చేసింది. దీని వెనుక అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. వైసీపీలో మ‌రో కీల‌క నాయ‌కుడు, ఎంపీ, ఉత్తరాంధ్ర జిల్లాల స‌మ‌న్వయ‌క‌ర్తగా బాధ్యత‌లు నిర్వహిస్తున్న విజ‌య‌సాయి రెడ్డి దూకుడు కార‌ణంగానే మంత్రి హ‌ర్ట్ అయ్యార‌ని విశాఖ రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో మంత్రి అవంతితో క‌లిసి నిర్వహిస్తున్న మీడియా స‌మావేశాల్లో మంత్రికి ప్రాధాన్యం లేకుండా అన్నీతానై వ్యవ‌హ‌రించ‌డంతో అవంతి శ్రీనివాస‌రావు మ‌న‌స్థాపానికి గుర‌య్యార‌ట‌.

బుజ్జగించినా….

అక్క‌డతో ఆగ‌ని విజ‌య‌సాయి జిల్లా అధికారుల‌తో తానే స‌మావేశాలు పెట్టేస్తున్నారు. చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్యటిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు అంద‌రూ విజ‌య‌సాయికే ప్రయార్టీ ఇస్తుండ‌డంతో అవంతి శ్రీనివాస‌రావు ప్రాధాన్యత చాలా వ‌ర‌కు త‌గ్గిన‌ట్టే ఉంది. ఈ అస‌హ‌నంతోనే అవంతి శ్రీనివాస‌రావు కొద్ది రోజుల క్రితం విశాఖ నుంచి విజ‌య‌వాడ‌కు మ‌కాం మార్చేశార‌ట‌. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టి విజ‌య ‌సాయి రెడ్డి మ‌ళ్లీ అవంతిని బుజ్జగించేందుకు ప్రయ‌త్నించారు. ఈ క్రమంలోనే గ‌తంలో పార్టీలోకి తీసుకో వాల‌ని భావించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుపై తీవ్ర విమ‌ర్శలు చేశారు. ఆయ‌న పార్టీలోకి వ‌చ్చి నా తీసుకోబోమ‌ని క‌రాఖండీగా చెప్పారు. మొత్తానికి ఈ వ్యవ‌హారం అవంతి శ్రీనివాస‌రావుని ఏమేర‌కు శాంతింప‌జేసిందో తెలియ‌దు కానీ.. ఆయ‌న మాత్రం ఇప్ప‌టికీ గ‌తంలో ఉన్నంత జోష్‌తో అయితే ఉండ‌డం లేద‌న్న చ‌ర్చ విశాఖ రాజ‌కీయాల్లో కొన‌సాగుతోంది.

Tags:    

Similar News