గురువు ఎగరేసుకుపోయారే….!!

ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా…? అన్న ఒక సినీ డైలాగ్ విశాఖ రాజకీయాలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. కొంత కాలంగా రాజకీయ పోరాటం చేస్తున్న ఆ గురుశిష్యుల్లో చివరకు గురువుదే [more]

Update: 2019-07-04 09:30 GMT

ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా…? అన్న ఒక సినీ డైలాగ్ విశాఖ రాజకీయాలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. కొంత కాలంగా రాజకీయ పోరాటం చేస్తున్న ఆ గురుశిష్యుల్లో చివరకు గురువుదే పై చేయి అయింది. విశాఖజిల్లాలో గుడివాడ కుటుంబానికి మంచి పేరుంది. గుడివాడ గురునాధరావుకు విశాఖ రూరల్ జిల్లాలో ఉన్న పేరు ప్రఖ్యాతులతో ఆయన తనయుడు గుడివాడ అమర్ నాధ్ రాజకీయాల్లోకి వచ్చారు. అవంతి శ్రీనివాసరావు గుడివాడ అమర్ నాధ్ కు గురువు.

ఆయన కళాశాలలోనే….

గుడివాడ అమరనాధ్ అవంతి కళాశాలలోనే ఇంజనీరింగ్ చదువు కున్నారు. అవంతి శ్రీనివాసరావు ఒకరకంగా విద్యలో కూడా అమర్ నాధ్ కు గురువు కిందే లెక్క. అయితే రాజకీయాల్లోకి వచ్చిన అమర్ నాధ్ 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా వైసీపీ టిక్కెట్ పైన పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాసరావు పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి ఎన్నికలలో గురువు చేతిలో శిష్యుడు అమర్ నాధ్ ఓటమి పాలయ్యారు.

మంత్రి పదవి అయినా….

అయితే అవంతి శ్రీనివాసరావు ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, మంత్రి నవ్వాలన్న బలమైన కోరిక ఉండటంతో వైసీపీ లో చేరి భీమిలి టిక్కెట్ సంపాదించారు. చివరకు భీమిలి నుంచి విజయం సాధించి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. గుడివాడ అమర్ నాధ్ ఈసారి అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

మరోసారి ఓడిపోయి…..

జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచి పదేళ్ల పాటు పార్టీకోసం కష్టపడిన తనకు మంత్రి పదవి దక్కుతుందని గుడివాడ అమర్ నాధ్ భావించారు. కానీ అనూహ్యంగా జగన్ తొలి మంత్రివర్గంలో అవంతి శ్రీనివాసరావు చోటు సంపాదించుకోవడంతో మరోసారి గురువు చేతిలో శిష్యుడు ఓడిపోయారు. కానీ రెండో దఫా జరిగే మంత్రి వర్గ విస్తరణలో తనకు ఖచ్చితంగా అవకాశముంటుందని అమర్ నాధ్ భావిస్తున్నారు. గురువు చేతిలో వరుస ఓటములతో అమర్ నాధ్ డీలా పడిపోయారు.

Tags:    

Similar News