అవంతి…గంటా… మళ్ళీ వార్ ?

ఒకప్పుడు ఇద్దరూ స్నేహితులే. సన్నిహితులే. కానీ రాజకీయమే విడదీసింది. దాంతో చెరో వైపూ అయ్యారు. అధికారంలో అవంతి శ్రీనివాసరావు ఉంటే విపక్షంలో గంటా శ్రీనివాసరావు తేలారు. గంటా [more]

Update: 2021-02-18 15:30 GMT

ఒకప్పుడు ఇద్దరూ స్నేహితులే. సన్నిహితులే. కానీ రాజకీయమే విడదీసింది. దాంతో చెరో వైపూ అయ్యారు. అధికారంలో అవంతి శ్రీనివాసరావు ఉంటే విపక్షంలో గంటా శ్రీనివాసరావు తేలారు. గంటా ఎన్నడూ ఊహించని పొజిషన్ ఇది. మరో వైపు వైసీపీలోకి రావాలని గంటా చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికపుడు తిప్పికొడుతున్న అవంతి శ్రీనివాసరావు ఇపుడు కూడా అదే పని చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పేరిట మాజీ మంత్రి గారు జనంలోకి వచ్చేశారు. నాన్ పొలిటికల్ జేఏసీ అంటున్నారు.

నిబద్ధత ఉందా…?

గంటా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకుండా నాన్ పొలిటికల్ జేఏసీ అనడమేంటని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు. దీని కంటే ముందు ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేయకుండా పోరటం చేయడమేంటని కూడా నిందించారు. గంటా పోరాటంలో చిత్తశుద్ధి లేదని కూడా ఆయన తప్పుపడుతున్నారు. ఇంతకీ గంటా పోరాటం పంధా ఏంటని కూడా ఎకసెక్కమాడుతున్నారు.

రెండుగా చీలి…

ఇక ఉక్కు పోరాటాన్ని కూడా ఇద్దరు నేతలూ విడివిడిగా నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర మంత్రి మీటింగ్ పెడితే సిటీలో గంటా అఖిల పక్షం అంటున్నారు. అక్కడా ఇక్కడా ఉక్కు కార్మిక నాయకులే కనిపిస్తున్నారు. తమకు విశాఖ ఉక్కు ముఖ్యమని ఎవరు పోరాటానికి ముందుకు వచ్చినా సమ్మతమేనని కార్మిక నేతలు అంటున్నారు. మరో వైపు స్టీల్ ప్లాట్ ప్రైవేటీకరణ లాంటి అతి పెద్ద సమస్య వచ్చినా కూడా ఇద్దరు నేతలూ రాజకీయమే చూసుకుంటున్నారని విమర్శలు వచ్చిపడుతున్నాయి.

చెక్ చెప్పాలనే …?

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఓవైపు ఎగిసిపడుతోంది. దాన్ని కంట్రోల్ లో పెట్టడమే కాదు వీలైతే నాయకత్వం వహించేవాడే నాయకుడు. వైసీపీకి చెందిన మంత్రిగా అవంతి శ్రీనివాసరావు మీద ఇపుడు ఆ గురుతర బాధ్యత ఉంది. వైసీపీకి ఉక్కు సెగ తగలకుండా చూడాల్సిన కర్తవ్యం కూడా అవంతి శ్రీనివాసరావు దే. మరో వైపు అవంతి కంటే దూకుడుగా ముందుకు సాగుతూ గంటా వైసీపీ పెద్దల కంట్లో పడే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఇపుడు ఉక్కు ఉద్యమం కాదు కానీ ఈ ఇద్దరు నేతల మధ్యన పోటీ ఏర్పడింది. దీంతో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడంతోనే టైమ్ సరిపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ వైపు గంటా చేరకుండా చూడడమే అవంతి శ్రీనివాసరావు పోరాటం అయిందని ఓ వైపు వినిపిస్తూంటే స్టీల్ ప్లాంట్ పేరిట తన రాజకీయానికి గంటా తెర తీశారని మరో వైపు అంటున్నారు.

Tags:    

Similar News