అందులో అవంతి ఫుల్ సక్సెస్ అయ్యారటగా…?

విభీషణుడు పురాణ పాత్రధారి. రామాయణంలో ఆయనకు విశిష్ట స్థానమే ఉంది. రావణుడి తమ్ముడిగా శత్రు శిబిరంలో నిలిచి రాముడి మీద బాణాలు వేయాల్సిన విభీషణుడు అదే రాముడు [more]

Update: 2020-11-22 11:00 GMT

విభీషణుడు పురాణ పాత్రధారి. రామాయణంలో ఆయనకు విశిష్ట స్థానమే ఉంది. రావణుడి తమ్ముడిగా శత్రు శిబిరంలో నిలిచి రాముడి మీద బాణాలు వేయాల్సిన విభీషణుడు అదే రాముడు పంచన చేరి అన్న గారి మరణ రహస్యం సహా గుట్టుమట్లు మొత్తం చెప్పడంతో రాముడి గెలుపు సులువు అయింది. అలాంటి విభీషణులు వర్తమాన‌ రాజకీయాల్లో ఎందరో కనిపిస్తారు .ప్రతీ సీజన్ లో వారికే గిరాకీ ఉంటుంది. విశాఖలో చూసుకుంటే అలాంటి పాత్రను వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పోషిస్తున్నారా అన్న చర్చ అయితే గంటా వర్గీయుల్లో కలుగుతోందిట.

రాజకీయ బిక్ష పెడితే…?

నిజానికి అవంతి శ్రీనివాస్ గంటా డిస్కవరీ అంటారు. గంటా ప్రజారాజ్యంలో చేరిన తరువాత విశాఖ రాజకీయ వ్యవహరాలను ఆ పార్టీ తరఫున చూసుకున్నారు. ఎక్కడ ఎవరిని నిలబెట్టాలి అన్నది కూడా నాడు గంటా ఇచ్చిన సజెషనే. అలా గంటా నాటికి విద్యా సంస్థల అధినేతగా ఉన్న అవంతి శ్రీనివాస్ ని తెచ్చి భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దింపారు. లక్కీగా అవంతి గెలిచారు. గంటాకు ప్రియ శిష్యుడిగా కూడా ఉండేవారు. గంటా ఎలా అంటే అలా అనుస‌రించేవారు. ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ లోకి అటునుంచి టీడీపీలోకి గంటా బ్యాచ్ గానే అవంతి వచ్చారు. ఇక ఇద్దరికీ భీమిలీ సీటు విషయంలోనే చెడిందని అంటారు.

అన్నీ తెలుసుగా..?

అవంతి శ్రీనివాస్ 2014లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇక 2019 నాటికి తిరిగి భీమిలీ నుంచి పోటీ చేయాలన్నది ఆయన ప్లాన్. అయితే గంటా ససేమిరా అనడంతో అప్పటికే వారి మధ్యన పీక్స్ చేరిన విభేదాలతో పాటు , టీడీపీ గ్రాఫ్ పడిపోవడంతో అవంతి శ్రీనివాస్ రైట్ స్టెప్ తీసుకుని వైసీపీలోకి దూకేశారు. మంత్రి కూడా అయిపోయారు. నిజానికి నాడు అవంతి తదితరులతో కలసి వైసీపీలోకి వచ్చి తిరిగి మంత్రి కావాలనుకున్న గంటాకు అలా తొలి దెబ్బ అవంతి కొట్టారు. ఇపుడు మంత్రిగా ఉంటూ గంటాకు పూర్తిగా పొగ పెడుతున్నారని అంటున్నారు. అయిదేళ్ళ టీడీపీ ఏలుబడిలో గంటా ఆయన అనుచరులు చేసిన దందాల గుట్టు అంతా అవంతి దగ్గర ఉందని, అదే ఇపుడు వైసీపీకి ఆయుధంగా మారుతోందని అంటున్నారు.

అదే ప్లాన్ …?

గంటాను రాజకీయంగా ఇబ్బందులో పెడితే ఆయన వైసీఎపీ వైపు తొంగి చూడరని, ఇక్కడ తన బెర్త్ కి ముప్పు రాదని అవంతి శ్రీనివాస్ మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. ఆ విధంగా గంటా గుట్టు మట్లు అన్నీ కూడా ఆయన వైసీపీకి అందిస్తున్నారని గంటా అనుచరులు అనుమానిస్తున్నారు. ఇక జగన్ కూడా అవంతి మీద పూర్తి నమ్మకంతో ఉంటున్నారుట. అవంతి దగ్గర అవినీతి లేకపోవడం కూడా జగన్ మెచ్చడానికి మరో కారణం. అలాగే విజయసాయిరెడ్డితో కూడా మంచి రిలేషన్స్ ఇపుడు మెయిన్ టైన్ చేస్తున్న అవంతి అయిదేళ్ళు మంత్రిగా ఉంటారని కూడా అంటున్నారు. దాంతో గంటాను రాజకీయంగా బలహీనుడిని చేయడానికి అవంతి శ్రీనివాస్ వైసీపీకి ఆయుధంగా మారారని కూడా చర్చ సాగుతోంది.

Tags:    

Similar News