మంత్రి పదవి ఆయుష్షు పెంచుకోవ‌డానికేనా ?

విశాఖలో వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన చిరకాల కోరికగా మంత్రి పదవిని అందుకున్నారు. పైగా ఆయన అయిదేళ్ళు మంత్రిగా కొనసాగాలనుకుంటున్నారు. అంతే కాదు, విశాఖ వంటి [more]

Update: 2020-06-07 05:00 GMT

విశాఖలో వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన చిరకాల కోరికగా మంత్రి పదవిని అందుకున్నారు. పైగా ఆయన అయిదేళ్ళు మంత్రిగా కొనసాగాలనుకుంటున్నారు. అంతే కాదు, విశాఖ వంటి పెద్ద జిల్లాకు ఏకైక‌మంత్రిగా కూడా శాసించాలనుకుంటున్నారు. అటువంటి అవంతి శ్రీనివాస్ ఈ మధ్య తరచూ సవాళ్ళు చేస్తున్నారు. అది కూడా తన మంత్రి పదవి మీదనే చేస్తున్నారు. టీడీపీ నేతల మీద ఘాటు విమర్శలు చేస్తూ తన మంత్రి పదవికి లింక్ పెడుతున్నారు. అవంతి శ్రీనివాస్ సవాళ్ళను చూస్తూంటే ఆయనకు మంత్రి పదవి అంత తేలికైందా అన్న డౌట్లు రాక మానవు.

కబ్జాల మీదట…..

వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో భూ కబ్జాలు పెరిగాయని, గజం స్థలానికి కూడా గ్యారంటీ లేదని చంద్రబాబు నుంచి మాజీ మంత్రుల వరకూ అందరూ ఆరోపిస్తున్నారు. ఇది ఓ విధంగా రాజకీయ విమర్శగానే చూడాలి. ఎందుకంటే అసలు భూకబ్జాలు టీడీపీ హయాంలోనే జరిగాయి. బాబు సైతం వాటి మీద సిట్ విచారణకు ఆదేశించారు. మరి అంత జరిగిన తరువాత టీడీపీ మాటలు జనాలు ఎలా నమ్ముతారు. అయితే అనాలని టీడీపీ అంటూంటే మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం మరింతగా రెచ్చిపోతున్నారు. విశాఖలో ఒక్క గజం స్థలంలో భూకబ్జా జరిగిందని నిరూపించినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హూంకరిస్తున్నారు.

ఎటూ పోతుందిట…..

ఇలా సవాళ్ళు చేస్తున్నా కూడా అవంతి శ్రీనివాస్ ని ఇటు టీడీపీ కానీ, అటు వైసీపీ నేతలు కానీ సీరియస్ గా తీసుకోకపోవడమే ఇక్కడ కామెడీ. ఎటూ రెండేళ్ల తరువాత మంత్రి పదవి పోతుందని, ఇంతలో రంకెలు ఎందుకు అని పసుపు పార్టీ వారు సెటైర్లు వేస్తున్నారు. మంత్రికి అంత సీన్ లేదని కూడా అంటున్నారు. ఆయన చంద్రబాబుని సవాల్ చేసే స్థాయి ఉన్న నాయకుడే కాడని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మరో వైపు చూసుకుంటే వైసీపీలో కూడా మంత్రి అవంతి శ్రీనివాస్ కి మద్దతు దక్కడంలేదు. ఏడాది అయినా జిల్లాలో పార్టీని, ప్రభుత్వాన్ని పటిష్టం చేయలేని మంత్రి ఉత్త సవాళ్ళు ఎందుకు చేయడమని ఎకసెక్కం ఆడుతున్నారు. ఈ సవాళ్ళతో, చంద్రబాబు మీద విమర్శలతో తన పదవిని నిలబెట్టుకునే ఎత్తుగడలకు మంత్రి పాల్పడుతున్నారని కూడా సొంత పార్టీలో వినిపిస్తున్న మాట.

అయ్యో పాపమేనా…?

ఎంత సీరియస్ గా ఇటు తన రాజకీయ ప్రత్యర్ధి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ని, అటు టీడీపీ అధినేత చంద్రబాబుని అవంతి శ్రీనివాస్ పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవడంలేదు. దాంతో మంత్రి అవంతి శ్రీనివాస్ కి చిర్రెత్తుకొస్తోందట. ఒక మాటకు నాలుగు అని అలా వివాదం పెరిగితే తాను కూడా రాజకీయంగా పెరగవచ్చు అని మంత్రి ఆలోచిస్తున్నారని అంటున్నారు. అయితే జగన్ వద్ద ఇవేమీ సాగవని, పనితీరు ఆధారంగానే ఆయన పదవులు ఇస్తారని, ఇలా షార్ట్ కట్ మెథడ్స్. అవుట్ డేటెడ్ రాజకీయాలతో మంత్రి పదవి కొనసాగింపునకు గ్యారంటీ ఇవ్వరని కూడా సొంత పార్టీలోనే చెబుతున్నారు. కానీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం పదే పదే రాజీనామా చేసేస్తానని అంటున్నారు. ఒకవేళ అలాంటి సందర్భమే వచ్చి అదే నిజమైతే అవంతికి ఆనందమే ఆవిరి అవుతుందని కూడా అంటున్నారు.

Tags:    

Similar News