ఆ ప్లేస్ లో.. ఈ ఫేస్ కనపడ కూడదనేనా?

కొడితే.. ఏనుగు కుంభస్థలాన్ని మాత్రమే కొట్టాలన్నది సామెత. తనను అవమాన పర్చిన సభలోనే ఆ ఫేస్ లేకుండా చేయాలన్నది ఇప్పుడు వైసీపీ వ్యూహం. శాసనమండలి నుంచి టీడీపీ [more]

Update: 2020-07-18 13:30 GMT

కొడితే.. ఏనుగు కుంభస్థలాన్ని మాత్రమే కొట్టాలన్నది సామెత. తనను అవమాన పర్చిన సభలోనే ఆ ఫేస్ లేకుండా చేయాలన్నది ఇప్పుడు వైసీపీ వ్యూహం. శాసనమండలి నుంచి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను బయటకు పంపే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు పక్కాగా చెబుతున్నాయి. నారా లోకేష్ ను శాసనమండలి నుంచి బయటకు పంపితే మరింత మంది ఎమ్మెల్సీలు వైసీపీలో చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

వైసీపీకి బలం లేకపోవడంతో….

శాసనమండలిలో వైసీపీకి బలం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా మండలి విషయానికి వచ్చే సరికి వైసీపీ అవమానాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అనేక బిల్లులను శాసనమండలిలో మెజారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ అడుగడుగునా అడ్డుకుంటోంది. దీంతో వైఎస్ జగన్ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రస్తుతం శాసనమండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది.

నలుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికే…..

దీంతో ఇప్పటికే శాసనమండలిలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. నలుగురు ఎమ్మెల్సీలు టీడీపీని వీడారు. డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత, శమంతకమణి వైసీపీలో చేరిపోయారు. శివనాధ్ రెడ్డి టీడీపీకి దూరంగా ఉన్నారు. ఇటీవలే డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్సీ పోస్టును మళ్లీ జగన్ ఆయనకే ఇచ్చారు. దీంతో పార్టీలోకి వెళ్లినా అనర్హత వేటు పడితే తిరిగి పదవి తమకే వస్తుందన్న ధీమాను టీడీపీ ఎమ్మెల్సీల్లో పెంచగలిగేలా సంకేతాలను వైసీపీ పంపగలిగింది.

అనర్హత వేటు వేసేందుకు….

అయితే నారా లోకేష్ ను శాసనమండలి నుంచి బయటకు పంపిస్తే సగం మంది వైసీపీలోకి వస్తారన్న అంచనాలో వైసీపీ ఉంది. నారా లోకేష్ పై ఇప్పటికే వైసీపీ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసింది. నారా లోకేష్ శాసనమండలి జరుగుతున్న సమయంలో ఫొటోలు తీయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన వైసీపీ దీనిపై ఛైర్మన్ కు కూడా ఫిర్యాదు చేసింది. ఎథిక్స్ కమిటీ నారా లోకేష్ పై అనర్హత వేటు వేయాలని నిర్ణయం తీసుకుని, అది అమలు జరిగేలా ఛైర్మన్ పై వత్తిడి తేవాలని నిర్ణయించింది. మొత్తం మీద నారా లోకేష్ పై అనర్హత వేటుకు అంతా సిద్ధం చేసినట్లు అమరావతిలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News