లీడర్ అంటేనే అటల్ జీ....!

Update: 2018-08-16 12:30 GMT

ఆయన ఉదారవాది...పరిపూర్ణ ప్రజాస్వామ్య వాది. లౌకిక వాది. మాజీ ప్రధాని వాజ్ పేయి మరణంతో యావత్ భారత్ శోకసంద్రంలో మునిగిపోయింది. అటల్ జీ మరణం పార్టీకే కాకుండా దేశానికి తీరని లోటు. ఆయన మృతితో ఒక నికార్సయిన రాజకీయనాయకుడిని దేశం కోల్పోయినట్లయింది. అటల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనను కేవలం పార్టీ నేతలే కాదు ప్రతిపక్ష నేతలు కూడా గౌరవిస్తారంటే ఆయన రాజకీయంగా ఎదిగిన తీరు, పాటించిన విలువలే కారణమని చెప్పక తప్పదు. రాజనీతిజ్ఞుడుగా రాణించిన అటల్ జీకి ‘‘తెలుగు పోస్ట్’’ అక్షర నివాళులర్పిస్తోంది.

పార్టీలు, సిద్ధాంతాలు, భవజాలాలు... వేర్వేరయినా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్ పేయి మధ్య అనేక సారూప్యతలు, పోలికలు, ఉన్నాయి. ప్రథమ ప్రధాని నెహ్రూ పరమ ఉదారవాది, లౌకికవాది. పరిపూర్ణ ప్రజాస్వామ్యవాది. తన ప్రసంగాలతో ప్రజలను ఉర్రూతలూగించేవారు. నవ భారత నిర్మాత. విదేశాంగ విషయంలో విశేష ఆసక్తి, అనుభవం గల నేత. తొలి కాంగ్రెస్ ప్రధానిగా చరిత్ర సృష్టించారు. నెహ్రూ తరవాత భారత రాజకీయాల్లో ఆ స్థాయి గల ఏకైక నాయకుడు వాజ్ పేయి. పండిత్ జీ కాంగ్రెస్ తొలి ప్రధాని. అటల్ జీ తొలి కాంగ్రెసేతర ప్రధాని. 1997లో మొరార్జీ దేశాయ్ ను తొలి కాంగ్రెసేతర ప్రధానిగా కొందరు పేర్కొన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగారు. ఏడో దశకం చివర్లో జనతా పార్టీ ఏర్పాటు చేసిన నేతల్లో ఒకరు. అందువల్ల తొలి కాంగ్రెసేతర ప్రధానిగా అటల్ జీనే పేర్కొనడం సమంజసం. పండిత్ జీ మాదిరిగా అటల్ జీ ఉదారవాది, పరిపూర్ణ ప్రజాస్వామ్యవాది, లౌకికవాది. హిందూ భావజాలం గల పార్టీలో ఉన్నప్పటికీ ఆయన లౌకికతత్వాన్ని విమర్శకులు సైతం ప్రశ్నించలేరు. అసాధారణ వక్త. చలోక్తులు, కవితలతో ప్రసంగాన్ని రక్తి కట్టించగలరు. పండిత్ జీ మాదిరిగా విదేశాంగ వ్యవహారాలు అంటే అపరిమితమైన ఆసక్తి. ఇద్దరికీ ఒకే ఒక ప్రధాన తేడా. నెహ్రూ వివాహితుడు. అటల్ జీ ఆజన్మ బ్రహ్మచారి. ఇదొక్కటే తేడా. భారత రాజకీయాల్లో పండిత్ జీతో పోల్చదగ్గ ఏకైక నాయకుడు అటల్ జీ అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇద్దరూ నైతిక విలువలకు కట్టుబడిన నేతలు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చారు.

దేశ పదో ప్రధానిగా......

దేశ పదో ప్రధానిగా 1996 మే 16న బాధ్యతలు చేపట్టిన వాజ్ పేయి 13 రోజుల్లోనే పదవి నుంచి దిగిపోతారని ఎవరూ ఊహించలేదు. అధికారాన్ని కాపాడుకునేందుకు అడ్డదారులు తొక్కడం సహజమైన నేటి రోజుల్లో ప్రలోభాలకు దూరంగా ఉండి పదవిని త్యజించడం వాజ్ పేయి వంటి నాయకులకే చెల్లింది. 1998లోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ విలువలకే కట్టుబడ్డారు తప్ప అధికారం కోసం రాజీ పడలేదు. పార్లమెంటులో బలం నిరూపించుకోలేక ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమలాపురం టీడీపీ ఎంపీ గంటి మోహన్ చంద్ర లోక్ సభ స్పీకర్ గా ఉన్నారు. 1999లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్ పేయి ప్రభుత్వం పతనమైంది. మళ్లీ ఎన్నికలకు వెళ్లిన వాజ్ పేయి విజేతగా తిరిగి వచ్చి 2004 వరకు ప్రధానిగా కొనసాగారు. అప్పట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి అధికారానికి దూరమయ్యారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2009లో తీవ్ర అనారోగ్యంతో ఆచేతన స్థితికి వెళ్లారు. వాజ్ పేయి తన పదవీకాలంలో విప్తవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నారు. రక్షణరంగంలో భారత్ స్వావలంబనకు శ్రీకారం చుట్టారు. 1998 మేలో రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో అణుపరీక్షలకు తెరలేపడం ద్వారా అంతర్జాతీయంగా భారత్ సత్తా చాటారు. అమెరికా వంటి పశ్చిమ దేశాల ఆంక్షలను లెక్క చేయకుండా ముందుకు సాగారు. శాంతియుత ప్రయోజనాలకు, రక్షణపరంగా భారత్ కు అణు పరీక్షలు చేసుకునేంత సత్తా ఉందని ధైర్యంగా అంతర్జాతీయ సమాజానికి చాటారు. దాయాది దేశమైన పాకిస్థాన్ తో చర్చలకు తెరతీశారు. ఇది సాహసోపేత చర్య.

పాక్ తో సంబంధాలు......

ఢిల్లీ-లాహోర్ మధ్య బస్సు ప్రయాణం చేయడం ద్వారా శాంతి స్థాపనకు నడుంకట్టారు. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పాక్ విఫలమయింది. 1999 జూన్ లో కార్గిల్ యుద్ధంలో పాక్ పై విజయం సాధించడంలో ఆయన ప్రతిష్ట ఆకాశానికి తాకింది. అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన పాక్ చొరబాటుదారులను విజయవంతంగా తిప్పికొట్టారు. నాటి యుద్ధంలో సుమారు 500 మంది సైనికులు అమరులయ్యారు. కార్గిల్ యుద్ధం 1999లో బీజేపీ విజయానికి గట్టి పునాది వేసింది. 1999లో ఖాట్మండు నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఢిల్లీకి వస్తున్న విమానాన్ని హైజాక్ చేసినప్పుడు ప్రయాణికుల క్షేమాన్ని కోరి జైల్లో ఉన్న కాశ్మీరీ తీవ్రవాదులను అప్పగించారు. నాటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ స్వయంగా అజహర్ మసూద్ వంటి ఉగ్రవాదులను వెంటబెట్టుకుని అఫ్ఘాన్ వెళ్లి ప్రయాణికులను తీసుకొచ్చారు. పాక్ తో స్నేహం కోసం పరితపించిన వాజ్ పేయి అప్పటి ఆ దేశ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ను చర్చల కోసం భారత్ కు ఆహ్వానించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ముషారఫ్ విఫలమయ్యారు. 2001 డిసెంబరు 13న పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టడంలో విజయవంతమయ్యారు. అనేక సంక్షోభాలను అధిగమించి సమర్థతను చాటు కున్నారు.

దేశ ప్రగతికి పునాదులు.....

వాజ్ పేయి హయాంలో దేశ ప్రగతికి పునాదులు వేశారు. మెరుగైన ప్రాధమిక విద్యను అందించేందుకు 2001లో సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇప్పటికీ విజయవంతంగా సాగుతోంది. రోడ్ల విస్తరణకు ఉద్దేశించిన ‘‘స్వర్ణ చతుర్భుజి’’ కార్యక్రమం ప్రజల మన్ననలను అందుకుంది. ఆయన హయాంలో వృద్ధిరేటు పరుగులెత్తింది. జీడీపీ 7 శాతానికి చేరింది. విదేశీ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. పారిశ్రామిక, ఆర్థిక సంస్కరణలు శరవేగంతో కొనసాగాయి. లో గుజరాత్ లో జరిగిన హిందూ -ముస్లింల అల్లర్లలో వెయ్యిమందికి పైగా మరణించడం వాజ్ పేయిని కలచివేసింది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని పదవి నుంచి వైదొలగాలని ఆదేశించారు. అయితే అద్వాణీ వంటి అగ్రనేతల ఒత్తిడికి వాజ్ పేయి తలొగ్గారన్న విమర్శలు ఇప్పటికీ విన్పిస్తూనే ఉంటాయి. నాటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు.

అన్నింటా తనదైన ముద్ర.....

భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా పేరుగాంచిన వాజ్ పేయి 1996లో ప్రధాని పదవి చేపట్టక ముందు కూడా తనదైన ముద్రను చాటుకున్నారు. భారతీయ జన్ సంఘ్, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. 1924 డిసెంబరు 25న మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన ఆయన అనంతరం తన కార్యస్థలాన్ని ఢిల్లీకి మార్చుకున్నారు. పదిసార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయనకు పార్లమెంటరీ రాజకీయాల్లో విశేష అనుభవం ఉంది. ఉత్తమ పార్లమెంటేరియన్, పద్మ విభూషణ్, భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలతో జాతి ఆయనను గౌరవించింది. 2009 వరకూ లక్నో ఎంపీగా ఉన్నారు. అంతకు ముందు వివిధ రాష్ట్రాల నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1977లో మురార్జీ దేశాయ్ సారథ్యంలోని జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా అత్యుత్తమ ప్రతిభ కనపర్చారు. అప్పట్లో ఆయన ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించి సంచలనం సృష్టించారు. విదేశాంగమంత్రిగా చైనాలో పర్యటించి ఆ దేశంతో స్నేహబంధానికి పునాదులు వేశారు. భారత రాజకీయాల్లో ఆయనను విధానాల పరంగా వ్యతిరేకించే వారు తప్ప వ్యక్తిగతంగా ఎవరూ వ్యతిరేకంచలేదు. వ్యతిరేకించరు కూడా. చెడ్డ పార్టీలో ఉన్న మంచి వ్యక్తి అని ఎంతో మంది ఆయనను కొనియాడిన సందర్భాలున్నాయి. వాజ్ పేయి కూడా అదే స్థాయిలో వ్యవహరించారు. సిద్ధాంతాల పరంగానే పోరాడారు. అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు నెరిపారు. మంచి పనిచేసినప్పుడు అభినందించడంలో ఎప్పుడూ ఆయన ముందుంటారు. 1971లో పాకిస్థాన్ ను ఓడించి బంగ్లాదేశ్ ఆవిర్భాంలో కీలక పాత్ర పోషించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆయన ప్రశంసలతో ముంచెత్తడం గమనార్హం. ఆమెను అపరకాళికగా అభివర్ణించారు. 1957 లో రెండో లోక్ సభకు ఎన్నికయ్యారు. పార్టీ తో పాటు, దేశం కూడా ఆయన సేవలను ఎప్పుడూ స్మరించుకుంటుంది. భారత రాజకీయాలపై తనదైన చెరగనతి ముద్ర వేసిన ఆయన ముందు తరాలకు మార్గదర్శి. స్ఫూర్తి ప్రదాత. ఆదర్శప్రాయుడు...వాజ్ పేయి ధన్యజీవి. ఆయన ఆశయాలను కొనసాగిద్దాం. ఆయన వైఖరినే అవలంబిద్దాం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News