ఎప్పుడో క్వాలిఫై అయింది

విశాఖ అంటేనే స్మార్ట్ సిటీగా ఇప్పటి తరానికి తెలుసు. కానీ విశాఖ రాజధాని హోదాని దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే అనుభవించింది. నిజానికి మద్రాస్ నుంచి ఆంధ్ర [more]

Update: 2019-12-25 11:00 GMT

విశాఖ అంటేనే స్మార్ట్ సిటీగా ఇప్పటి తరానికి తెలుసు. కానీ విశాఖ రాజధాని హోదాని దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే అనుభవించింది. నిజానికి మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక రాజధాని విశాఖలో పెట్టాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే నాడున్న పరిస్థితులు, కోస్తాలో బలమైన వామ‌పక్ష పార్టీల ప్రాబల్యం, సీమలో కాంగ్రెస్ రాజకీయ పలుకుబడి ముందు ఉత్తరాంధ్ర నేతలు వెనకబడిపోయారు. దాంతో అసలు యుధ్ధం అంతా విజయవాడ, కర్నూలు మధ్యనే నడిచింది. చివరికి కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో కర్నూలు రాజధానిగా నాటి ఖద్దరు పార్టీ నేతలు నెగ్గించుకున్నారు.

కూల్ గా అసెంబ్లీ…..

సరే రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ 1953 అక్టోబర్ 1న పదకొండు జిల్లాల ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయినా అతి కీలకమైన బడ్జెట్ సమావేశాలు ఆ మరుసటి ఏడాది అంటే 1954లో విశాఖలోనే జరిగాయి. నాడు ఆంధ్రా యూనివర్సిటీలో మే నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం నాయకత్వం వహించారు. అంటే విశాఖలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ చరిత్ర ఈనాటిది కాదు అని తెలుస్తూనే ఉంది. విశాఖలో అసెంబ్లీ సమావేశాలు అప్పట్లో పెట్టడానికి ఇక్కడ చల్లని వాతావరణమే ఒక కారణంగా చెబుతారు. అలాగే అప్పటికే ఇక్కడ మౌలిక సదుపాయాలు మెండుగా ఉండడం మరో కారణంగా కూడా పేర్కొంటారు.

బాబు సైతం…..

అమరావతి అంటూ కలలు కన్న చంద్రబాబు సైతం తొలి మంత్రి వర్గ సమావేశాలను విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో నిర్వహించారు. కీలక నిర్ణయాలు అన్నీ ఆయన ఇక్కడే తీసుకున్నారు. దాంతో నాడే విశాఖ రాజధాని అవుతుందన్న ఆశలు అందరిలో ఏర్పడ్డాయి. అయితే తరువాత చిత్రంగా అమరావతిని టీడీపీ సర్కార్ ప్రకటించేసింది. అయితే పేరుకు అమరావతి రాజధాని అంటున్నా చంద్రబాబు అయిదేళ్ళ పాలనలో జాతీయ అంతర్జాతీయ సదస్సులు అన్నీ కూడా విశాఖలోనే నిర్వహించడం విశేషం. ఆ విధంగా బాబు కూడా విశాఖ హంగులు, పొంగులు చూసి రాజధాని క్వాలిఫికేషన్ అయిదేళ్ళ క్రితమే ఇచ్చేశారు.

మేధావులు సైతం…..

ఇదిలా ఉండగా నాడూ నేడూ మేధావులు సైతం విశాఖను రాజధాని చేయాలనే కోరుతూ వచ్చారు. తాజాగా మూడు రాజధానుల ప్రతిపాదనపైన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ మాట్లాడుతూ విశాఖలో సచివాలయం తో పాటు కీలకమైన శాఖల‌న్నీ నిర్వహించితేనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని అంటున్నారు. అదే విధంగా అమరావతిని మంచి నగరంగా అభివ్రుధ్ధి చేయాలని సూచించారు. . ఇక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవీఆర్ క్రిష్ణారావు సైతం విశాఖనే పూర్తి రాజధాని చేసి మిగిలిన ప్రాంతాలను అభివ్రుధ్ధి చేస్తే బాగుంటుందన్ని సూచిస్తున్నారు. ఇక జీఎస్ రావు కమిటీ ఇచ్చిన 125 పేజీల రిపోర్టులో కూడా విశాఖకే పెద్ద పీట వేశారు. విశాఖలో అతి పెద్దదైన బడ్జెట్ సెషన్లను నిర్వహించమంటున్నారంటే వారు సైతం విశాఖనే రాజధానిగా గుర్తించమని చెప్పకనే చెబుతున్నట్లుగా భావించాలంటున్నారు.

Tags:    

Similar News