పాతోళ్లకు పంగనామాలే…!!

2019 …ఈ సంవ‌త్స‌రం అనేక కొత్త కొత్త విష‌యాల‌నే కాదు.. కొత్త కొత్త నాయ‌కుల‌ను కూడా ఏపీకి ప‌రిచ‌యం చేయ‌నుంది. కొత్త ర‌క్తంతో రాజకీయాల‌ను ప‌రిగెట్టించ‌నుంది. ఈ [more]

Update: 2019-01-11 14:30 GMT

2019 …ఈ సంవ‌త్స‌రం అనేక కొత్త కొత్త విష‌యాల‌నే కాదు.. కొత్త కొత్త నాయ‌కుల‌ను కూడా ఏపీకి ప‌రిచ‌యం చేయ‌నుంది. కొత్త ర‌క్తంతో రాజకీయాల‌ను ప‌రిగెట్టించ‌నుంది. ఈ ఏడాది మేలో జ‌ర‌గనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇక్క‌డ అధికారం కోసం కీల‌క‌మైన మూడు పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. టీడీపీ తిరిగి అదికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎలాంటి ఆశాలేద‌ని చెప్పినా.. ఇప్పుడు మాత్రం సీఎం సీటు త‌న‌కే ద‌క్కాలంటూ ప‌క్కా సెంటిమెంటుతో ముందుకు సాగుతున్నాడు. ఇక‌, జ‌గ‌న్ ఏడాదికి పైగా కాలం నుంచి ప్ర‌జ‌ల్లోనే ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో ఆయ‌న దూసుకుపోతున్నాడు.

యూత్ కే అవకాశం…..

ఈ క్ర‌మంలో మూడు పార్టీల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొన‌డం ఖాయ‌మ‌ని తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్లాల‌ని నిర్న‌యించుకున్నాయి. అధికార పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు .. త‌న పార్టీ త‌ర‌ఫున వ‌చ్చే ఎన్నిక‌ల్లో యూత్‌కు ఎక్కువ‌గా సీట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక ప‌క్క ప‌వ‌న్‌, మ‌రోప‌క్క జ‌గ‌న్ యువకులు క‌నుక‌.. తాను కూడా పార్టీలో ఎక్కువ సీట్లు యూత్‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిలో ఇప్ప‌టికే తెర‌మీదికి వ‌చ్చిన పేర్లు దేవినేని అవినాష్‌, చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడి కుమారుడు విజయ్‌, కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుమారుడు కోడెల శివ‌రామ‌కృష్ణ‌, శిద్దా రాఘ‌వ‌రావు కుమారుడు శిద్దా సుధీర్‌, రాయ‌పాటి త‌న‌యుడు రాయ‌పాటి రంగారావుల‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు.

కొత్తగా రాజకీయాలు….

అదేస‌మ‌యంలో మంత్రుల కుటుంబాల నుంచి కూడా ఎక్కువగా తెర‌మీదికి వ‌స్తున్న యువ‌త‌ను ప్రోత్స‌హించాల‌ని భావిస్తున్నారు., ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు జేసీప‌వ‌న్ కుమార్ రెడ్డి, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న‌యుడు జేసీ అస్మిత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ప‌రిటాల‌ సునీత త‌న‌యుడు శ్రీరాం, మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల కృష్ణా రెడ్డి త‌న‌యుడు, బొజ్జ‌ల సుధాక‌ర్‌, దివంగ‌త గాలి ముద్దుకృష్ణ‌మ త‌న‌యుడు గాలి భానుప్ర‌కాష్, మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కుమార్తెకు కూడా ఈ ద‌ఫా అవ‌కాశం ఇవ్వడం ద్వారా టీడీపీలో రెండో త‌రం నాయ‌కుల‌కు ఛాన్స్ ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని బాబు బావిస్తున్నారు. వీరంతా కూడా కొత్త‌గా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌వారే. అయితే, దీనికి త‌గిన విధంగానే జ‌గ‌న్ కూడా కొత్త‌వారికి ఛాన్స్ ఇస్తున్నారు. వీరు కూడా యువ‌కులే కావ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీలో కూడా….

దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కొఠారు అబ్బ‌య్య చౌద‌రి, చిల‌క‌లూరిపేట‌లో విడ‌ద‌ల ర‌జ‌నీ, న‌ర‌స‌రావు పేట ఎంపీ స్థానంలో లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు వంటి వారికి ప్రాథ‌మికంగా అవ‌కాశం క‌ల్పించారు. అయితే, ఎన్నిక‌ల స‌మయానికి మ‌రింత మంది యువ‌కుల‌ను రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించారు. మార్కాపురం స్థానంలోనూ మార్పులు చేయ‌డం ద్వారా అక్క‌డ కూడా యువ‌త‌కు పెద్ద‌ పీట వేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, ప‌వ‌న్ కూడా యూత్ కోసం వెతుకుతున్న‌ట్టు స‌మ‌ర్ధుల‌కు పెద్ద‌పీట వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు. ఏదేమైనా.. ఈ కొత్త సంవ‌త్స‌రం యువ రాజ‌కీయ నేత‌ల నిర్ణాయ‌క సంవ‌త్స‌రంగా మార‌బోతుంద‌న్నది వాస్త‌వం! ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారో ఈ సంవ‌త్స‌ర‌మే తేల్చ‌నుంది!!

Tags:    

Similar News