ఇద్దరి కన్ను దానిపైనే....!!!

Update: 2018-12-22 16:30 GMT

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది పాత తెలుగు సామెత. ఇది రాజకీయ రంగానికి బహుచక్కగా వర్తిస్తుంది. రాజస్థాన్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ లను ఎంపిక చేసిన తర్వాత పై సామెత గుర్తుకురాక మానదు. ఏక నాయకత్వం తప్ప బహు నాయకత్వంతో ఇబ్బందులు తప్పవన్నది స్థూలంగా ఈ సామెత సారాంశం. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు తనకు వ్యతిరేకంగా రెండో రాజకీయ కేంద్రాన్ని అంగీకరించడు. తన పదవికి ముప్పు తెచ్చే కేంద్రంగా దానిని భావిస్తాడు. అదే విధంగా కో పైలెట్ (ఉపముఖ్యమంత్రి) కన్ను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవిపైనే ఉంటుంది. ఏదో సమయంలో ఏదోఒక రకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఉంటుంది. ఇందులో అసహజత్వం కూడా ఏమీ లేదు. అంతిమంగా ఒకరికొకరు పరస్పరం శత్రువులుగా భావించుకుంటారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీల్లో ఈ పరిస్థితి ఒకింత ఎక్కువగా ఉంటుంది.

సాఫీగా సాగేనా?

రాజస్థాన్ సీఎం, డిప్యూటీ సీఎంలుగా గెహ్లాట్, సచిన్ పైలెట్ ల కాపురం ఎంతకాలం సాఫీగా సాగుతుందన్న అనుమానాలు లేకపోలేదు. ఇద్దరి నేపథ్యాలు, రాజకీయ చరిత్ర, పెరిగిన వాతావరణం వేర్వేరు. ఒకరు అనుభవజ్ఞులు కాగా, మరొకరు యువకెరటం. 67 సంవత్సరాల గెహ్లాట్ కు, నాలుగు పదుల పైలెట్ కు దాదాపు పాతికేళ్ల తేడా ఉంది. గెహ్లాట్ రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. పైలెట్ కు ఇప్పుడిప్పుడే రాజకీయ తత్వాలు బోధపడుతున్నాయి. ఆ అనుభవమే గెహ్లాట్ ను సీఎం పదవికి చేర్చాయి. వాస్తవానికి 2013లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఢిల్లీలో జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తూ అధిష్టానం కనుసన్నల్లో ఉన్నారు. గుజరాత్ ఇన్ ఛార్జిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని దాదాపు విజయతీరాలకు దగ్గరగా చేర్చారు. అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టించారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) సంకీర్ణాన్ని ఆవిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. నాలుగు సార్లు ఎంపీగా, పదేళ్ల పాటు కేంద్ర మంత్రిగా (1982-93) పనిచేసిన అనుభవం గల మాల సామాజిక వర్గానికి చెందిన గెహ్లాట్ మృదువుగా వ్యవహరిస్తూ పనులను చక్కదిద్దడంలో దిట్ట. 1998, 2008లో సీఎంగా పనిచేసిన ఆయన పదేళ్ల తర్వాత మళ్లీ ఆ బాధ్యతలను చేపట్టారు. సాధారణంగా ఏ రాష్ట్రంలో పార్టీ గెలిచినా అక్కడి పీసీసీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవుతారు. ఆకోణంలో చూస్తే సచిన్ పైలెట్ సీఎం కావాలి. మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్, ఛత్తీస్ ఘడ్ లో భూపేశ్ బఘల్ ఈ తరహాలోనే సీఎంలు అయ్యారు. కానీ రాజస్థాన్ దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మారింది. ఎన్నికల ముందు వరకూ జాతీయ రాజకీయాల్లో ఉన్న గెహ్లాట్ చివరి క్షణంలో అసెంబ్లీ ఎన్నికల్లో సర్దార్ పుర నుంచి నామినేషన్ వేయడంలోనే వ్యూహం దాగి ఉంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొగ్గు పైలట్ వైపు ఉందని గ్రహించిన గెహ్లాట్ తెరవెనుక వేగంగా పావులు కదిపారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ఆమె కూతురు ప్రియాంకగాంధీ మద్దతు సాధించడంలో రాహుల్ కూడా మౌనంగా తలఊపక తప్పలేదు. ఫలితంగా మూడో సారి ముఖ్యమంత్రి అయ్యారు.

ముఖ్యమైన శాఖల్లోనూ....

కో పైలెట్ గా, డిప్యూటీ సీఎంగా నియమితులైన సచిన్ పైలెట్ నుంచి గెహ్లాట్ కు భవిష్యత్తులో చిక్కులు తప్పవు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మొదటి నుంచి పేరొందిన ఇప్పుడు కేబినెట్ లో అత్యంత కీలకమైన హోంశాఖను ఆశిస్తున్నారు. హోంశాఖలో భాగమైన అవినీతి నిరోధక శాఖను తన వద్ద ఉంచాలని కోరుతున్నారు. అంతే కాకుండా డీజీపీ సహా ఇతర సీనియర్ అధికారుల నియామకంలో తన మాటకు విలువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతిమంగా హోంశాఖను పూర్తి స్వతంత్రంగా నిర్వహించాలన్నది ఆయన ఆలోచన. తన శాఖ మాత్రమే కాకుండా మంత్రివర్గ కూర్పులో తన పాత్ర ఉండాలని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ హోదాలో తన మనుషులు కొందరికి మంత్రి పదవులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ షరతులకు అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించారు. ఈ షరతులు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ప్రతిబంధకాలుగా మారే అవకాశం లేకపోలేదు. ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా అసమ్మతిని ప్రోత్సహించడం కాంగ్రెస్ వ్యూహంలో భాగం. రాహుల్ తో సాన్నిహిత్యం దృష్ట్యా ఏదో ఒకరోజున తన పదవికి ముప్పుతప్పదని అనుమానం గెహ్లాట్ లో లేకపోలేదు. అన్నీ బాగుండి ...వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే గెహ్లాట్ కు కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించే ప్రతిపాదన రాహుల్ వద్ద ఉంది. దీనివల్ల పైలెట్ కు అవకాశం ఇచ్చినట్లవుతుంది.

అన్ని సీట్లు గెలిస్తేనే.....

40 సంవత్సరాల వయస్సున్న పైలెట్ కు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం మింగుడుపడని పరిణామమే. కష్టకాలంలో పార్టీని నడిపించిన తనకు అత్యున్నత పదవి దక్కుతుందని ఎంతగానో ఆశించారు. ఉప ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించడం, రాహుల్ తో సాన్నిహిత్యం దృష్ట్యా సీఎం పదవి తనదేనన్న ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్ గెలిచే వరకూ తలపాగా ధరించనని ప్రతిన చేసిన ఆయనకు ఇప్పుడు తలపాగా ధరించే అవకాశం వచ్చింది. అయితే అది ముఖ్యమంత్రి హోదాలో కాకపోవడం పెద్దలోటు. డిప్యూటీ సీఎంగా ఆయన దృష్టి అంతా ఇప్పుడు సీఎం పదవిపైనే ఉంటుంది. తన కలను సాకారం చేసుకోవాలంటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించాలి. మొత్తం 25 లోక్ సభ స్థానాల్లో మెజారిటీ సీట్లను గెలిపించుకుంటేనే కేంద్ర నాయకత్వం దృష్టిలో పడతారు. ఈ ఎన్నికల్లో గెలుపు ముఖ్యమంత్రి గెహ్లాట్ కు కూడా ముఖ్యమే. సరైన ఫలితాలు రానట్లయితే ఆయనపై వేటు పడే ప్రమాదం ఉంది. గెహ్లాట్, పైలెట్ కలసి మెలసి ఒకే బాటలో ప్రయాణిస్తారా? లేక ఉప్పునిప్పులా వ్యవహరిస్తారా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News