తేరుకున్నారటగా….!!!

ఓడలు బండ్లవుతాయి… బండ్లు ఓడలవుతాయి.. ఈ సామెత ఖచ్చితంగా విజయనగరం రాజులకు ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ [more]

Update: 2019-07-04 12:30 GMT

ఓడలు బండ్లవుతాయి… బండ్లు ఓడలవుతాయి.. ఈ సామెత ఖచ్చితంగా విజయనగరం రాజులకు ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సయితం ఓటమిపాలయ్యారు. ఆయన కూతురు విజయనగరం అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. రాజులంటే కోటలకే పరిమితమవుతారని, కోటకెళితే కుక్కలను వదులుతారని బలంగా ప్రచారం ఉంది. అయితే వీటన్నింటినీ తిప్పికొట్టేందుకు అశోక్ గజపతిరాజు సిద్ధమయ్యారు.

బలమైన గాలులతో…..

అశోక్ గజపతిరాజు ఊహించి కూడా ఉండరు. బలమైన వైసీపీ గాలులకు తనతో పాటు తన కూతురు ఆదితి గజపతి రాజు కూడా ఓటమి పాలవుతారని పసిగట్టి ఉండరు. అయితే తండ్రీ, తనయల దారుణ ఓటమితో రాజుగారి కుటుంబం తేరుకోలేకపోయింది. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ ను వారు జీర్ణంచుకోలేకపోయారు. విజయనగరం ఎంపీగా పోటీ చేసిన అశోక్ గజపతిరాజుకు 88,172 ఓట్లు రాగా, అసెంబ్లీకి పోటీ చేసిన ఆదితి గజపతికి 71,773 ఓట్లు మాత్రమే వచ్చాయి. తండ్రికి పడిన ఓట్లు తనయకు పడలేదు. దీంతో క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని గుర్తించారు.

పోల్ పోస్ట్ మార్టంలో…..

ఓటమి తర్వాత కోటలో కూడా కొంత పోస్ట్ మార్టం జరిగింది. అశోక్ గజపతిరాజుకు అత్యంత సన్నిహితులే కోవర్టులుగా మారారని పోస్ట్ మార్టంలో తేలింది. దీంతో అశోక్ గజపతి రాజు ఓటమి నుంచి తేరుకోవడానికా చాలా సయమం పట్టింది. గతంలో అశోక్ గజపతిరాజు ఓటమిపాలయినప్పటికీ ఇంతటి దారుణ ఓటమిని ఆయన చూడలేదు. అశోక్ గజపతిరాజులతో పాటు విజయనగరం జిల్లాలో బొబ్బిలి, కురుపాం, మేరంగి రాజకుటుంబాలు కూడా ఓటమిపాలయ్యాయి.

గ్రామాల బాట…..

ఓటమి పాలయిన తర్వాత బొబ్బిలి, కురుపాం, మేరంగి రాజకుటుంబాలు ఇప్పటికీ తేరుకోలేదు. కానీ అశోక్ గజపతిరాజు మాత్రం ఓటమి నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే ప్రజల చెంతకు వస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఒక గ్రామాన్ని సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అశోక్ గజపతిరాజు ఆయన కూతురు ఆదితిలు గ్రామ పర్యటనలతో అప్పటి వరకూ నిస్తేజంగా ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజులంటే కోటకే పరిమితం కారని అశోక్ గజపతిరాజు తన పర్యటనల ద్వారా చెబుతున్నారు. మరి రాజుగారి పర్యటనలతోనైనా స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి జిల్లాలో టీడీపీ తిరిగి పుంజుకుంటుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News