రోజుకో ఊరు…గంటకో వేషం..??

ఐటీ గ్రిడ్ అశోక్.. ఈ పేరే ఇప్పడు మళ్లీ హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటి వరకు ఆంధ్రాలో తలదాచుకున్న అశోక్ అక్కడ సేఫ్ కాదని పారిపోయినట్లు తెలుస్తోంది. [more]

Update: 2019-05-29 07:27 GMT

ఐటీ గ్రిడ్ అశోక్.. ఈ పేరే ఇప్పడు మళ్లీ హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటి వరకు ఆంధ్రాలో తలదాచుకున్న అశోక్ అక్కడ సేఫ్ కాదని పారిపోయినట్లు తెలుస్తోంది. రోజుకో ఊరు..గంటకో వేషం వేస్తూ తప్పించుకుంటున్న అశోక్ కేసు నుండి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు సాగిస్తున్నాడు. వరసగా కోర్టుల్లో చేదు అనుభవాలు ఎదురవ్వడంతో చివరిగా లొంగుబాటు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర ఆంధ్రకు వెళితే ఆ కేసు దర్యాప్తు ఎవరికి అప్పగిస్తారో అన్న టెన్షన్ మొదలైంది.

మరోసారి తెరపైకి….

చాలా రోజుల విరామం తరువాత ఐటీ గ్రిడ్ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఇప్పటి వరకు నత్తనడక సాగుతున్న ఈ కేసు ఒక్కసారిగా ఊపందుకోవడం కొందరు రాజకీయపార్టీనాయకులకు అర్థం కాని వ్యవహారమైంది. ఆంధ్రాలో తలదాచుకున్నాడనుకున్న అశోక్ కేసునుండి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. పోలీసులకు చిక్కకుండా కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. బట్… ఎక్కడా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఏం చేయాలో అర్థంకానీ పరిస్థితికి లోనవుతున్నాడు.సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు, హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు కలిసి చేసిన ఐటీ గ్రిడ్ కేసులను సమర్థవంతంగా, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ కి ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగానే సిట్ చీఫ్ హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో గోషామహల్ స్టేడియంలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపధ్యంలో ఐటీ గ్రిడ్ అధినేత అశోక్ మొదట హై కోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు 41ఎ సిఆర్ పిసి నోటీసుకు స్పందించాలని విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అశోక్ అండ్ టీమ్ సిట్ ముందుకు హాజరు కాలేదు.

ఆంధ్రా నుంచి మకాం….

అశోక్ కోసం విజయవాడ, గుంటూరు, తెనాలి ఇలా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు గాలించాయి. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతల సహకారంతో అశోక్ సేఫ్ ప్లేస్ లో ఉన్నట్లు తెలిసినా, అతడిని బయటకు తీసుకు రావడం తెలంగాణ పోలీసులకు చాలా ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఆంధ్రలో ఎన్నికలు రావడంతో సిట్ ఇన్వెస్టిగేషన్ స్పీడ్ కి బ్రేక్ పడినట్లైంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఓటమి, వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో గెలుపొందడంతో అశోక్ కి దిమ్మతిరిగినంత పనైంది. డేటా చోరీ వ్యవహారం, తెలుగు దేశం పార్టీ పై వచ్చిన ఆరోపణలు, పోలీసుల కేసు అంతా వైఎస్ఆర్ సిపి నేతలు బయటపెట్టినవే. ఈ నేపధ్యంలో ఆంధ్రాలో ఉంటే అంత సేఫ్ కాదనుకున్న అశోక్ అక్కడినుండి మకాం మార్చినట్లు తెలుస్తోంది.

కోర్టులను ఆశ్రయిస్తూ

ఈ కేసులో పట్టుబడితే జరిగే పరిణామాలు, తరువాత టార్గెట్ ఎవరు? అనేదానిపై అశోక్ కి సహకరించిన కొందరు నేతలకు కూడా ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో అశోక్ అండ్ టీం ఈ కేసునుండి తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. మొదట ఎల్టీనగర్ లోనిరంగారెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు పిటీషన్ ని తోసి పుచ్చడంతో చివరకు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనే హై కోర్టు కూడా విచారణకు సహకరించాలని చెప్పినా అశోక్ అండ్ టీమ్ పట్టించుకోలేదు. దీంతో హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు లేక పోలేదు. ఈ విచారణను వాయిదా వేసింది.

సజ్జనార్ కు అప్పగించనున్నారా…?

ఇక తాజాగా డేటా థెఫ్ట్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ చిఫ్ స్టీఫెన్ రవీంద్ర ఆంధ్రరాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో ఐటీ గ్రిడ్ కేసును సైబరాబాద్ సిపి సజ్జనార్ కే అప్పగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మొత్తానికి తాజా రాజకీయ పరిణామాలు అశోక్ అండ్ టీమ్ లొంగిపోయే దిశకు చేరుకున్నాయనే ప్రచారం జరుగుతోంది. అది కాని నిజం అయితే ఆ తరువాత రాజకీయ దుమారం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News