అన్నీ చిక్కులే.. ఎటు చూసుకున్నా ఇబ్బందులే

రాజస్థాన్ రాజకీయం మరో పథ్నాలుగు రోజులు రిసార్టులకే పరిమితం కానుంది. ఎమ్మెల్యేలను బయటకు వదిలిపెట్టేందుకు ఎవరూ అంగీకరించడంలేదు. రెండు వర్గాలు రిసార్ట్ నుంచే రాజకీయాలు నడుపుతున్నాయి. రాజస్థాన్ [more]

Update: 2020-07-31 18:29 GMT

రాజస్థాన్ రాజకీయం మరో పథ్నాలుగు రోజులు రిసార్టులకే పరిమితం కానుంది. ఎమ్మెల్యేలను బయటకు వదిలిపెట్టేందుకు ఎవరూ అంగీకరించడంలేదు. రెండు వర్గాలు రిసార్ట్ నుంచే రాజకీయాలు నడుపుతున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో అసెంబ్లీ సమావేశాల్లో తాడో పేడో తేల్చుకునేందుకు సచిన్ పైలట్, అశోక్ గెహ్లాత్ వర్గాలు సిద్ధమయ్యాయి.

రిసార్టులోనే మరో రెండు వారాలు……

అయితే గత ఇరవై రోజులుగా రిసార్ట్ లోనే కాలం వెళ్లబుచ్చుతున్న ఎమ్మెల్యేలు మరో పథ్నాలుగు రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అశోక్ గెహ్లాత్ వర్గానికి చెందిన దాదాపు 80 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలను కూడా పైర్ మాంట్ హోటల్ లో ఉంచారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే వరకూ వారిని అక్కడే ఉంచాలని అశోక్ గెహ్లాత్ నిర్ణయించారు.

బీఎస్పీ ఎమ్మెల్యేలు…..

కొందరు ఎమ్మెల్యేలు తాము నమ్మకంగా ఉంటామని, ఇళ్లకు వెళ్తామనిన వత్తిడి తెస్తున్నా వీల్లేదని చెబుతున్నారు. అవసరమైతే కుటుంబ సభ్యులను కూడా ఇక్కడకు పిలిపించుకోవచ్చన్న సూచనలతో వారిని అక్కడే ఉంచారు. వీరిలో బీఎస్పీ నుంచి విలీనం అయిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. విలీనంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ, బీఎస్పీ లు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

అదే జరిగితే…..?

ఇక సచిన్ పైలట్ వర్గం కూడా తన ఎమ్మెల్యేలను రిసార్ట్ లోనే ఉంచింది. ప్రస్తుతం రాజస్థాన్ రాజకీయాలు ఆగస్టు రెండో వారం వరకూ రంజుగా సాగనున్నాయి. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం గట్టెక్కాలంటే 101 సభ్యుల మద్దతు అవసరం తనకు 102 మంది సభ్యుల మద్దతు ఉందని అశోక్ గెహ్లాత్ చెబుతున్నారు. బీఎస్పీ వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలపై హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన చిక్కుల్లో పడినట్లే. రాజస్థాన్ రాజకీయానికి తెరపడాలంటే మరో 14 రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News