లాంగ్ టైమ్… లక్కీ విన్నర్ ఎవరో?

మరో పదిహేను రోజుల సమయం. రాజకీయాల్లో ఇది సుదీర్ఘ సమయం ఎవరు ఎటు వైపు ఉంటారో తెలియదు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమవుతోంది. [more]

Update: 2020-07-30 17:30 GMT

మరో పదిహేను రోజుల సమయం. రాజకీయాల్లో ఇది సుదీర్ఘ సమయం ఎవరు ఎటు వైపు ఉంటారో తెలియదు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమవుతోంది. ఈ సమావేశాల్లోనే అందరి భవిష్యత్ తేలిపోనుంది. సచిన్ పైలట్ వర్గం పై అనర్హత వేటు వేయడం, బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల పయనం, బలపరీక్షలో అశోక్ గెహ్లాత్ జయాపజయాలు ఈ సమావేశాల్లోనే తేలనున్నాయి. అందుకే ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

నెల రోజుల నుంచి….

రాజస్థాన్ లో గత నెల రోజులుగా రాజకీయం సంక్షోభంలో పడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సచిన్ పైలట్ వేరే కుంపటి పెట్టుకుని 18 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. దీంతో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. సచిన్ పైలట్ మాత్రం ఏ పార్టీలో చేరకుండా ఇప్పటి వరకూ స్వతంత్రంగానే ఉన్నారు. అయితే సచిన్ పైలట్ తో పాటు ఆయన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అశోక్ గెహ్లాత్ చూస్తున్నారు. దీనివల్ల బలపరీక్ష నుంచి బయటపడవచ్చేదన్నది ఆయన ఆలోచన.

బీజేపీ ప్రయత్నాలు…..

మరోవైపు అశోక్ గెహ్లాత్ కు మద్దతిస్తున్న ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా ఇరకాటంలో పడ్డారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పటికీ ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానంలో ఉంది. బీజేపీ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం మైనారిటీలో పడితే అధికారాన్ని దక్కించుకోవచ్చన్న ఆరాటంలో ఉంది. సచిన్ పైలట్ వర్గం కోసం బీజేపీ నేటికీ ప్రయత్నాలు చేస్తుంది.

గవర్నర్ సమ్మతితో…..

ఈ నేపథ్యంలో గవర్నర్ అసెంబ్లీ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆగస్టు 14వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించుకునేందుకు గవర్నర్ కల్ రాజ్ మిశ్రా సమ్మతి తెలిపారు. దీంతో మరో పదిహేను రోజుల పాటు అశోక్ గెహ్లాత్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సి ఉంది. సమయం చాలా ఉండటంతో బీజేపీ కూడా దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో పదిహేను రోజుల్లో రాజస్థాన్ రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News