చేజేతులా చేసుకుందేగా…అన్నీ తెలిసి

సమయం గడిచేకొద్దీ రాజస్థాన్ రాజకీయం మరింత సంక్షోభంలో పడుతుంది. అందుకే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ బలపరీక్ష కోసం తొందరపడుతున్నారు. కానీ గవర్నర్ పడనీయడం లేదు. దీంతో అశోక్ [more]

Update: 2020-07-29 17:30 GMT

సమయం గడిచేకొద్దీ రాజస్థాన్ రాజకీయం మరింత సంక్షోభంలో పడుతుంది. అందుకే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ బలపరీక్ష కోసం తొందరపడుతున్నారు. కానీ గవర్నర్ పడనీయడం లేదు. దీంతో అశోక్ గెహ్లాత్ లో ఆందోళన మొదలయింది. మరో వైపు రోజురోజుకూ పరిస్థితులు మారుతున్నాయి. ఉన్న ఎమ్మెల్యేలను రక్షించుకోవడం కష్టంగా మారింది. అయితే ఈ పరిస్థితులు తలెత్తుతాయని అశోక్ గెహ్లాత్ ముందుగానే ఊహించలేక పోయారా? అన్న కామెంట్స్ విన్పిస్తున్నాయి.

సీనియర్ రాజకీయనేతగా….

అశోక్ గెహ్లాత్ సీనియర్ రాజకీయ నేత. కేంద్రమంత్రిగానూ, ముఖ్యమంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో లేదని తెలుసు. గవర్నర్ కూడా సహజంగానే సహకరించరన్నది అందరికీ తెలిసిందే. మరోవైపు మధ్యప్రదేశ్ సంక్షోభాన్ని కూడా అశోక్ గెహ్లాత్ చూశారు. అయినా సచిన్ పైలట్ విష‍యంలో సంయమనం పాటించలేకపోయారు. అదే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు టెన్షన్ కు కారణమయింది.

న్యాయస్థానాల్లోనూ…..

మరోవైపు న్యాయస్థానాల్లో కూడా అశోక్ గెహ్లాత్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. సచిన్ పైలెట్ వర్గం అనర్హత వేటుపై పిటీషన్ వేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అందులో ఇంప్లీడ్ చేసింది. మరో వైపు బీఎస్పీ ఎమ్మెల్యేల పరిస్థిితి కూడా తలనొప్పిగా మారింది. బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకోవడాన్ని తప్పుపడుతూ ఇప్పటికే బీజేపీ, బీఎస్పీలు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో బలపరీక్షకు ముడిపెట్టాయి.

ఇబ్బంది తప్పదా?

ఇలా అన్ని రకాలుగా అశోక్ గెహ్లాత్ కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం స్వతంత్రులు, ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతోనే కొనసాగుతుందని తెలుసు. అయినా సొంత పార్టీ నేతలను ఆయన దూరం చేసుకోవడంతోనే ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అన్నీ తెలిసి కూడా అశోక్ గెహ్లాత్ చేతులారా చేటును కొనితెచ్చుకున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News