గెహ్లాత్ ఇక రెడీ అయిపోతున్నారు… అదే కాన్ఫిడెన్స్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ బలపరీక్షకు సిద్ధమవుతున్నారు. ఆయన త్వరలోనే శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారు. అందుకే తనను, పార్టీని నమ్మించి మోసం చేసిన సచిన్ పైలట్ [more]

Update: 2020-07-21 16:30 GMT

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ బలపరీక్షకు సిద్ధమవుతున్నారు. ఆయన త్వరలోనే శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారు. అందుకే తనను, పార్టీని నమ్మించి మోసం చేసిన సచిన్ పైలట్ పై ఆరోపణలకు దిగారు. రాజస్థాన్ సంక్షోభం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం క్యాంప్ లలో ఉన్నారు. వారందరినీ కరోనా నేపథ్యంలో ఎక్కువ రోజుల పాటు క్యాంప్ లలో ఉంచడం శ్రేయస్కరం కాదు.

వీలయినంత త్వరగా…..

ఈ నేపథ్యంలో వీలయినంత త్వరగా బలపరీక్ష చేసుకుని ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ భావిస్తున్నారు. ఇదే సంక్షోభం కంటిన్యూ అయితే తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల్లో సయితం వ్యతిరేకత వచ్చే అవకాశముందని ఆయన భావిస్తున్నారు. సచిన్ పైలెట్ తో పాటు గత కొన్ని నెలలుగా తనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బీజేపీకి సయితం చెక్ పెట్టాలని అశోక్ గెహ్లాత్ భావిస్తున్నారు.

అనర్హత వేటు వేసి….

ఇందులో ప్రధానంగా సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం ముఖ్యమైనది. కర్ణాటక తరహాలో వారిపై వేటు వేస్తే తాను బలం నిరూపించుకోవడానికి మార్గం సుగమం అవుతుందని అశోక్ గెహ్లాత్ భావిస్తున్నారు. ఒక రకంగా దీంతో కాంగ్రెస్ లో అసమ్మతికి కూడా హెచ్చరిక పంపే అవకాశాలున్నాయి. పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారికి వార్నింగ్ ఇచ్చేలా అశోక్ గెహ్లాత్ అనర్హత వేటుకే మొగ్గు చూపుతున్నారు.

బలం ఉండటంతో…..

రాజస్థాన్ లో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 200. మ్యాజిక్ ఫిగర్ 101. నిన్నటి వరకూ కాంగ్రెస్ బలం 107 ఉంది. సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో ఈ సంఖ్య 88గా ఉంది. అశోక్ గెహ్లాత్ కు 10 మంది స్వతంత్ర సభ్యులు మద్దతిస్తామని ప్రకటించారు. వీరితో పాటు బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాత్ వైపు ఉంటామని ప్రకటించారు. ఆర్ఎల్పీ, సీపీఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సయితం బయట నుంచి మద్దతిస్తామని చెప్పడంతో 102 మంది సభ్యుల బలం ఉంది. దీంతో అశోక్ గెహ్లాత్ బలపరీక్షకు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News