దినదిన గండమే… ఎప్పటికైనా తప్పదా?

రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వానికి దినదినగండమేనని చెప్పాలి. సీఎల్పీ భేటీకి 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయినప్పటికీ ఎప్పటికైనా ముప్పు తప్పదని అంటున్నారు. సచిన్ పైలెట్ [more]

Update: 2020-07-14 17:30 GMT

రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వానికి దినదినగండమేనని చెప్పాలి. సీఎల్పీ భేటీకి 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయినప్పటికీ ఎప్పటికైనా ముప్పు తప్పదని అంటున్నారు. సచిన్ పైలెట్ తిరిగి పార్టీ అగ్రనేతల బుజ్జగింపులకు తలొగ్గి వచ్చినా మరలా విభేదాలు తలెత్తక మానవని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం 102 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ రిసార్ట్ కు తరలించింది. ప్రభుత్వం పడిపోకుండా రిసార్ట్ రాజకీయాలను వెంటనే స్టార్ట్ చేసింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు తమకు మద్దతిస్తున్న ఇతర పార్టీు,స్వతంత్ర ఎమ్మెల్యేలను కూడా రిసార్ట్ కు తరలించింది.

స్వల్ప మెజారిటీతో…..

200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ లో ప్రభుత్వం మనుగడ కొనసాగాలంటే 101 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పడు అశోక్ గెహ్లాత్ బలం చూస్తే 102 ఉంది. అంటే ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఢోకా లేనట్లే. అయితే ఇది ఎంతకాలమన్నదే ప్రశ్న. ఈరోజు గెహ్లాత్ వెంట నడిచిన ఎమ్మెల్యేలు డిమాండ్లు పెట్టే అవకాశముంది. ఆ డిమాండ్లను అశోక్ గెహ్లాత్ ఖచ్చితంగా తీర్చాలి. లేకుంటే వారు కాలరెగరేసి జెండా పీకేస్తారు.

బీజేపీ రెడీగా…..

మరోవైపు భారతీయ జనతా పార్టీ కాచుక్కూర్చుని ఉంది. సచిన్ పెలెట్ వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉంటారని తొలుత భావించింది. అయితే సచిన్ పైలెట్ తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబట్టడంతో దానికి బీజేపీ అంగీకరించ లేదు. లేకుంటే సచిన్ పైలెట్ కు కండువా కమలం పార్టీ కప్పేసేదే. అశోక్ గెహ్లాత్ కూడా సీనియర్ నేత కావడంతో గత కొంతకాలంగా ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారు. బీజేపీ అడుగులు గమనిస్తూ ఆయన గత కొద్దినెలలుగా మైండ్ గేమ్ కు కూడా తెరదీశారు.

గెహ్లాత్ మైండ్ గేమ్ తో….

అశోక్ గెహ్లాత్ ఇంటలిజెన్స్ నివేదికను తెప్పించుకుని నిత్యం ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారట. ఇందుకోసం ప్రత్యేక టీంను అశోక్ గెహ్లత్ నియమించారని చెబుతున్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన నాటి నుంచే అశోక్ గెహ్లాత్ అప్రమత్తమయ్యారు. బీజేపీతో ముప్పు పొంచిఉందని ఆయనకు తెలుసు. అందుకే ఆయన గత నెలలుగా కోట్లాది రూపాయలను వెచ్చించి బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి యత్నిస్తుందని మైండ్ గేమ్ ప్రారంభించారు. ప్రస్తుతానికి అశోక్ గెహ్లాత్ సక్సెస్ అయినప్పటికీ ముప్పు వాకిట ముందే ఉందన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News