పెద్దాయన ఊ అంటారా? ఊహూ.. అంటారా?

కాంగ్రెస్ అధిష్టానం శాశ్వత అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తులను ప్రారంభించింది. త్వరలో జరిగే ఏఐసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ నుంచి [more]

Update: 2021-01-30 17:30 GMT

కాంగ్రెస్ అధిష్టానం శాశ్వత అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తులను ప్రారంభించింది. త్వరలో జరిగే ఏఐసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ నుంచి పూర్తి స్థాయి బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సీనియర్ నేతలతో సమావేశమయినప్పుడు అందరూ ఏకగ్రీవంగా రాహుల్ గాంధీ పేరునే సూచించారు.

శాశ్వత అధ్యక్షుడిగా…..

దీంతో పాటు శాశ్వత అధ్యక్షుడు ఉంటేనే క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని చెప్పారు. అయితే రాహుల్ గాంధీ ఇప్పుడప్పుడే పార్టీ పగ్గాలు అందుకునేందుకు సుముఖంగా లేరంటున్నారు. ఆయన సార్వత్రిక ఎన్నికలకు ముందు బాధ్యతలను తీసుకునే అవకాశముందంటున్నారు. తాను క్రియాశీలకంగా ఉంటాను కాని, పార్టీ బాధ్యతలను మాత్రం స్వీకరించబోనని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు చెప్పినట్లు తెలిసింది.

రాహుల్ సూచన మేరకే…

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాశ్వత అధ్యక్షుడిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పేరు బాగా వినపడుతుంది. ఈయన గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సీనియర్ నేత కావడంతో ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించాలని సోనియా నిర్ణయించారని, దీనికి రాహుల్ గాంధీ సయితం ఓకే చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అశోక్ గెహ్లాత్ ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీనికి ఆయన అంగీకరిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

రెండు సమస్యలకు….

అశోక్ గెహ్లాత్ కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల రెండు సమస్యలకు చెక్ పెట్టినట్లవుతుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్ కు బాధ్యతలను అప్పగించవచ్చు. రాహుల్ గాంధీ సన్నిహితుడికి ఛాన్స్ దొరికినట్లవుతుంది. దీంతో పాటు శాశ్వత అధ్యక్షుడిగా కూడా అశోక్ గెహ్లాత్ సరిగ్గా సరిపోతారని రాహుల్ భావిస్తున్నారు. అయితే అశోక్ గెహ్లాత్ మాత్రం జాతీయ రాజకీయాల్లోకి వచ్చేందుకు సుముఖంగా లేరంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News