గడువు దగ్గర పడింది… ప్రయత్నాలు ముమ్మరం

రాజస్థాన్ రాజకీయం రిసార్ట్ లకే పరిమితమయింది. రెండు వర్గాలు రిసార్ట్ లోనే మొహరించాయి. తమ ఎమ్మెల్యేలు కట్టు తప్పకుండా కఠిన ఆంక్షలు విధించాయి. రాజస్థాన్ లో అసెంబ్లీ [more]

Update: 2020-08-09 17:30 GMT

రాజస్థాన్ రాజకీయం రిసార్ట్ లకే పరిమితమయింది. రెండు వర్గాలు రిసార్ట్ లోనే మొహరించాయి. తమ ఎమ్మెల్యేలు కట్టు తప్పకుండా కఠిన ఆంక్షలు విధించాయి. రాజస్థాన్ లో అసెంబ్లీ సమావేశాలకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ ఐదు రోజులు కాపాడుకోగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ప్రయత్నిస్తున్నారు. ఆయన రెండు మూడు రోజులకొకసారి ఎమ్మెల్యేలు విడిది చేసిన ప్రాంతాలకు వెళ్లి వారితో ముచ్చటించి వస్తున్నారు.

ఈనెల 14వ తేదీన సమావేశాలు….

రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14వ తేదీన జరగనున్నాయి. ఇప్పటికే అశోక్ గెహ్లాత్ తన వర్గానికి, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను రిసార్ట్ లకు తరలించారు. నేరుగా ఆరోజు అసెంబ్లీ సమావేశాలకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేశారు. ఎమ్మెల్యేకు పది కోట్ల రూపాయలు ఇస్తామని బేరసారాలు జరుగుతున్నాయని అశోక్ గెహ్లాత్ బీజేపీపై ఆరోపించారు. ప్రధానంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ డీల్ చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు.

అనర్హత వేటు వేయాలంటే…

మరోవైపు అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సచిన్ పైలట్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అశోక్ గెహ్లాత్ భావిస్తున్నారు. వారిపై అనర్హత వేటు వేసిన తర్వాతనే బలపరీక్షకు వెళ్లాలన్నది అశోక్ గెహ్లాత్ వ్యూహంగా కన్పిస్తుంది. అయితే అనర్హత వేటు అంశం కోర్టు పరిధిలో ఉండటంతో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విషయం కూడా కోర్టులో నలుగుతుంది.

ససేమిరా అంటున్న సచిన్…..

సచిన్ పైలట్ వర్గం కూడా రిసార్ట్ లోనే ఉంది. తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని సచిన్ పైలట్ చెప్పారు. ఆయన వర్గం నేతలను తిరిగి కాంగ్రెస్ వైపు రప్పించేందుకు చేసిన కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీ కూడా చివరిక్షణం వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీంతో రాజస్థాన్ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపులు తిరుగుతాయో చెప్పలేని పరిస్థితి. కొద్దిరోజులే సమయం ఉండటంతో రాజస్థాన్ లో రాజకీయం ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ భవితవ్యం ఎలా ఉండనుందో.

Tags:    

Similar News