అశోక్ ని దెబ్బతీసిందెవరు ?

పూసపాటి వంశీకుడు. విజయనగరం సంస్థానాధీశుడు. నాలుగున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ పలుమార్లు రాష్ట్ర మంత్రిగా, ఒక తడవ కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు [more]

Update: 2020-03-08 06:30 GMT

పూసపాటి వంశీకుడు. విజయనగరం సంస్థానాధీశుడు. నాలుగున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ పలుమార్లు రాష్ట్ర మంత్రిగా, ఒక తడవ కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు పరిస్థితి ఇపుడు దారుణంగా ఉందని అంటున్నారు. ఇంత వెలుగూ వెలిగి ఇపుడు ఇలా అంధకారంలోకి వెళ్ళిపోవడమేంటి అని ఆయన అనుచరులు కూడా మధన పడుతున్నారు. అశోక్ పై 2014 నుంచి తన పార్టీలోనే రాజకీయ కుట్రలు సాగుతున్నాయని అంటున్నారు.

ఉన్న పరువూ…..

విజయనగరం రాజులకు పదవులు కొత్త కాదు, వాటి కంటే కూడా పరువు, గౌరవాలు వారికి మిన్న. ఓడిపోవడం, గెలవడం అన్నది ఎన్నికల క్రీడ. వాటికి అతీతంగా వారికి పేరు ప్రఖ్యాతులు ఉంటూ వచ్చాయి. రాజకీయం కంటే రాజులుగా రాచ ఠీవితో వెలుగొందడమే వారికి తెలుసు. అందుకే ఎన్టీఆర్ నే కాదని, తన ఆత్మగౌరవం కోసం ఆనందగజపతిరాజు ఆనాడే సైకిల్ దిగిపోయారు. ఆయన కంటే కొంత లౌక్యం తెలిసిన నేతగా అశోక్ గజపతి రాజు మాత్రం ఇప్పటిదాకా టీడీపీని అనుసరిస్తూ వచ్చారు. అయితే ఆయన తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. దానికంటే ఎక్కువగా బాధించిన ఘటన ఆయన్ని వైసీపీ సర్కార్ మాన్సాస్ ట్రస్ట్, సిం హాచలం ట్రస్త్ చైర్మన్ పదవుల నుంచి తప్పించడం.

హ్యాండ్ ఇచ్చారా….?

అశోక్ గజపతిరాజు కి ఇంకా పెద్ద బాధ మరోటి ఇపుడు పట్టిపీడిస్తోందిట. ఆయన అనారోగ్య సమస్యలతో ఢిల్లీలో వైద్యం చేయించుకోవడానికి వెళ్ళారు. సరిగ్గా ఆ సమయంలో వైసీపీ సర్కార్ స్కెచ్ గీసినట్లుగా ఆయన్ని తప్పించి ఆనంద్ కుమార్తె అయిన సంచయిత గజపతిరాజుని చైర్ పర్సన్ గా అశోక్ సీట్లో కూర్చోబెట్టింది. ఇదిలా ఉంటే సొంత పార్టీ నేతలు తనను కనీసం పలకరించకపోవడం, అండగా ఉండకపోవడం పట్ల రాజు గారు గుస్సా అవుతున్నారుట.

ఇక సన్యాసమే…?

నిజానికి బాబుకు అశోక్ కి మధ్య ఎడం 2014 నుంచే మొదలైంది. నాడు అశోక్ గజపతిరాజు ని లోక్ సభకు పోటీ చేయించి కేంద్ర రాజకీయాల్లోకి పంపారు. అదృష్టం కలసివచ్చి ఆయన ఎంపీగా గెలిచారు. పొత్తులో భాగంగా మోడీ కూడా ఆయన్ని కేంద్ర మంత్రిగా ఎంచుకున్నారు. ఇక ఆయన చేత రాజీనామా చేయించేవరకూ బాబు అండ్ కో ఊరుకోలేదని అంటారు. 2019 ఎన్నికల ముందు కూడా ఇలాగే రాజకీయంగా దెబ్బ కొట్టాలని సొంత వారు చూశారని అంటారు, ప్రత్యర్ధులకు వారే సాయం చేసి ఓడించారని చెబుతారు. ఇక తాజా ఎపిసోడ్ తో రాజుగారు తట్టుకోలేకపోతున్నారుట. వెన్నుపోట్లు, అవమానాలు చూశాక రాజుగారు ఇక ఈ రాజకీయాలు మనకు ఎందుకు అని ఇపుడు భావిస్తున్నారుట. ఆయన తొందరలోనే టీడీపీకి, పాలిటిక్స్ కి కూడా గుడ్ బై కొడతారని అంటున్నారు. అదే జరిగితే టీడీపీకి గట్టి దెబ్బ పడినట్లే.

Tags:    

Similar News