అప్పన్న ఆశీస్సులు లేనట్లేనా ?

ఆ వంశం అప్ప్పన్నకు ప్రధాన సేవకులు. తొలి పూజ వారే చేయాలి. వారే స్వామి వారి ఆలయ తలుపులు తీసి అర్చన చేయాలి. అటువంటి రాచ కుటుంబం [more]

Update: 2020-04-27 03:30 GMT

ఆ వంశం అప్ప్పన్నకు ప్రధాన సేవకులు. తొలి పూజ వారే చేయాలి. వారే స్వామి వారి ఆలయ తలుపులు తీసి అర్చన చేయాలి. అటువంటి రాచ కుటుంబం పూసపాటి వారిది. దాదాపు ఎనభైయేళ్ళుగా అధికారింగా ఈ అనవాయితీ వస్తోంది. అంతకు ముందు ఏ విధమైన చట్టాలు లేనపుడు కూడా అనూచానమైన సంప్రదాయం ప్రకారం ఇదే విధానం అమలయింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండగా పూసపాటి వారి కుటుంబానికి విశాఖలోని సుప్రసిధ్ధ ఆలయ ధర్మకర్త్వత్వం నాటి దేవదాయ శాఖ ద్వారా అధికారికంగా అప్పచెప్పబడింది. నాటి నుంచి ఇప్పటిదాకా పూసపాటి వారి రెండు తరాలకు చెందిన గజపతులు అప్పన్న స్వామికి తొలి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది మార్చిలో వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో కేంద్ర మాజీ మాంత్రి అశోక్ గజపతిరాజు చైరన్ గిరీ ఒక్కసారిగా పోయింది. ఆ స్థానంలో అన్న ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె సంచయిత గజపతిరాజుకి చైర్ పర్సన్ పగ్గాలు అప్పగించారు.

చందనోత్సవ వేళ….

సింహాచలంలో అప్పన్న స్వామికి అతి ముఖ్యమైన వేడుక చందనోత్సవం. అది వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు వస్తుంది. ఆ రోజున స్వామి వారు నిజ రూప దర్శనంలో భక్తులకు కనిపిస్తారు. ఈ వేడుకలకు ధర్మకర్త హోదాలో అశోక్ గజపతిరాజు హాజరై పట్టు వస్త్రాలు సమరిపించి తొలి పూజ చేస్తారు. ఆ మీదట భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. గత ఏడాది వరకూ అశోక్ కుటుంబం సమేతంగా ఆ హోదాలో వచ్చేవారు. ఈసారి సంచయిత గజపతి రాజు ఆ హోదాను తీసుకున్నారు. ఇక మరో వైపు కరోనా మహమ్మారి ఉన్నందువల్ల భక్తులనే కాదు, వీఐపీలను ఎవరినీ స్వామి సన్నిధికి అనుమతించలేదు. దాంతో అశోక్ కుటుంబంతో పాటు మొత్తం పూసపాటి వారి వంశీకులు స్వామి ఆశీస్సులకు దూరం అయ్యారు.

అపశకునమా…?

స్వామి ఆశీస్సులకు పూసపాటి కుటుంబీలకు ఈసారి అవకాశం లేకపోవడానికి కరోనా ప్రధాన కారణం. అయితే దానికి ముందే చైర్మన్ పదవి పోయింది. దాని మీద అశోక్ న్యాయ పోరాటం చేస్తున్నారు. కోర్టుకు కూడా వెళ్ళారు. ఆ కేసు అలా ఉండగానే స్వామి వారి దర్శన భాగ్యం లేకుండా కరోనా రావడంతో ఇది అపశకునంగా అశోక్ వర్గీయులు భావిస్తున్నారు. శతాబ్దాల తరబడి భగవంతుడికీ, భక్తుడికీ మధ్య ఉన్న అనుబంధం అది. రెండు నెలల క్రితం వరకూ అది పదిలంగానే ఉంది. ఒక్కసారిగా మార్పు వచ్చింది. చైర్మన్ హోదా పోయింది. ఆ తరువాత సాధారణ భక్తులుగా దర్శన భాగ్యం లేదంటే ఆస్తికత్వం నిండుగా ఉన్న పూసపాటి వారి వంశీకులకే కాదు, భక్తులందరికీ కూడా ఓ విధంగా బాధ కలుగుతోంది అంటున్నారు.

కలసి ఉంటేనే….

ఇక సంచయిత తండ్రి ఆనందగజపతి రాజు నాలుగేళ్ళ క్రితమే చనిపోయారు. ఆయన బతికి ఉండగానే పూసపాటి కుటుంబంలో రాజకీయాలు ప్రవేశించాయి అంటారు. అందరిలాగానే కలతలు, కలహాలు చోటు చేసుకున్నాయని, అవి చివరికి సంచయిత నియామకంతో బహిర్గతం అయ్యాయని చెబుతారు. నిజానికి పీవీజీ రాజు ఉన్నపుడు అంతా ఒక్కటిగా ఉన్న కుటుంబం తరువాత అన్నదమ్ముల కాలంలో కొంత సఖ్యత తగ్గినట్లుగా కనిపించింది. ఇపుడు మూడవ తరంలో చూసుకుంటే అది ఒక్కసారిగా బద్దలైంది. అయితే అందరి రక్తం ఒక్కటే, పూసపాటి వంశం అంతా ఒక్కటే. ఈ భావనతో అంతా కలిస్తే మళ్ళీ అప్పన్న స్వామి ఆలయంలోనే కాదు, ఆస్తిక జనుల్లో కూడా వారి చోటు ఎప్పటికీ అలాగే చెదిరిపోకుండా ఉంటుంది. మరి రాజకీయాలు, ఆస్తుల గొడవలు, పదవుల పోరాటాల మధ్య ఐక్యత సాధ్యపడుతుందా. చూడాలి.

Tags:    

Similar News