చెల్లెల్ని ఢీ కొట్టగలదా ?

రాజకీయాల్లో పెద్దవారి కడుపున పుడితే చాలదు, ఎవరు రాణిస్తారు అన్నది ఎవరూ అసలు ఊహించలేరు కానీ రాజకీయాల్లో విజయవంతం కావాలంటే కొన్ని కచ్చితమైన అర్హతలు కొన్ని ఉండాలని [more]

Update: 2020-04-04 00:30 GMT

రాజకీయాల్లో పెద్దవారి కడుపున పుడితే చాలదు, ఎవరు రాణిస్తారు అన్నది ఎవరూ అసలు ఊహించలేరు కానీ రాజకీయాల్లో విజయవంతం కావాలంటే కొన్ని కచ్చితమైన అర్హతలు కొన్ని ఉండాలని అంటారు. అది జనంతో కలసిపోవడమే కాదు వారి నాడి పట్టుకుని వారే వీరుగా మారిపోవడం. ఆ మ్యాజిక్ తెలిసిన వారే జన నేతలుగా నిలబడతారు. పూసపాటి వారి కుటుంబంలో ఆ విధంగా చూసుకుంటే అన్న ఆనందగజపతి రాజు కంటే ఈ గుణాలు అశోక్ లో ఎక్కువగా ఉండేవి. అందుకే ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో మనగలిగారు. ఆనంద్ మంత్రిగా, ఎంపీగా చేసినా కూడా చివరకి చేతులెత్తేశారు. ఇక ఈ ఇద్దరికీ వారసులుగా కూతుళ్ళే ఉన్నారు.

ఆమెతోనే….

అశోక్ విషయం తీసుకుంటే ఆయన సతీమణి సునీల్ గజపతిరాజు మునిసిపల్ చైర్ పర్సన్ గా చాన్నాళ్ళ క్రితమే పనిచేశారు. ఇక ఆయన ఇద్దరి కూతుళ్ళలో పెద్దమ్మాయి అదితి గజపతిరాజు తండ్రికి చేదోడువాడోడుగా ఉంటూ రాజకీయ వాసనలు కొంత పసిగట్టారు. ఆమె తన వారసురాలుగా అశోక్ పార్టీ క్యాడర్ కి ఎపుడో చెప్పేశారు. అయితే అశోక్ మాదిరిగా కుమార్తెకు మాస్ పల్స్ తెలియకపోవడం, అందరికీ కలుపుకుని పోకపోవడం వల్ల గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా సరే ఆమెను టీడీపీ ఇంచార్జిగా పెట్టి అశోక్ కధ నడుపుతున్నారు.

అనూహ్యంగా ముందుకు….

ఇక అశోక్ కుటుంబంలో అతి పెద్ద కుదుపు అంటే ఎన్నికల్లో ఓటమి కానే కాదు. ఆయన వంశీకులు తరాలుగా అనుభవిస్తున్న మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ తో పాటు, ప్రసిద్ధ సింహాచలం దేవస్థానం చైర్మన్ పదవులు. ఈ రెండింటినీ హఠాత్తుగా అన్న కూతురు సంచయిత గజపతిరాజు లాగేసుకున్నారు. ఆమె ఓ వైపు బీజేపీలో చేరి ఢిల్లీ స్థాయిలో పరిచయాలు పెంచుకున్నారు. మరో వైపు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతోనూ చెలిమి చేసి తాను అనుకున్నది సాధించారు. ఇపుడు అశోక్ ఏమీ చేయలేకపోతున్నారు. బలమైన ప్రభుత్వాల అండ సంచయితకు ఉండడంతో అసహనంతో ఉన్నారు. ఆమెని పదవి కి ఎంపిక చేసిన తీరు మీద కోర్టుకెళ్ళారు కానీ, అది పరిష్కారం కాదు, ఆమెను అలా వదిలేస్తే ఇంకెక్కడికి కధ నడిపించగలదో అన్న భయం ఇపుడు పెద్దాయన‌కు పట్టుకుందిట.

కూతురుతోనే చెక్…

ఇక అశోక్ కూతురు అదితి గజపతిరాజును ముందు సంచయితకు చెక్ చెప్పాలనుకుంటున్నారు. రాజకీయంగా తలపండిన అశోక్ రేపటి రోజున సంచయిత విజయనగరం ఎమ్మెల్యే సీటుకు ఎక్కడ ఆమె పోటీకి వస్తుందోనని ముందుగానే కలవరపడుతున్నారుట. వైసీపీ ప్లాన్ కూడా అదే. అన్నీ అనుకూలిస్తే సంచయితను విజయనగరం సీటు నుంచి 2024లో ఎమ్మెల్యేగా బరిలోకి దించి గెలిపించుకోవాలని ఆలోచిస్తున్నారని భోగట్టా. అదే జరిగితే పూసపాటి వారి వంశంలో అశోక్ తరం పూర్తిగా అంతరించిపోయినట్లే. దాంతో తన కుమార్తెకి విజయనగరం పార్టీ పగ్గాలు ఇప్పించడం ద్వారా తాను తెర వెనక నుంచి పావులు కదపాలని భావిస్తున్నారుట.

సక్సెస్ అయినట్లేనా..?

మాన్సాస్ ట్రస్ట్ చేతిలో ఉండడం, ఇప్పటికే మూడు జిల్లల్లో స్వచ్చంద సంస్థ ద్వారా సంచయిత గజపతిరాజు చేసిన సేవా కార్యక్రమాలతో జనానికి బాగా దగ్గరవుతోంది. పైగా ఆనంద్ కి జనంలో మంచి పేరు, ఆయన కుటుంబం పట్ల సానుభూతి కూడా ఉన్నాయి. అన్నీ కలిస్తే సంచయిత రేపటి రోజున పూసపాటివారికి అసలైన రాజకీయ వారసురాలిగా కూడా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆమెను ఢీ కొట్టే విషయంలో అదితి గజపతి రాజు ఎంతవరకూ రాటుతేలుతారో చూడాలి.

Tags:    

Similar News