అశోక్ కి ఇక శోకమేనా ?

ఆయన విజయనగరం రాజా వారు. పూసపాటి వారి ఘనమైన వారసుడు అశోక్ గజపతి రాజు . ఆయనకు ప్రభుత్వ పదవులు లేకపోయినా తమ రాచరిక వారసత్వ పదవులు [more]

Update: 2020-03-27 12:30 GMT

ఆయన విజయనగరం రాజా వారు. పూసపాటి వారి ఘనమైన వారసుడు అశోక్ గజపతి రాజు . ఆయనకు ప్రభుత్వ పదవులు లేకపోయినా తమ రాచరిక వారసత్వ పదవులు రక్షణ కవచాలుగా ఉండేవి ఉత్తరాంధ్రాలోని ప్రసిధ్ధ పుణ్య క్షేత్రం సింహాచలం దేవస్థానం ట్రస్టీ చైర్మన్ హోదా అంటే అది ఎంతో విలువైనది. పవిత్రమైనది. అలాగే, దాదాపు 13 వేల ఎకరాల భూములు, ఎన్నో విద్యా సంస్థలు కలిగిన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అంటే ఆ విలువకు తూకం వేయలేరు. దాంతో ఆయన ఎన్నికల్లో ఓడినా కూడా నిబ్బరంగా ఉంటూ వచ్చారు. ఇపుడు ఆ పదవులు అన్న కూతురు సంచయిత గజపతి రాజు ఒక్కసారిగా తన్నుకుపోయారు.

అన్నీ పక్కాగానే…

పూసపాటి రాజావారు పీవీజీ రాజు పెద్ద కుమారుడు ఆనందగజపతిరాజు. ఆయన మొదటి భార్య ఉమా గజపతిరాజు. వారి కుమార్తె సంచయిత గజపతిరాజు. ఆనంద్ 2016లో చనిపోయారు. ఆయన మరణించేవరకూ తండ్రితో మంచి సంబంధాలు సంచయితకు ఉండేవి. ఇక పూసపాటి వారి వంశీకుల్లో ఆధిపత్యం చేస్తూ హవా చూపించింది అశోక్ గజపతి రాజు మాత్రమేనని అంటారు. దాని వల్ల మాన్సాస్ ట్రస్ట్ ఇతర వ్యవహారాల్లో వారసులు ఎవరికీ అవకాశం లేకుండా పోయిందని చెబుతారు. ఇపుడు సంచయిత నియామకం అంతా పక్కాగా అన్నీ చూసుకునే వైసీపీ సర్కార్ చేసిందని అంటున్నారు. ఆమె నియామకాన్ని ఎవరూ కొట్టివేయలేనిదని అంతా అంగీకరిస్తున్నారు.

వామ్మో కూతురా…?

ఇక బీజేపీ పెద్దల ఆశీస్సులు నిండుగా సంచయితకు ఉన్నాయని చెబుతున్నారు. ఏకంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో మంచి సంబంధాలు సంచయితకు ఉన్నాయని చెబుతారు. అందువల్లనే ఏపీ బీజేపీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, పీవీఎన్ మాధవ్ వంటి వారు మొదట్లో సంచయితకు వ్యతిరేకంగా గళం విప్పినా సీన్ అర్ధమై మౌనం వహించారట. ఇక చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ ఉండడంతోనే వైసీపీ సర్కార్ ఆమెను నియమించిందని తెలుసుకునే అశోక్ గజపతి రాజు కి మద్దతు ఇవ్వలేదని ప్రచారంలో ఉంది. దాంతో అన్న కూతురు సామాన్యురాలు కాదు, అమ్మో కూతురా అనిపించేలా ఉందని తమ్ముళ్ళే కాదు, కాషాయధారులూ అంటున్నారు.

బలహీనమైన వాదన…..

అశోక్ గజపతి రాజు ని పదవి నుంచి తప్పించడం వల్ల ఆకాశం భూమి కలుస్తాయని, ఉత్తరాంధ్రాలో జనం పూసపాటి వారి వైపు ఉంటారని, వైసీపీకి పూర్తి వ్యతిరేకత జనంలో వస్తుందని టీడీపీ పెద్ద స్కెచ్ వేసి సానుభూతి కోసం ప్రచారం చేసింది. కానీ అన్ని నియమాలూ పాటించే సంచయిత గజపతి రాజుకు పదవి ఇచ్చారని అంటున్నారు. ఇక వైసీపీ అర్ధరాత్రి జీవోలు జారీ చేయడం పట్ల మాత్రమే అభ్యంతరాలు ఉన్నాయి. దాని మీదనే అశోక్ కోర్టుకు వెళ్ళారు. అదేమంత బలమైన వాదన కాదని అంటున్నారు. ఇక అశోక్ సైతం ఇపుడు ఒంటరి పోరటమే చేస్తున్నారు. ఆయనకు మొదట్లో మద్దతుగా నిల్చిన బీజేపీ, తరువాత టీడీపీ కూడా తప్పుకున్నాయి. కోర్టులో జీవోను అశోక్ గజపతి రాజు సవాల్ చేశారు. దాని తీర్పు గురించే ఆయన ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి పూసపాటి వారి వంశంలో కొత్త పెత్తందారుగా సంచయిత కూల్ గా వచ్చి బాగానే కుదురుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News