అసద్ కు ఇక అదే పనా?

అసదుద్దీన్ ఒవైసీ తన ఎంఐఎం పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ తమ అభ్యర్థులను [more]

Update: 2020-06-13 17:30 GMT

అసదుద్దీన్ ఒవైసీ తన ఎంఐఎం పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ తమ అభ్యర్థులను బరిలోకి దించారు. మహారాష్ట్రలో ఎంఐఎం సక్సెస్ అయింది. ఉత్తర్ ప్రదేశ్ లో ఎంఐఎంకు పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. పశ్చిమ బెంగాల్ లో నూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అసదుద్దీన్ ఒవైసీ సిద్ధమవుతున్నారు. తాజాగా బీహార్ లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

పశ్చిమ బెంగాల్ లో పోటీకి….

పశ్చిమ బెంగాల్ లో పోటీకి దిగుతామని అసదుద్దీన్ ఒవైసీ చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి మమత బెనర్జీ మండి పడ్డారు. భారతీయ జనతా పార్టీకి లబ్ది చేకూర్చేందుకే అసదుద్దీన్ ఒవైసీ ఇక్కడ బరిలోకి దిగుతానని ప్రకటించారన్నారు. ముస్లిం ఓట్లలో చీలిక తెస్తే బీజేపీ ఆటోమేటిక్ గా లాభపడుతుందన్నది మమత బెనర్జీ భావన. అందుకే ఆమె అసదుద్దీన్ ఒవైసీ ప్రకటన చేయగానే విమర్శలతో ధ్వజమెత్తారు. బీజేపీకి లబ్ది చేకూర్చే చర్యలు మానుకోవాలని అసదుద్దీన్ ఒవైసీకి మమత బెనర్జీ సూచించారు.

బీజేపీకి లబ్ది చేకూర్చే విధంగా….

నిజానికి మమత బెనర్జీ వ్యాఖ్యనించిన దాంట్లో నిజం లేకపోలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ దెబ్బతినడానికి అసదుద్దీన్ ఒవైసీ కారణమంటున్నారు. శివసేన, బీజేపీ ల మధ్య విభేదాలు తలెత్తాయి కాబట్టి ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. శివసేనతో కలసి చచ్చీ చెడీ కాంగ్రెస్, ఎన్సీపీలు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అలాగే ఉత్తర్ ప్రదేశ్ లోనూ ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోవడంతో బీజేపీకి భారీగా లబ్ది చేకూరిందంటున్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ….

ఇక తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం బరిలో ఉంటుందని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మొత్తం 32 స్థానాల్లో పోటీ చేస్తామని అసద్ చెప్పారు. మొత్తం 22 జిల్లాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని అసదుద్దీన్ తెలిపారు. అయితే తాము పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. అయితే ఎంఐఎం పోటీ ఆర్జేడీ, కాంగ్రెస్ లకు నష్టమేనని రాజకీయ మేధావులు చెబుతున్నారు. 32 స్థానాలను ఎంఐఎంకు ఆ కూటమి ఇచ్చే పరిస్థితి లేదని, ఒంటరిగా పోటీకి ఎంఐఎం దిగితే ముస్లిం ఓట్లు చీలి మరోసారి బీజేపీ కూటమి లబ్ది పొందే అవకాశాలున్నా యంటున్నారు. మొత్తం మీద అసద్ బీజేపీకి పరోక్షంగా మేలు చేస్తున్నారన్న చర్చ జాతీయ స్థాయిలో జరుగుతుంది.

Tags:    

Similar News