అసలు ప్లాన్ ఇదే....!!!

Update: 2018-12-14 15:30 GMT

ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ పేరుకే అఖిలభారత పార్టీ. కానీ హైదరాబాదు పాత బస్తీ దాటి సాధించిన విజయాలు కనిపించవు. అప్పుడప్పుడు మహారాష్ట్ర వంటి చోట్ల కొంత హడావిడి, కొన్ని సీట్లు తెచ్చుకున్నప్పటికీ మొత్తమ్మీద భాగ్యనగరానికే పరిమితం. కేరళ , ఉత్తర , ఈశాన్య భారతాల్లో మైనారిటీ పార్టీలు ఉన్నప్పటికీ వాటి ప్రాబల్యం, ప్రభావం దేశరాజకీయాలపై పెద్దగా పడటం లేదు. దీంతో ఏదో ఒక జాతీయపార్టీకో, లేకపోతే తమను బాగా చూసుకుంటారని భావించే ప్రాంతీయపార్టీకో మద్దతుగా ముస్లిం వర్గాలు నిలుస్తున్నాయి. దీనికి చెక్ పెట్టి సొంత అస్తిత్వాన్ని , జాతీయ ముద్రను వేసుకోవాలనే తపనలో పడింది ఎంఐఎం. ఇప్పటి వరకూ దానికున్న పరిమితులను అధిగమించేలా పక్కాప్లాన్ గీసారు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాలను నడుపుతానని చెబుతున్నప్పటికీ ఇందుకు ఎంఐఎం ను సోపానంగా చేసుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ప్రస్తుతం దేశ రాజకీయ చిత్రం రెండు శిబిరాలుగా చీలిపోయి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనకు ఎగబడి ఎవరూ ముందుకు రారనే సంగతి కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే ముందుగా మైనారిటీ ఓట్ల సంఘటితంతో మొదలుపెట్టి రీజనల్ పార్టీలను లైన్ లోకి తీసుకురావాలనే యోచన చేస్తున్నారు.

40 సీట్లు పక్కా...

రానున్న లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఫలితాలను అన్వయింపచేస్తే టీఆర్ఎస్ కు 13 నుంచి 15 సీట్లు లభించడం పక్కా. ఎంఐఎంకు హైదరాబాదు సీటు ఎలాగూ వస్తుంది. ఈ పథ్నాలుగు, పదిహేను సీట్లతో దేశ రాజకీయాలను శాసించే అవకాశం శూన్యం. అందుకే విస్తరణ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫలితాలకు ముందు వీరిరువురూ చర్చించిన సంగతి ఇదే అనేది టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఉత్తరప్రదేశ్, పశ్చిమబంగ,బిహార్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కనీసం 25 లోక్ సభ స్థానాల ఫలితాలను శాసించగల స్థాయిలో ముస్లిం జనాభా ఉంది. వీరు కమిట్ అయితే చాలు ఇతర వర్గాల ఓట్లతో సంబంధం లేకుండా విజయం ఏకపక్షంగా లభిస్తుంది. అయితే ఇంతవరకూ కాన్సంట్రేషన్ తో కూడిన ప్రయత్నం సాగలేదు. దాంతో ఏదో పార్టీకి మద్దతు దారులుగానే మిగిలిపోవాల్సి వచ్చింది. ఈ సంప్రదాయానికి చెక్ పెట్టి స్వతంత్రంగా వారి బలాన్ని గుర్తు చేసేలా ఎంఐఎం విస్తరించాలనే దిశలో ప్రచారవ్యూహాన్ని కేసీఆర్, అసదుద్దీన్ సిద్ధం చేశారు. ఇందుకు అవసరమైన అంగ,అర్ద బలాలను సమకూర్చే బాధ్యతను టీఆర్ఎస్ తీసుకుంటుంది. మిగిలిన పార్టీల తరహాలోనే పెద్ద ఎత్తున ప్రచారంతోపాటు సామదానభేదోపాయాలన్నిటినీ ప్రయోగించేందుకూ ప్లాన్ రెడీ. కోట్ల రూపాయల వ్యయానికీ వెనుకాడాల్సిన పనిలేదని కేసీఆర్ భరోసానిచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం తగినన్ని సీట్లు తెచ్చుకోగలిగితే జాతీయంగా అధికారంలోకి వచ్చే ఏపార్టీ అయినా తమను ఆశ్రయించాల్సిందేనన్న రాజకీయ భావన వీరిలో ఏర్పడింది.

‘సై’ అంటే సాగిలపడాల్సిందే...

తొలి దశలో ఎంఐఎం గట్టి ప్రయత్నం మొదలుపెట్టి ముస్లిం మైనారిటీలను ఆకర్షించడం మొదలుపెడుతుంది. దీనికి అవసరమైన వాగ్ధాటి అసద్ కు ఉంది. తాను కూడా భాగస్వామ్యం వహిస్తానని కేసీఆర్ కూడా చెప్పేశారు. దీనివల్ల ప్రాంతీయపార్టీల్లో ఒక రకమైన భయాందోళనలు నెలకొంటాయి. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఎంఐఎంతో చేతులు కలిపేందుకు ప్రాంతీయపక్షాలు ముందుకు రాక తప్పని రాజకీయ అనివార్యత ఏర్పడుతుంది. దీనికి వెంటనే పునాదులు ఏర్పడకపోయినా 2019లో స్వతంత్రంగా ఎంఐఎం పోటీ చేసి కొన్ని సీట్లను చేజిక్కించుకుని తన బలాన్ని ప్రదర్శించుకుంటుంది. తద్వారా మిగిలిన పార్టీలు ఎంఐఎంతో జోడీ కట్టాల్సిన అవసరాన్ని గుర్తిస్తాయి. ఈరకమైన దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లాలనేది కేసీఆర్ , అసదుద్దీన్ ల ఆలోచన. తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేని రాజకీయ ఆధిక్యం లభించిందనేది కేసీఆర్ స్థిరమైన భావన. ఇక్కడ ఇంకా సంక్షేమ పథకాలు పెరుగుతాయి. అందువల్ల ఓటర్లు మరో పదేళ్ల వరకూ టీఆర్ఎస్ కు విధేయంగానే ఉంటారనేది రాజకీయ వర్గాలు సైతం అంగీకరిస్తున్న వాస్తవం. తన పాత్రను తెలంగాణలో కుదించుకుని జాతీయ యవనికపై ద్రుష్టి పెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయిపోయారు. ముందుగా ప్రాంతీయ పార్టీలతో కూడిన కలయిక, నేషనల్ కన్సార్టియం అని చెబుతున్నప్పటికీ వ్యూహం భిన్నంగా ఉంది.

బీజేపీకీ బలమే.....

కాంగ్రెసు పార్టీ, భారతీయ జనతాపార్టీలకు ప్రత్యామ్నాయంగా ముస్లిం, మైనారిటీల సంఘటిత బలంతో ఒక శక్తి నిలిస్తే అది రాజకీయంగా టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇంతవరకూ వివిధ కారణాలతో కాంగ్రెసును మైనారిటీలు సపోర్టు చేస్తున్నారు. ఇప్పుడు తమకంటూ జాతీయ పార్టీ ఉంటే మైనారిటీలు అటువైపే మొగ్గు చూపుతారు. దీనిని సాకుగా చూపుతూ హిందూ ఓటర్లు సంఘటితం కావాల్సిన అవసరాన్ని బీజేపీ ప్రేరేపిస్తుంది. 30,40 సీట్లలో ముస్లిం పార్టీకి మేలు సమకూరినా, 300 స్థానాల్లో బీజేపీకి ఎడ్జ్ లభిస్తుంది. మధ్యలో కాంగ్రెసు మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల కేసీఆర్ ఆశించిన విధంగా ఫెడరల్ ఫ్రంట్ రూపంలో కేంద్రాన్ని శాసించే పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, ముస్లిం ఓట్లను దృష్టిలో పెట్టుకుని చేతులు కలిపితే మాత్రమే కేసీఆర్ కల ఫలిస్తుంది. అది ఇమ్మీడియట్ గా వర్కవుట్ కావడం కష్టమే. 2019 లో మాత్రం కాంగ్రెసు, బీజేపీల సారధ్యంలోని ఫ్రంట్ లే ప్రధానపోటీదారులుగా బరిలో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News