జగన్ ఇక ఆ ఆలోచన విరమించుకున్నట్లే

శాసనమండలి రద్దు ఇక లేనట్లే. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా ఇంతవరకూ దానిపై అతీ గతీ లేదు. మరోవైపు శాసనమండలిలో వైసీపీ సభ్యుల బలం [more]

Update: 2021-06-14 02:00 GMT

శాసనమండలి రద్దు ఇక లేనట్లే. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా ఇంతవరకూ దానిపై అతీ గతీ లేదు. మరోవైపు శాసనమండలిలో వైసీపీ సభ్యుల బలం పెరుగుతోంది. దీంతో ఇక శాసనమండలి రద్దు ప్రతిపాదనను వైసీపీ అటకెక్కించినట్లే నన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. వచ్చే నెల నాటికి శాసనమండలిలో వైసీపీ పూర్తి ఆధిక్యత రానుంది. శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులు కూడా వైసీపీకి దక్కనున్నాయి.

బిల్లులు తిరస్కరణలకు…

శాసనమండలిలో మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీకి బలం ఉండటంతో అనేక బిల్లులను తిరస్కరించారు. పెద్దల సభ తిరస్కరించడంతో అనేక విషయాల్లో ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి వచ్చింది. మూడు రాజధానుల బిల్లుకు కూడా పెద్దల సభలో అభ్యంతరం వ్యక్తమయింది. దీంతో జగన్ ఏకంగా శాసనసమండలిని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయితే రానున్న కాలంలో శాసనమండలిలో ఖాళీ అయ్యే స్థానాలన్నీ వైసీపీకే దక్కనున్నాయి.

టీడీపీ మెజారిటీ తగ్గనుండటంతో..?

శాసనమండలిలో టీడీపీ మెజారిటీ తగ్గిపోనుంది. దీంతో పెద్దల సభలో కూడా వైసీపీదే పై చేయికానుంది. ఇక ఏ బిల్లు శాసనమండలిలో ఆగే ప్రసక్తి ఉండదు. దీంతో పాటు అనేక మంది నేతలను శాసనమండలికి జగన్ పంపాల్సి ఉంది. పాదయాత్ర సమయంలో జగన్ అనేక మందికి హామీ ఇచ్చారు. బహిరంగ సభల్లోనే తాను ఎమ్మెల్సీ చేస్తానని గొట్టిపాటి భరత్ వంటి వారికి హామీ ఇచ్చారు. దీంతో పాటు అనేక మంది నేతలు పార్టీని నమ్ముకుని టిక్కెట్లు ఇవ్వకపోయినా గత ఎన్నికల్లో పనిచేశారు.

నేతలకు అవకాశం…?

వీరందరికీ శాసనమండలిలో స్థానం కల్పించాల్సి ఉంది. అందుకే ఇక శాసనమండలి రద్దు ప్రతిపాదనను జగన్ పక్కన పెట్టినట్లేనని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవు. అనేక రాష్ట్రాల నుంచి శాసనమండలిలపై ప్రతిపాదనలు ఉండటంతో వాటిని పెండింగ్ లో పెట్టారు. ఇక జగన్ కు శాసనమండలి బాధ తప్పిపోయింది. భవిష్యత్ లో ఖాళీ అయ్యే పోస్టులన్నీ దాదాపు టీడీపీవే. వాటన్నింటినీ వైసీపీ కైవసం చేసుకోనుంది. మొత్తం మీద జగన్ శాసనమండలి రద్దు ప్రతిపాదనను ఇక పక్కన పెట్టినట్లేనని తెలుస్తోంది.

Tags:    

Similar News