ఇందులోనూ రాజకీయమేనా?

రాజకీయం తమకు అనువైన చోట ఒకలా, కాని చోట మరోలా ఉంటుంది. ఢిల్లీయే ఇందుకు ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులు ఇచ్చిన [more]

Update: 2020-05-08 17:30 GMT

రాజకీయం తమకు అనువైన చోట ఒకలా, కాని చోట మరోలా ఉంటుంది. ఢిల్లీయే ఇందుకు ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రెడ్ జోన్లు మినహాయించి మిగిలిన ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో అన్ని రకాల వ్యాపార కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సయితం ఢిల్లీలో లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చారు. కంటెయిన్ మెంట్ జోన్ లలో తప్ప మిగిలిన చోట్ల లిక్కర్ షాపులతో సహా అన్ని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

లాక్ డౌన్ మినహాయింపులపై….

కరోనా వైరస్ తో కలసి జీవించేందుకు సిద్ధంగా ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కరోనా ఇప్పట్లో ఆగేది కాదని, లాక్ డౌన్ ను కొనసాగిస్తే ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటామని అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం ఒక్క ఢీల్లీ సీఎందే కాదు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు సయితం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరును కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించినా అక్కడి ప్రభుత్వం మాత్రం బెంగుళూరు రెడ్ జోన్ కాదని తీర్మానం చేసింది. లిక్కర్ షాపులను ఓపెన్ చేసింది.

కార్యక్రమాలు ప్రారంభం కావడంతో…

అయితే ఢిల్లీలో బీజేపీ నేతలు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ చర్యలను తప్పుపడుతుండటం విశేషం. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో ప్రయివేటు వాహనాలనుకూడా అనుమతించారు. కార్లలో డ్రైవర్ తో కలసి ముగ్గురిని అనుమతిస్తున్నారు. ప్రయివేటు కార్యాలయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ కామర్స్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఈ చర్యలను బీజేపీ నేతలు తప్పపుడుతున్నారు.

అది తప్పు అంటున్న…..

ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదువేలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి హర్షవర్థన్ మాత్రం కేజ్రీవాల్ చర్యలను ఖండిస్తున్నారు. ఢిల్లీలో లాక్ డౌన్ ను కఠినంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. స్వల్ప మినహాయింపులే ఇవ్వాలని సూచించారు. లేకుంటే ఢిల్లీలో కరోనా మహమ్మారి వ్యాప్తి మరింత ఉధృతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ పాలిత ప్రాంతాలైన మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లలో కూడా కరోనా ఎక్కువగా ఉందని, అక్కడ సడలింపుల విషయం కూడా ఆయన మాట్లాడితే బాగుంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద సడలింపులనూ ఎవరికి వారు తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ బంపర్ మెజారిటీతో మరోసారి గెలిచిన విషయాన్ని విస్మరించి మరీ బీజేపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు.

Tags:    

Similar News