మోదీ తర్వాత నెంబర్ 2 ఆయనే....!

Update: 2018-10-14 16:30 GMT

అరుణ్ జైట్లీ... పూర్వాశ్రమంలో ప్రముఖ న్యాయవాది. ప్రస్తుతం ప్రముఖ రాజకీయ నాయకుడు. స్వతహాగా మితభాషి. విషయాన్ని సరళంగా, స్పష్టంగా, సూటిగా చెప్పడం, వివిధ కోణాల్లో విశ్లేషించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అదే సమయంలో కీలక అంశాలపై న్యాయస్థానాల్లో సమర్థంగా, ధీటుగా వాదనలను విన్పించడంలో దిట్ట. పెద్దగా ప్రజాబలం లేనప్పటికీ ఈ ప్రత్యేక లక్షణాలే ఆయనను ప్రముఖ రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దాయి. ఈ లక్షణాలే ఆయనను వివేకవంతుడిగా తీర్చి దిద్దాయి.

విద్యార్థి దశనుంచే.....

1952 డిసెంబరు 8న సంప్రదాయ కుటుంబంలో జైట్లీ జన్మించారు. విద్యాభ్యాసం అంతా రాజధాని ఢిల్లీ నగరంలోనే జరిగింది. 1973లో ప్రతిష్టాత్మక ఢిల్లీ శ్రీరామ్ కాలేజీలో బీకామ్, 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. న్యాయశాస్త్రం చదువుతుండగానే బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడిగాపనిచేశారు. ఇందిరా గాంధఈ ఎమెర్జెన్సీ విధించిన సమయంలో 19 నెలలు జైలు జీవితం గడిపారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పనిచేశారు. అనంతరం జన్ సంఘ్ లో చేరారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. బీజేపీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేశారు. తన పనితీరుతో పెద్దల దృష్టిలో పడ్డారు.

న్యాయవాది వృత్తిలో....

బీజేపీలో ఉంటూనే న్యాయవాదిగా పేరుతెచ్చుకున్నారు. 1987 నుంచి వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టులో కీలక మైన కేసులను వాదించి న్యాయనిపుణిడిగా గుర్తింపు పొందారు. 1990లో ఢిల్లీ హైకోర్టు ఆయనకు సీనియర్ న్యాయవాది హోదాను కల్పించింది. 1989లో నాటి ప్రధాని విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ఆయనను అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా నియమించారు. న్యాయవాదిగా బోఫోర్స్ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. శరద్ యాదవ్, దివంగత మాధవరావు సింధియా, ఎల్.కె. అద్వానీ వంటి ప్రముఖులు ఆయన క్లయింట్స్. జైట్లీ సమర్థతను గుర్తించిన వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన కక్షిదారులుగా ఉన్నారు. కోకోకోలా, పెప్సీ కోలా వంటి బహుళజాతి సంస్థలు తరుపున హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదించారు. కీలకమైన రాజ్యాంగ పరమైన కేసులను వాదించి ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.

పార్టీ వ్యవహారాల్లో.....

1990 నుంచి పార్టీ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. 1991లో పార్టీ కార్యనిర్వాహక సభ్యుడిగా, 1998లో పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసి పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. 1999లో అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రివర్గంలో వివిధ శాఖలను నిర్వహించారు. సమాచార, ప్రసార, పెట్టుబడుల ఉపసంహరణ, న్యాయ, కంపెనీ వ్యవహారాల మంత్రిగా పనిచేసి ఆయా శాఖలకు వన్నె తెచ్చారు. వాటిల్లో సంస్కరణలను ప్రారంభించారు. పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖను సృష్టించడం అదే మొదటి సారి. 2000 నవంబరు లో కేబెనెట్ మంత్రిగా పదోన్నతి పొందారు. 2004లో లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టారు. మళ్లీ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. 2009 జూన్ 16న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో.....

విద్యార్థి సంఘ రాజకీయాల్లో, పార్టీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ జైట్లీ ప్రత్యక్ష ఎన్నికలలో ఎన్నడూ పోటీ చేయలేదు. 2014 లోక్ సభ ఎన్నికల్లో అమృత్ సర్ సిట్టింగ్ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్దూను తప్పించి పార్టీ జైట్లీకి టిక్కెట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా మోదీ గాలి వీచినప్పటికీ జైట్లీ ఓడిపోవడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ జైట్లీనీ ఓడించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ జైట్లీ నిబద్ధత, సమర్థతను గుర్తించిన మోదీ ఆయనకు పెద్ద పీట వేశారు. కేంద్రంలో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను కట్టబెట్టారు. కొంతకాలం రక్షణశాఖ బాధ్యతలను కూడా నిర్వహించారు.

పాలన పరమైన వ్యవహారాలను.....

ప్రభుత్వంలో మోదీ తర్వాత కీలక వ్యవహారాలను చక్కబెట్టేది జైట్లీనే. ప్రస్తుత మంత్రివర్గంలో విషయ పరిజ్ఞానం, దీటైన వాదనా పటిమ గల నాయకులు లేరు. పాలన అనుభవం గల వారు కూడా పెద్దగా లేరు. ప్రధాని మోదీ పాలన వ్యవహారాల బాధ్యతను పూర్తిగా ఆయనకే అప్పగించారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి అమిత్ షా పైన, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి జైట్లీ పైన మోదీ ఆధారపడుతున్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాలు జైట్లీ హయాంలోనే తీసుకున్నారు. ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం తొలుత కొంత వ్యతిరేకతను ప్రజల నుంచి ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం కొంత సద్దుమణిగింది. జైట్లీ చాకచక్యమే ఇందుకు కారణమని చెప్పడం అతిశయోక్తి కాదు. జమ్మూకాశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి గిర్ ధారి లాల్ డోగ్రా కూతురు సంగీతతో జీవితాన్ని పంచుకున్న జైట్లీకి ఇద్దరు పిల్లలు. రోహన్, సోనాలి ఇద్దరూ తండ్రిలా న్యాయవాదులే. 2019 ఎన్నికల అనంతరం కూడా జైట్లీ స్థానానికి, పలుకుబడికి ఢోకా లేనట్లే. ..!

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News