వైసీపీ ఎమ్మెల్యేకు ఇవే చివరి ఎన్నికలట

క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ఒక్కసారిగా నిర్వేదం వ్యక్తం చేశారు. తాను ఇక వ‌చ్చే ఎన్నికల్లో పోటీకి దిగేది లేద‌ని, త‌న‌కు ఓట్లు వేయించ‌మ‌ని కోరుతూ.. [more]

Update: 2020-01-09 14:30 GMT

క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ఒక్కసారిగా నిర్వేదం వ్యక్తం చేశారు. తాను ఇక వ‌చ్చే ఎన్నికల్లో పోటీకి దిగేది లేద‌ని, త‌న‌కు ఓట్లు వేయించ‌మ‌ని కోరుతూ.. ఏ కార్యకర్తను కూడా ప్రాధేయప‌డ‌బోన‌ని ఆయన వెల్లడించారు. ఈ ప‌రిణామం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. యువ‌కుడు, ఉత్సాహవంతుడు అనే ఉద్దేశంతో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆర్థర్‌కు ఇక్కడ టికెట్ కేటాయించారు. ఆయ‌న గెలుపున‌కు స్థానిక కార్యక‌ర్తలు ఎంతో కృషి చేశారు.

ఆయన ప్రమేయం లేకుండానే….

ఈ క్రమంలోనే ఆర్థర్ ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి విజ‌యం సాధించారు. అయితే, ప‌ట్టుమ‌ని ఆయ‌న గెలిచి ఏడు మాసాలే పూర్తయ్యాయి. అయితే, ఇంత‌లోనే.. ఒక్కసారిగా నిరాశ‌, నిర్వేదం ఆయ‌న‌లో తొంగిచూడ‌డం ఆశ్చర్యంగా అనిపిస్తోంద‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఆర్థర్ గెలిచినా.. ఆయ‌న ప్రమేయం లేకుండా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు జరుగుతున్న మాట వాస్తవం. ఆయ‌నకు ఎక్కడా త‌గిన ప్రాధాన్యం కూడా ల‌భించ‌డం లేదు. ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డ‌మూ లేదు.

సిద్దార్థరెడ్డితో పడక….

దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీపైనా.. కార్యక‌ర్తలపైనా కూడా గ్రిప్ సాధించ‌లేక పోతున్నారు. ఇదిలావుంటే, వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంచార్జ్‌గా సిద్దార్థ రెడ్డికి ప‌గ్గాలు అప్పగించారు. వాస్తవానికి ఎక్కడైనా ఎమ్మెల్యేనే ఇన్‌చార్జ్ గా ఉంటారు. కానీ ఇక్కడ సిద్దార్థరెడ్డిని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. ఏపీలో ఏ నియోజ‌క‌వర్గంలోనూ ఈ ప‌రిస్థితి లేదు. సిద్దార్థ్ రెడ్డి రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి రావ‌డంతో ఆయ‌న త‌న బ‌లమైన వాగ్దాటితో అంద‌రిని ఆక‌ట్టుకుని నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా జిల్లా రాజ‌కీయాల్లోనూ దూసుకుపోతున్నాడు.

అసంతృప్తి పెరిగిపోయి…

నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో సిద్ధార్థ రెడ్డి దూకుడు పెంచారు. అన్ని విష‌యాల్లోనూ ఆయ‌న‌దే పైచేయిగా ఉంది. ఈ విష‌యంలో ఎమ్మెల్యే ఆర్థర్, ఇంచార్జ్‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు జ‌రుగుతోంది. అధికారుల నుంచి కింది స్థాయి కార్యక‌ర్తల వ‌ర‌కు కూడా సిద్ధార్థ చెప్పిందే వేదంగా క‌నిపిస్తోంది. దీంతో ఆర్థర్ తీవ్రస్థాయిలో అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా వ్యవ‌హారాల మంత్రికి కూడా విష‌యాన్ని చెప్పిన‌ట్టు స‌మాచారం. అయినా జగ‌న్ లైట్ తీస్కోవ‌డంతో ఆర్థర్‌లో అసంతృప్తి ర‌గులుతోంది.

చెప్పకుండా నియోజకవర్గంలో….

చివ‌ర‌కు సిద్దార్థ్‌కు చెప్పకుండా ఆర్థర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించే ప‌రిస్థితి కూడా లేద‌ని టాక్‌. ఒక వేళ ప‌ర్యటించినా స్థానిక కేడ‌ర్ నుంచి తీవ్రమైన వ్యతిరేక‌త వ్యక్తమ‌వుతోంది. దీంతో ఆయ‌న ఇక‌, తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసిది లేద‌ని, మిమ్మల్ని ఓట్లు వేయ‌మ‌ని, వేయించ‌ని కోరేది కూడా లేద‌ని ఆయ‌న ఇటీవ‌ల ఓ స‌భ‌లో త‌న ఆవేద‌న‌ను వెళ్లగ‌క్కడంతో స్టేట్‌లోనే ఇప్పుడు ఈ విష‌య‌మే హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News