జత కట్టే ఆలోచనలోనేనా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ఆయన పార్టీని సమాయత్తం చేస్తున్నారు. అయితే బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీని [more]

Update: 2019-12-28 17:30 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ఆయన పార్టీని సమాయత్తం చేస్తున్నారు. అయితే బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీని ఢీకొట్టాలంటే ఒంటరిపోరుతో సాధ్యమవుతుందా? అన్న ప్రశ్న పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. గత లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈ మేరకు సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఢిల్లీలో ఇప్పటికీ కాంగ్రెస్ బలంగా ఉంది. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలని పార్టీలోని సీనియర్ నేతల నుంచి అరవింద్ కేజ్రీవాల్ పై వత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది.

సఖ్యత లేకపోయినా…..

కాంగ్రెస్ తో కూడా అరవింద్ కేజ్రీవాల్ కు సఖ్యత లేదు. గత లోక్ సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదనలను అరవింద్ కేజ్రీవాల్ సయితం స్వాగతించారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ పెట్టిన షరతులకు కాంగ్రెస్ తలొగ్గలేదని అంటారు. ఢిల్లీలో ఏడు పార్లమెంటు స్థానాలకు గాను ఐదు స్థానాలు, పంజాబ్, హర్యానాల్లోనూ ఎక్కువ స్థానాలను అరవింద్ కేజ్రీవాల్ కోరుకోవడంతో అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం వెనక్కు తగ్గింది.

మూడో స్థానంలో నిలిచి….

దీంతో లోక్ సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఒక లోక్ సభ స్థానంలో గెలిచినా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. పైగా లోక్ సభ ఎన్నికల ఫలితాలను చూస్తే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉందనడానికి ఇది మచ్చు తునక. పైగా ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడం, మధ్య తరగతి, పేద ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో చతికలపడింది.

పొత్తుకు రెడీ అవుతారా?

మళ్లీ ఇదే తప్పు జరగకూడదని ఆమ్ ఆద్మీ పార్టీలోని సీనియర్ నేతలు గట్టిగా కేజ్రీవాల్ కు చెబుతున్నారు. గతంలో ఆప్ తో పొత్తును షీలా దీక్షిత్ గట్టిగా వ్యతిరేకించారు. షీలా దీక్షిత్ మరణించడంతో కాంగ్రెస్ కు ఢిల్లీలో ఓటు బ్యాంకు ఉన్నా సమర్థుడైన నాయకుడు లేరు. దీన్ని సాకుగా చూసుకుని తిరిగి కాంగ్రెస్ తో పొత్తుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నించే అవకాశముందంటున్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేస్తే అరవింద్ కేజ్రీవాల్ కు ఓటమి తప్పదని కూడా సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. మరి కేజ్రీవాల్ పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News