ఆయనేనా అరకు టీడీపీ ఎంపీ అభ్యర్ధి..!

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో పట్టున్నా ఏజెన్సీలో మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు. అక్కడ అయితే కాంగ్రెస్.. లేకపోతే వామపక్షాలు గెలుస్తూ వస్తున్నాయి. మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఏజెన్సీలో [more]

Update: 2019-02-07 01:30 GMT

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో పట్టున్నా ఏజెన్సీలో మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు. అక్కడ అయితే కాంగ్రెస్.. లేకపోతే వామపక్షాలు గెలుస్తూ వస్తున్నాయి. మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఏజెన్సీలో టీడీపీ గెలిచింది చాలా తక్కువ సార్లు. దానికి కారణం ఆ పార్టీకి గట్టి నాయకులు లేకపోవడం. అధికారంలో ఉన్నా నేతలు అక్కడికి వెళ్లకపోవడం. గిరిజన వ్యతిరేక విధానాలు ఆ పార్టీ అమలు చేస్తుందని గిరిజనులు గట్టిగా నమ్మడం. ఈ కారణాలతోనే టీడీపీ ఎక్కువ సార్లు ఓడిపొతూ వస్తోంది. 2014 ఎన్నికల్లోనూ అదే జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ఏజెన్సీని మొత్తం గెలుచుకుని సైకిల్ పార్టీకి గాలి తీసేసింది. దీంతో పోయిన చోట వెతుక్కోవాలని టీడీపీ డిసైడ్ అయ్యింది. దానిని తగినట్లుగానే అటు వైసీపీ, ఇటు కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి నేతలను ఎంచి మరీ సైకిలెక్కించేస్తున్నారు.

వైరిచర్ల వెళ్తున్నారా

వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ గిరిజన వర్గానికి చెందిన రాజ వంశస్థులు. వారికి తరతరాలుగా సంస్థానాలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రజాస్వామ్య యుగంలోనూ వారి హవా ఓ లెక్కలో సాగుతూ వచ్చింది. పూసపాటి రాజుల మదిరిగానే వారు కూడా గిరిజనులకు దేవుళ్లు. ఆ అభిమానంతోనే వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ని ఇప్పటికి అనేక మార్లు గిరిజనులు పార్లమెంట్ సభ్యునిగా గెలిపిస్తూ వచ్చారు. గిరిజనుల ఓట్లతో నెగ్గిన ఆయన కేంద్రమంత్రి పదవులతో పాటు డిల్లీ స్థాయిలో బాగానే పలుకుబడి సాధించారు. కాంగ్రెస్ పార్టీకి తలలో నాలుకగా ఉంటూ ఆ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరుగా మెలుగుతూ వచ్చారు. అటువంటి రాజు గారు ఏపీ విభజన తరువాత పత్తా లేకుండా పోయారు. ఆ మధ్య కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు అన్న ప్రచారంతో మరోమారు వెలుగులోకి వచ్చారు. ఆ పొత్తు కుదిరితే కాంగ్రెస్ తరపున అరకు ఎంపీగా పోటీ చేసి గెలవాలని ఆశించారు. అయితే పొత్తులు లేవని తేలిపోవడంతో రాజావారు సైతం హస్తం పార్టీకి దూరం కావాల్సి వచ్చింది.

టీడీపీ గేలం

ఆయన్ని టీడీపీలో చేర్పించడానికి చాలా కాలం క్రితమే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని రాజు గారు భావించి అందులో కొనసాగారు. చివరికి మళ్లీ ఉత్త చేతులతోనే ఎన్నికలకు వెళ్లమంటూంటే మరో మారు డిపాజిట్ పోగోట్టుకోవడానికి సిధ్ధంగా లేమని ఆయన అనుచరులు చెబుతున్నారు. దానికి తోడు టీడీపీ నుంచి ఆఫర్ కూడా ఉండడంతో మరో మాటకు తావు లేకుండా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు. రేపోమాపో రాజు గారు సైకిల్ ఎక్కుతారని, అరకు ఎంపీ క్యాండిడేట్ ఆయనేనని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అక్కడ వైసీపీకి బాగా ఆదరణ ఉంది. ఆ పరిస్థితుల్లో రాజుగారు ఎంతవరకు నెగ్గుకురాగలరన్నది చర్చగా ఉంది. ఇక వైరిచర్లను గిరిజనం మరచిపోయి చాలాకాలమే అయిందంటున్నారు. ఓ విధంగా ఆయన ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని అంటున్నారు. ఎన్నికల ముందు మాత్రమే ఒకసారి వచ్చి కనిపించి ఓట్లు తీసుకుని వెళ్లే రాజు గారి వైఖరి పట్ల ఇప్పుడు గిరిజనులు అగ్రహంగా ఉన్నారు. దానికి తోడు ఆయన టీడీపీ నుంచి పోటీకి దిగితే రెట్టించిన ఆగ్రహంతో తిప్పికొడాతారేమోనన్న చర్చ నడుస్తోంది. మరి ఆయన్ని మించి అభ్యర్ధి లేరని టీడీపీ భావిస్తుంటే ఆయనకు మద్దతు ఇచ్చేందుకు స్థానికి టీడీపీ నాయకులు కూడా సిధ్ధంగా లేకపోవడం గమనార్హం.

Tags:    

Similar News