గౌతు ఫ్యామిలీకి రాజకీయ సమాధే ?

గౌతు లచ్చన్న పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వినని వారు ఉండరు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. సర్దార్ అని బ్రిటిష్ వారి చేత బిరుదు అందుకున్నవాడు. తరువాత [more]

Update: 2020-08-01 08:00 GMT

గౌతు లచ్చన్న పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వినని వారు ఉండరు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. సర్దార్ అని బ్రిటిష్ వారి చేత బిరుదు అందుకున్నవాడు. తరువాత కాలంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నేత. బీసీల కోసం పాటుపడిన నాయకుడు. అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన మేటి రాజకీయ శిఖరం. ఆయన వారసుడిగా గౌతు శ్యామ సుందర శివాజీ టీడీపీ ద్వారా రంగప్రవేశం చేశారు. ఆయన అనేకసార్లు సోంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత పలాసకు మారి అక్కడా గెలిచారు. ఇక తాను రాజకీయంగా తప్పుకుని వారసురాలుగా కుమార్తె గౌతు శిరీషను రంగంలోకి దింపారు. నిజానికి 2014 నుంచి 2019 వరకూ పేరుకే ఆయన ఎమ్మెల్యే కానీ కుమార్తె. అల్లుడిదే పలాసలో రాజ్యంగా చెప్పాలి.

సునాయాసమ‌నుకుంటే ..?

గౌతు ఫ్యామిలీకి 2019 ఎన్నికల్లో గెలుపు సునాయాసమని భావించారు. దానికి కారణం రాజకీయంగా ఏ మాత్రం అనుభవం లేని ఒక వైద్యుడిని వైసీపీ పోటీకి పెట్టింది. ఆయనకు ముందున్న వారంతా రాజకీయంగా తలపండినవారు. వారిని పక్కకు నెట్టి జగన్ కొత్త ప్రయోగం చేశారు. అది కూడా ఎన్నికలకు ఏడాది ముందు చేరిన వైద్యుడు సీదరి అప్పలరాజుకి టికెట్ ఇవ్వడంతో మిగిలిన బడా వైసీపీ నేతలు ముందే టీడీపీలోకి జంప్ అయ్యారు. అయినా సరే వైద్యునిగా పదేళ్ళ సేవ, తన మంచితనాన్ని, నాయకత్వ లక్షణాలను చూపించి గౌతు ఫ్యామిలీకి గట్టి దెబ్బ కొట్టారు సీదరి. ఆయన ఏకంగా పదహారు వేల భారీ మెజారిటీని సాధించారు అంటే ఆ దిగ్గజ కుటుంబానికి గట్టి షాకేనని చెప్పాలి.

దున్నేస్తారా….?

ఇపుడు అనూహ్యంగా సీదరిని పిలిచి మరీ మంత్రిగా జగన్ పెద్ద పీట వేశారు. సీదరి సైతం దూసుకుపోయే మనస్తత్వం కలిగిన వారు. కరోనా సమయంలోనూ ఆయన జనంలోనే ఉంటూ ఎంతో సేవ చేశారు. ఇపుడు ఆయనకు కీలకమైన శాఖలు లభించాయి. ఆయన వాటితోనే దున్నేస్తారని అంటున్నారు. ఏదో చేయాలన్న తపన, పట్టుదల కలిగిన డాక్టర్ ఇకపైన ప్రజా వైద్యుడిగా మారుతారని, తనదైన ముద్ర వేసుకుంటారని అపుడే విశ్లేషిస్తున్నారు. ఇక సిక్కోలులో చివరి ప్రాంతాలకు ఎపుడూ మంత్రి పదవి రాలేదు, పైగా ఉత్తరాంధ్రా జిల్లాల్లోని మత్యకారులకు మంత్రి కిరీటం పెట్టలేదు. దాంతో పెద్ద సంఖ్యలో ఉన్న ఆ సామాజిక వర్గమంతా వైసీపీకి అండగా ఉండడం ఖాయమని చెబుతున్నారు. అది సీదరికి సామాజికంగా కలసివచ్చే అవకాశం అంటున్నారు.

అదే టార్గెట్…..

ఇక శ్రీకాకుళం జిల్లాకు భావనపాడు పోర్ట్ ఇపుడు మంత్రి సీదరి అప్పలరాజు టేకప్ చేస్తారని అంటున్నారు. గత టీడీపీ సర్కార్ ఈ విషయంలో మంత్రివర్గ సమావేశంలో ఆమోదించింది కూడా. బీఓటీ పద్దతిలో ఆదానీ గ్రూపులకు దీని ఇవ్వాలని నాడు అనుకున్నారు. జగన్ సర్కార్ మరి ఈ విషయంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటోంది. జగన్ సైతం భావన‌పాడు పోర్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు రెండు వేల ఎకరాల భూమిని సేక‌రించాల్సిన ఈ ప్రాంతంలో నిర్వాసితులకు నష్ట పరిహారం న్యాయంగా చూడాలన్న డిమాండ్ ఉంది. మంత్రి స్థానికుడు కావడంతో చాలా వేగంగా భావనపాడు పోర్టు విషయంలో అడుగులు పడతాయని అంటున్నారు. తన చేతిలో నాలుగేళ్ల అధికారం ఉందని, అందువల్ల భావ‌నపాడు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని సీదరి ఇప్పటికే చెబుతున్నారు. భావనపాడు ప్రాజెక్ట్ ని మంత్రిగా సీదరి ప్రారంభిస్తే మాత్రం ఆయనకు మరిన్ని టెర్ములు ఎమ్మెల్యేగా గెలిచేందుకు బలమైన రాజకీయ పునాది పలాసలో ప‌డుతుంది. అదే జరిగితే రాజకీయంగా గౌతు కుటుంబానికి సమాధేనని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News