వీరి ఆలోచనలో మార్పు మంచిదేనా ?

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్రసమితుల ఆత్మీయ రాజకీయ అనుబంధం ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి దోహదపడినప్పుడే సార్థకత. పొలిటికల్ కెమిస్ట్రీ పక్కాగా కుదిరింది. ఇక సాంకేతిక [more]

Update: 2019-06-22 14:30 GMT

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్రసమితుల ఆత్మీయ రాజకీయ అనుబంధం ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి దోహదపడినప్పుడే సార్థకత. పొలిటికల్ కెమిస్ట్రీ పక్కాగా కుదిరింది. ఇక సాంకేతిక సమస్యలు పరిష్కారం కావడం పెద్ద పనేం కాదు. గడచిన అయిదేళ్లు కాల వ్యవధి వేరు. ఉమ్మడి రాష్ట్రంగా అరవయ్యేళ్లపాటు కలిసి నడిచిన తర్వాత విడిపోయి మళ్లీ సాఫీగా సాగిపోవాలంటే అంత ఈజీ కాదు. అనుబంధాల నుంచి పుట్టిన ఆవేశకావేశాలు మొదలు ఆస్తిపాస్తుల పంపకాల వరకూ అనేక సమస్యలు. అవే సెంటిమెంట్లుగా రూపుదాలుస్తుంటాయి. అందులోనూ అధికార సాధనకు, పరిరక్షణకు రాజకీయ పార్టీలకు అదే సెంటిమెంటు ఆధారభూతమైతే మరింత చిక్కులు ఏర్పడతాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు అదే సమస్య ఎదురైంది. పోరాడి సాధించుకున్న రాష్ట్రానికి రక్షణ దారు పాత్రలోకి మారింది టీఆర్ఎస్. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధి సెంటిమెంటును జోడించింది తెలుగుదేశం. పరస్పర అధికార ప్రయోజనాలు భిన్నమైనవి కావడంతో ప్రతి విషయమూ రాజకీయ రంగు పులుముకుంది. ఎడతెగని చిక్కుముడిగా మారింది. పరస్పర అభద్రత, కేసులు, అనుమానాస్పద దృక్పథాలతో ఆశించిన రీతిలో అడుగు ముందుకు పడలేదు. ఆస్తుల విభజన మొదలు, నదీజలాల సద్వినియోగం వరకూ అన్నిటా పేచీలే. ఎవరు తగ్గితే ఎక్కడ రాజకీయ నష్టం వాటిల్లుతోందనే భయంతో తెలుగు రాష్ట్రాల్లోని అధికారపార్టీలు రెండూ నిప్పులు ఎగదోస్తూనే ఉన్నాయి. వేడి తగ్గకుండా చూసుకున్నాయి. ఫలితంగా పెండింగు సమస్యలు పేరుకుపోయాయి.

నువ్వాదరి..నేనీ దరి…

కృష్ణాగోదావరి నదులు రెండు రాష్ట్రాలకు జీవనాడులు. కృష్ణానది జలాల వినియోగంపై పొరుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య కూడా విభేదాలున్నాయి. ట్రిబ్యునళ్లలోనూ, న్యాయస్థానాల్లోనూ కేసులూ నడుస్తున్నాయి. నీటి వినియోగానికి సంబంధించి విడుదలపైనా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు సైతం తలెత్తాయి. అసలే అంతంతమాత్రంగా ఉండే కృష్ణానీటిపై వివాదాలకు వెంటనే తెరపడే పరిస్థితి లేదు. రాజకీయంగా సౌమరస్యపూర్వకమైన పరిస్థితులు ఉంటే కొంతమేరకు సర్దుబాటుకు మాత్రమే స్కోప్ ఉంది. గోదావరి జలాల వినియోగానికి మాత్రం రెండు రాష్ట్రాలకు అవకాశాలెక్కువ. అయినప్పటికీ దానికీ రాజకీయాలు అడ్డుపడుతుంటాయి. కాళేశ్వరం నిర్మాణం మొదలై పూర్తయితే ఏపీలో గోదావరి డెల్టా ఎడారిగా మారిపోతుందనే వాదన ఉంది. పోలవరం సైతం పూర్తి చేసి సిద్ధంగా ఉంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండేందుకు అవసరమైనంత జలసిరి గోదావరిలో ఉంది. ఏటా 3వేల టీఎంసీల వరకూ నీరు సముద్రం పాలవుతోందని అంచనా. కాళేశ్వరం, పోలవరం రెండూ పూర్తి చేసుకుని నీటి నిల్వలు చేసుకున్నప్పటికీ ఏటా వెయ్యి టీఎంసీలు వాడుకోవడమే గగనం. కానీ రాజకీయాల కారణంగా రెండు రాష్ట్రాలను రెచ్చగొట్టే రాజకీయాలకు కొదవ ఉండదు. నిర్మాణ పనుల్లో పోటీ ఉండాలే తప్ప ఎదుటి రాష్ట్రాన్ని చూసి అసూయపడటం వల్ల ప్రయోజనం శూన్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు రెండూ ఈరకమైన రాజకీయ వివాదంతో అయిదేళ్లు గడిపాయి. పోలవరం నిర్మాణానికి అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ తరఫున న్యాయస్థానంలో వ్యాజ్యం సైతం దాఖలైంది. ఈ సమస్య సామరస్యంగా పరిష్కరించుకునే వెసులుబాటు ఇప్పుడు ఏర్పడింది.

తొమ్మిది..పది…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఉన్న హైదరాబాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక విద్యాసంస్థలు, శిక్షణ కేంద్రాలు, వృత్తిపరమైన సంస్థలను ప్రభుత్వం నెలకొల్పింది. అవన్నీ రాష్ట్ర అవసరాలకోసం ఏర్పాటైనవి. అలాగే ప్రభుత్వ రంగ కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేశారు. వీటికి భారీగా ఆస్తులున్నాయి. ఉమ్మడి ఆదాయంతో ఏర్పాటైన సంస్థలు కాబట్టి వీటికి సంబంధించిన పంపకాలను పూర్తి చేసుకోవాలి. జిల్లాల్లో ఉన్న సంస్థలకు సంబంధించి ఆ రాష్ట్రానికే చెందేలా నిర్ణయం తీసుకున్నప్పటికీ రాజధాని లోని ఆస్తుల పేచీ పీటముడి వీడలేదు. తొమ్మిదో షెడ్యూల్ లో 89 వరకూ ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. పదో షెడ్యూల్ లో విద్యా,శిక్షణ, వ్రుత్తిపరమైన సంస్థలు 107 వరకూ ఉన్నాయి. వీటికి సంబంధించి 75 వేల కోట్ల రూపాయల వరకూ విభజిత ఆంధ్రప్రదేశ్ కు వస్తుందని ఏపీ వాదిస్తోంది. 20 నుంచి 25వేల కోట్ల మేరకే ఉంటుందనేది తెలంగాణ వాదన. నిజానికి ఈ వివాదం మధ్యేమార్గంగా కేంద్రం మధ్యవర్తిత్వంతో ముగించుకోవచ్చు. కానీ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయనే సాకుతో ఇంతకాలం ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు సాగదీశాయి. ఇప్పటికైనా కొలిక్కి వస్తే ఉభయరాష్ట్రాలకు సంబంధించి ఆస్తుల గొడవకు అక్కడితో ఫుల్ స్టాప్ పడుతుంది. పైపెచ్చు వీటి ద్వారా ఎంతోకొంత మొత్తం లభిస్తే ఏపీలో కొత్త సంస్థలు తెరిచేందుకు వీలవుతుంది.

ఆస్తులు..అప్పులు…

తొలి నుంచి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదన ఒకటే. ఆదాయం హైదరాబాదు రూపంలో తెలంగాణకు దఖలు పడిందని నిరంతరం పేర్కొంటోంది. 58శాతం జనాభాకు 47 శాతమే ఆదాయం దక్కింది. అదే 42 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 53శాతం ఆదాయం వచ్చిందంటూ ఏపీ ఆవేదన వెలిగక్కుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వివిధ అవసరాల నిమిత్తం చేసిన అప్పులను మాత్రం జనాభా నిష్పత్తి ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి 58శాతం, తెలంగాణకు 42శాతం చొప్పున పంచారు. ఈ వాదన సాంకేతికమైనది. కానీ అప్పు చేసి తెచ్చిన నిధులు ఏప్రాంతంలో ఎంతమొత్తం ఖర్చు పెట్టారనేది తేల్చలేరు. కాబట్టి జనాభాయే ప్రామాణికం. మరోవైపు విద్యుత్తుసంస్థలకు సంబంధించిన బకాయిల పేచీ నడుస్తోంది. కనీసం అయిదువేల కోట్ల రూపాయలు తెలంగాణ విద్యుత్తు సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాలనేది ఒక లెక్క. అదేం లేదంటూ తోసిపుచ్చుతున్నారు తెలంగాణ అధికారులు. ఇంతకాలం ఉప్పునిప్పుగా టీఆర్ఎస్, టీడీపీ ప్రభుత్వాలు వ్యవహరించాయి. దాంతో అసలు నిజమేమిటన్న సంగతి ప్రజలకు తెలియలేదు. రెండు వైపులా సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నమే జరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీలు చాలా ఆత్మీయంగా వ్యవహరిస్తున్నాయి. నిజానికి ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సంబంధాలకు అతీతమైన ఆత్మీయత నెలకొంది. ఈ పొలిటికల్ కెమిస్ట్రీ పచ్చగా ఉన్పప్పుడే మొత్తం సమస్యలను పరిష్కరించుకుంటే ఏపీ, తెలంగాణలు శాశ్వతంగా స్నేహసంబంధాలను కొనసాగించేందుకు వీలవుతుంది.

Tags:    

Similar News