నోరు లేని విగ్రహాలే… మింగేస్తాయా?

ఏపీలో కొత్త రకం రాజకీయం సాగుతోంది. దేవుళ్ళ పేరు మీద పాలిటిక్స్ రంజుగా చేస్తున్నారు. గత 19 నెలలుగా ఇది జరుగుతోంది. ఏపీని ఎందరో సీఎంలు పాలించారు. [more]

Update: 2021-01-10 14:30 GMT

ఏపీలో కొత్త రకం రాజకీయం సాగుతోంది. దేవుళ్ళ పేరు మీద పాలిటిక్స్ రంజుగా చేస్తున్నారు. గత 19 నెలలుగా ఇది జరుగుతోంది. ఏపీని ఎందరో సీఎంలు పాలించారు. కానీ ఎవరికీ ఎదురుకాని ఇబ్బంది ఒక్క జగన్ కే ఎదురవుతోంది. తొడగొట్టి మరీ సవాల్ చేస్తోంది. ఏపీలో ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట దేవతా మూర్తుల విగ్రహాల విద్వంస రచన యధేచ్చగా సాగుతోంది. వేస్తే వేపకొమ్మ తీస్తే అమ్మ వారు అన్నట్లుగా హిందూ సంస్కృతి ఉంటుంది. ఎక్కడ చూసినా గజానికో దేవతా విగ్రహం కనిపిస్తుంది.

రక్షణ అంటే సవాల్ ….

ఏపీలో పదమూడు జిల్లాలు ఉన్నాయనుకుంటే జిల్లాకు కనీసం లక్ష విగ్రహాలు ఉంటాయి. అన్నీ కోవెలలో ఉండాల్సిన అవసరం లేదు. ఆరు బయట చాలా ఉంటాయి. గుడిలో పూజలు లేని విగ్రహాలు కూడా వేలల్లో ఉంటాయి. వాటిని అలా మొక్కుతూ జనం ముందుకు సాగిపోతారు. అటువంటి విగ్రహాలకు రక్షణ కల్పించాలంటే అది మానవ మాత్రులకు సాధ్యం కాని విషయం. విగ్రహం అంటే దేవుడే. ముందు రాయి అయినా ప్రతిగా చేస్తే మొక్కులు చెల్లిస్తారు. భక్తిగా పూజిస్తారు. అటువంటి విగ్రహాల మీద ఎవరి కన్ను పడిందో కానీ ఇది ఒక మూక దాడిగా సాగిపోతోంది. ఎంత పెద్ద ప్రభుత్వం అయినా కూడా ఇలా లక్షల విగ్రహాలకు రక్షణ కల్పించడం అంటే అసలు కుదిరే పని కాదు.

రాజకీయ చిచ్చు రగిలేనా…?

అదేదో సినిమాలో చిరంజీవి డైలాగు ఒకటి ఉంటుంది. మొక్కే అని పీకేస్తే పీక కోస్తా అని. అలా విగ్రహాలు అని చిన్న చూపు చూస్తే అవే ఇపుడు వచ్చి రాజకీయాల్లో ఏపీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. పక్కన ఉన్న అనేక రాష్ట్రాల్లో ఇలాంటి గొడవలు అసలు లేవు తమిళనాడులో ఎక్కువ అధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కానీ అక్కడ ఒక్క విగ్రహం మీద కూడా ఎవరూ చేయి వేసే సాహసం చేయడంలేదు. పొరుగున ఉన్న తెలంగాణాలో కూడా ఆరు బయట అమ్మవార్ల అయ్యవార్ల విగ్రహాలు పల్లెల్లో ఉంటాయి. వాటికి దండం పెట్టి పక్కకు జరుగుతారే తప్ప ఇలాంటి దుర్మార్గపు పనులకు ఎవరూ తెగించరు. కానీ ఏపీలో మాత్రం ఇది దారుణంగా సాగుతోంది అంటే దీని వెనక ఉన్న శక్తులు ఏమిటి అన్నదే ఇపుడు ప్రభుత్వం ఆరా తీయాల్సి ఉంది.

పార్టీల ప్రమేయం ఉందా…?

ఏపీలో విగ్రహాల విద్వంసం వెనక రాజకీయ పార్టీల ప్రమేయం ఎంతవరకు ఉంది అన్న చర్చ కనుక వస్తే అధికార పార్టీ వైసీపీకి ఈ గొడవలు అసలు పట్టవని చెప్పాల్సిందే. ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన దాని ప్రకారం చూస్తే జగన్ తన వేలితో తన కన్ను పొడుచుకుంటారా అన్నది లాజిక్ తో కూడిన ప్రశ్నగానే చూడాలి. ఇక తెలుగుదేశం మీద వైసీపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ కి చెందిన మహిళా నేత సుంకర పద్మశ్రీ బీజేపీ నేతలే విగ్రహాల విద్వంసం చేసి ఇలా నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ అయితే జగన్ క్రిస్టియన్ కాబట్టి ఆయన పార్టీ వారు ఇలా హిందూ దేవతల మీద దాడులు చేస్తున్నారు అంటున్నారు. మొత్తానికి రాజకీయ పార్టీల ప్రమేయం ఈ విషయంలో తక్కువ అనే చెప్పాలి. కానీ రాజకీయం పాలు మాత్రం ఎక్కువగానే ఉంది. దీని వెనక గుట్టుని వెలికితీయడం మాత్రం ఇపుడు వైసీపీ బాధ్యత. లేకపోతే ఎన్ని పధకాలు ప్రవేశపెట్టినా కూడా జనంలో బదనాం కావడానికి నోరు లేని విగ్రహాలు చాలు. వాటి శాపాలు తగిలితే ప్రభుత్వాలు కూలడం కూడా ఖాయమే సుమా.

Tags:    

Similar News