అమరావతిని దారికి తెచ్చే వ్యూహం ?

జగన్ సర్కార్ మొదటి నుంచి రోగం ఎక్కడ ఉంటే మందు అక్కడ వేయడం మరచిపోయి నేల విడిచి సాము చేస్తూ వస్తోంది. నిజానికి రోగాలు పలు రాకలు, [more]

Update: 2020-09-15 12:30 GMT

జగన్ సర్కార్ మొదటి నుంచి రోగం ఎక్కడ ఉంటే మందు అక్కడ వేయడం మరచిపోయి నేల విడిచి సాము చేస్తూ వస్తోంది. నిజానికి రోగాలు పలు రాకలు, రాజకీయ రోగాలకు మందు ఒకలా ఉంటుంది. సామాజిక రోగలకు వేరేలా ఉంటుంది. ఇక ప్రజా సమస్యలకు తగిన పరిష్కారాలు వెతకడమే అసలైన మందు. కానీ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా వైసీపీ సర్కార్ వ్యవహరించడం వల్లనే కోతి పుండు బ్రహ్మ రాక్షసి అన్నట్లుగా సమస్యలు అలా పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్ళకు వైసీపీ ప్రభుత్వానికి జ్ణానోదయం అయిందనుకోవాలి.

రైతులు కనిపించారా..?

అమరావతి రాజధాని రైతుల ఉద్యమం బోగస్ అని వైసీపీ సర్కార్ ఒక మొద్దు అభిప్రాయంతో ఉంది. నిజమే అక్కడ బినామీలు భూకామందులు ఉన్నారు, అక్కడ భూములు చేతులు మారాయి. దందాలు జరిగాయి. రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జరిగింది. కానీ అంత మాత్రాన అసలు రైతులే లేరు అని ఎవరైనా అనగలరా. వారిని ఎందుకు ఈ ప్రభుత్వం గుర్తించడం లేదు అన్నది ఇన్నాళ్ళూ మేధావులకు వచ్చిన పెద్ద ప్రశ్న. ఇపుడు ఎవరు చెప్పారో తెలియదు కానీ ప్రభుత్వం కళ్ళు తెరచింది. రైతులతో చర్చలకు రెడీ అవుతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి.

భరోసా ఇవ్వాలి….

ఏ ప్రభుత్వం అయినా అందరిదీ. ఒక పార్టీ తరఫున పోటీ చేసి అధికారంలోకి వచ్చినా కూడా మొత్తం ప్రజలకు బాధ్యత వహించాలి. అలా కనిపించాలి. నిజానికి రాజధాని ప్రాంతంలో వైసీపీకే జనం ఓటేశారు, జై కొట్టారు, అలాంటపుడు వారితో వైసీపీ పెద్దలు చర్చలకు తెర తీసి ఉండాలి. వారి బాధలు కష్టాలు ప్రభుత్వం విని ఉండాల్సింది. అంతే కాదు, వారికి కచ్చితమైన హామీని ఇచ్చి భరోసా కల్పించాల్సింది. ఒకవేళ రైతులు ముందుకు రాకపోయినా ప్రభుత్వం వదిలేయకూడదు, ఎందుకంటే ప్రభుత్వం పెద్దది, తండ్రిలాంటిది. పంతాలు పేచీలు ఎవరికైనా ఉండ‌వచ్చు. కానీ పాలకులకు ఉండరాదు. ఇప్పటికైనా రైతులు అక్కడ ఉన్నారు, వారికి సమస్యలు ఉన్నాయని జగన్ సర్కార్ గుర్తించడం ముందు అడుగే. ఆ దిశగా ఇపుడు అడుగులు వేగంగా పడాలి.

బ్లా మెయిల్ తో కాదు…..

ఇక వైసీపీ మంత్రి కొడాలి నాని బ్లాక్ మెయిల్ తో సమస్య పరిష్కారం చేద్దామని అనుకుంటున్నారు. మీకు శాసన రాజధాని కూడా ఉండదని బెదిరిస్తున్నారు. దాని వల్ల సమస్య మరింత బిగుస్తుంది. అలా కాకుండా వారికి నచ్చచెప్పి మాత్రమే దారికి తేవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మంత్రి వర్గ కమిటీని వేసి రైతుల వద్దకు పంపించాలి. కొడాలి నాని మేము చర్చలకు సిధ్ధమని మీడియా వేదికగా అంటున్నారు, కానీ అది ఆచరణలో చూపాలి. ఎంత తొందరగా రైతులను దారికి తెచ్చుకుంటే అంత వేగంగా జగన్ సర్కార్ మూడు రాజధానుల కధ సుఖాంతం అవుతుంది. పట్టు విడుపులు లేకుండా 15 నెలల పాలన గడచింది. దానితో తల బొప్పి కట్టింది కూడా. ఇపుడు రెండవ వైపు చూడాల్సిన సమయం వచ్చింది. వైసీపీ సర్కార్ అమరావతి రైతులకు చర్చలకు పిలవడమే అన్నింటికీ అసలైన పరిష్కారం.

Tags:    

Similar News