ఎదురు దెబ్బలకు ఏమిటీ విరుగుడు…?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయస్థానాల ఎదురు దెబ్బలు ఇంకా తప్పడం లేదు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వివాదం, గ్రామసచివాలయాల అంశమూ చర్చకు దారి తీస్తున్నాయి. సర్కారు [more]

Update: 2021-06-17 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయస్థానాల ఎదురు దెబ్బలు ఇంకా తప్పడం లేదు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వివాదం, గ్రామసచివాలయాల అంశమూ చర్చకు దారి తీస్తున్నాయి. సర్కారు కొలువు తీరి రెండేళ్లు గడిచినా ప్రతి నిర్ణయమూ వివాదాస్పదమవుతోంది. న్యాయస్థానాల్లో సవాళ్లను ఎదుర్కొంటోంది. కక్ష గట్టిన ప్రతిపక్షం , ప్రభుత్వంతో విభేదించే శక్తులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అందువల్లనే నిర్ణయాల అమలు జాప్యం అవుతోందనేది ప్రభుత్వ వాదన. రాజకీయ లక్ష్యాల కోసం ప్రతిపక్షాలు దేనికైనా అడ్డు తగలడం సహజం. అయినా చాలా సందర్బాల్లో అంతిమంగా ప్రభుత్వాలే నెగ్గుతుంటాయి. వైసీపీ సర్కారుకు మాత్రం ప్రతికూల తీర్పులే అధికంగా కనిపిస్తున్నాయి. నిర్ణయాల్లో లోపమా? చట్టాలు, రాజ్యాంగ సూత్రాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇస్తున్నారా? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఇటువంటి ప్రతికూలతలు ఉంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి అబీష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులు నిబంధనలను పక్కన పెడుతుంటారు. రెండేళ్ల లో అధికారులకు, రాజకీయ యంత్రాంగానికి మద్య సమన్వయం పెరగాలి. పాలన కుదుట పడాలి. సాధ్యమైనంత వరకూ ఎటువంటి చిక్కులు లేకుండా నిర్ణయాలు సాఫీగా అమలై పోవాలి. కానీ ఇప్పటికీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు , అధికారులు న్యాయస్తానం ఇచ్చే తీర్పులకు బాద్యులే అవుతారు. నిజానికి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం, జీవోలను రద్దు చేయడం మినహా న్యాయస్థానాలు పెద్దగా చేసేదేమీ ఉండకపోవచ్చు. కానీ ప్రభుత్వ ప్రతిష్ట మాత్రం దెబ్బతింటుంది. న్యాయస్థానాల దృష్టిలో సర్కారీ నిర్ణయాలు చులకనగా మారతాయి.

అనుకున్నదే తడవుగా…

జగన్ మోహన్ రెడ్డి రికార్డు స్థాయి విజయంతో అధికారంలోకి వచ్చారు. ప్రజల నుంచి ఇంత స్పష్టమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని దశాబ్దాల తర్వాత మాత్రమే చోటు చేసుకుంది. దాంతో ముఖ్యమంత్రి తన ఆలోచనలను నేరుగా అమలు చేయాలనుకున్నారు. నిబంధనలు, రాజ్యాంగపరమైన జాగ్రత్తల వంటి విషయాల్లో పెద్దగా పట్టించుకోలేదు. అందుకే అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో చాలా వేగంగా నిర్ణయాలు చేశారు. అప్పటి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే నెపంతో ఆయనను బదిలీ చేసేశారు. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రికి పాలనపరమైన జాగ్రత్తలు చెప్పవారు కరవు అయ్యారు. ప్రభుత్వాన్ని గైడ్ చేయాల్సిన బాధ్యతను అదికారులు పూర్తిగా విస్మరించారు. ఫలితంగానే వారు అనేక సందర్భాల్లో హైకోర్టు మెట్టెక్కాల్సి వచ్చింది. న్యాయస్తానాల చీవాట్లు తప్పలేదు. ఇప్పటికీ అనేక కేసులు హైకోర్టు పరిధిని దాటి సుప్రీం కోర్టులో నానుతున్నాయి. ప్రభుత్వానికి ప్రత్యేకంగా న్యాయశాఖ ఉంటుంది. న్యాయసలహాలకు అడ్వకేట్ జనరల్ ఉంటారు. వారికింద పనిచేసే ప్రత్యేక బృందం ఉంటుంది. వీరికి తోడు ఉన్నత స్తాయి న్యాయవాదులను అవసరానికి అనుగుణంగా కేసుల వారీ నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇన్ని రకాల యంత్రాంగం ఉన్నప్పటికీ మెజార్టీ కేసుల్లో ప్రభుత్వ వాదన వీగిపోతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమలవుతున్న దాఖలాలూ లేవు. న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుని పలు నిర్ణయాలు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నాయి.

ప్రొసీజర్ లో పొరపాట్లు…

నిజానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ముఖ్యమంత్రి, మంత్రివర్గమూ, సలహాదారులు, ఉన్నతాధికారులు ఇలా అనేక దశల్లో స్క్రూటిని తర్వాతనే నిర్ణయాలు జరుగుతుంటాయి. పై స్థాయిలో పుట్టిన ఆలోచనకు కింద నుంచి విధి విధానాలు తయారవుతుంటాయి. కింద నుంచి తయారై వచ్చిన నిర్ణయానికి తిరిగి అత్యున్నత స్తాయిలో మంత్రి వర్గం ఆమోద ముద్ర వేస్తుంది. ఆ తర్వాత మళ్లీ అమలుకు కింద స్తాయి యంత్రాంగానికి ఆదేశాలు జారీ అవుతాయి. ఇదంతా ఒక పద్దతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రభుత్వ నిర్ణయాల్లో ఏ ఒక్కరినీ తప్పు పట్టడానికి వీలుండదు. ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సమష్టి బాధ్యత కాబట్టి ఎవరికీ శిక్షలూ ఉండవు. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల అమలు, వైఫల్యాల పర్యవసానాలు మాత్రం అధినేత అయిన ముఖ్యమంత్రిపై ఎక్కువ ప్రభావం చూపుతుంటాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ అనేక నిర్ణయాలను కోర్టులు తప్పు పట్టాయి. దాని వెనక విధి విధానాలు మాత్రం పక్కాగా ఉండేవి. అందువల్లనే కోర్టు తీర్పులు ప్రతికూలంగా వచ్చినప్పటికీ పెద్దగా రచ్చ లేకుండానే సద్దుమణిగి పోతుండేవి. వైసీపీ ప్రబుత్వ నిర్ణయాల అమలుకు ప్రొసీజర్ పాటించడంలో లోపాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా న్యాయస్థానాలు తక్షణం తప్పు పట్టేందుకు అవకాశం ఏర్పడుతోంది.

ఇప్పటికైనా సెట్ అయ్యేనా..?

వైసీపీ సర్కారుకు చక్కటి యంత్రాంగం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. న్యాయకోవిదులు, మీడియాలో అపారమైన అనుభవం ఉన్నవారు, చాలాకాలం ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసిన అఖిలభారత అధికారులు సలహాదారులుగా ఉన్నారు. రాజకీయంగానూ సలహాలు, సూచనలకు లోటు లేదు. కాంగ్రెసు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారు, యువకులు మంత్రివర్గంలో సమతుల్యాన్ని కల్పిస్తున్నారు. అయితే వీరంతా సమష్టిగా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని భావించడం లేదు. కేవలం ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తే చాలనుకునే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. ఒక అంశంపై ముఖ్యమంత్రి ఆలోచనలు పంచుకున్నప్పుడు దాని పూర్వాపరాలు , మంచిచెడ్డలపై లోతైన చర్చ జరగాలి. పర్యవసనాలను బేరీజు వేసుకోవాలి. న్యాయపరమైన ఆటంకాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. వీటన్నిటినీ ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాలి. ఆ తర్వాత అంతిమంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత ప్రభుత్వంలో రెండో మాట లేకుండా సీఎం చెప్పినదానికి తల ఊపడమే తమ వంతుగా సీనియర్లు భావిస్తున్నారు. ఫలితంగా ముఖ్యమంత్రికే చెడ్డపేరు వస్తోంది. ప్రభుత్వంలో వ్యవస్థీక్రుతంగా ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ను సమర్థంగా వాడుకుంటే ఇన్ని సార్లు కోర్టులో ప్రతికూల ఫలితాలు రావు. న్యాయస్తానాలకు రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడానికి వైసీపీ విధేయులు చాలా వరకూ ప్రయత్నిస్తున్నారు. దానివల్ల ఫలితం శూన్యం. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు పరిధి ని బట్టి చట్టాలు, రాజ్యాంగ విషయాలపై అవగాహనలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. అంతే తప్ప చట్టం, రాజ్యాంగం, న్యాయప్రమాణాలకు అతీతంగా ఉద్దేశపూర్వకమైన తీర్పులనేవి ఉండవు. ఇప్పటికైనా వైసీపీ సర్కారు సొంత లోటుపాట్లను సరిదిద్దుకుంటే తమ ప్రభుత్వ నిర్ణయాల అమలుకు ఆటంకాలు తొలగుతాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News