ప్రజా వేదికపై జగన్ నిర్ణయం తప్పా ఒప్పా ?

నది పరివాహక ప్రాంత పరిరక్షణ చట్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు సర్కార్ నిర్మించిన ప్రజావేదిక ను కూల్చేయాలని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనమే అయ్యింది. [more]

Update: 2019-06-25 08:30 GMT

నది పరివాహక ప్రాంత పరిరక్షణ చట్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు సర్కార్ నిర్మించిన ప్రజావేదిక ను కూల్చేయాలని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనమే అయ్యింది. చట్టాన్ని పరిరక్షించాలిసిన వారే దాన్ని అతిక్రమిస్తే ప్రజల్లో ప్రభుత్వాలకు విలువ ఏమి ఉంటుందన్న ఏక సూత్రంతో ఎపి సిఎం కఠిన వైఖరే దీనిపై తీసుకున్నారు. ఇదే కాకుండా అమరావతి పరిధిలోని కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమ నిర్మాణాల అంతు తేల్చాలని జగన్ భావించడం ఇప్పుడు ఎపి లో చర్చకు దారితీసింది .

మాకొద్దు కానీ ఆపండి …

తమ రాజకీయ అవసరాలకోసం ప్రజావేదిక ను తమకు కేటాయించాలని ఇటీవలే టిడిపి అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎపి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయితే ఈ లేఖపై ఎలాంటి సమాధానం ఇవ్వని జగన్ సర్కార్ అక్రమ కట్టడాల అంతు తేల్చే తొలి అడుగు దీంతోనే మొదలు పెట్టింది. దాంతో పసుపు పార్టీలో కలవరం చెలరేగింది. తమకు కేటాయించాలంటూ లొల్లి చేసిన టిడిపి ఇప్పుడు కూల్చేయండి అన్న జగన్ ఆదేశాలతో బెంబేలు పడి సుమారు 11 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వేదిక కూల్చడం సరికాదని ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకోవాలని సూచించింది. ప్రజాధనం తో నిర్మించిన ఈ నిర్మాణం కూల్చివేస్తే డబ్బు వృధా అవుతుందని టిడిపి అంటుంది.

మొత్తం కూల్చండి అంటున్న జనసేన …

కేవలం ప్రజావేదిక నే కాదు అక్రమ కట్టడాలను నదీ పరివాహక ప్రాంతాల్లో వున్న అన్నిటిని కూల్చాలని జనసేన కోరుతుంది. పవన్ కళ్యాణ్ ఈ అంశంపై వ్యాఖ్యానించి కలకలం సృష్ట్టించారు. జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే తాము చెప్పింది ఆచరణలో చూపాలని సవాల్ విసిరింది. అయితే సర్కార్ యాభై కి పైగా వున్న నిర్మాణాలపై ఇదే వైఖరి తీసుకోవడానికి సిద్ధమైనట్లే తెలుస్తుంది.

విచ్చల విడి నిర్మాణాలు… అవినీతికి నేరుగా ద్వారాలు.

వాస్తవానికి నదీ పరివాహక ప్రాంతాల్లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు కోకొల్లలుగా పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టాలిసిన వారే అక్రమాలకు పాల్పడుతున్నారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగుతున్న ఈ తంతంగం అంతా ఇంతా కాదు. జగన్ ప్రజావేదిక ను కూల్చే నిర్ణయం ద్వారా ఒక హెచ్చరికను అటు అవినీతి అధికారులకు ఇటు ఇలాంటి పనులు చేసేవారికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేశారు. కూల్చివేయాలన్న నిర్ణయంతో కొంత ప్రజాధనానికి నష్టం వాటిల్లినా భవిష్యత్తులో ప్రయోజానాలె అధికమని పర్యావరణ వేత్తలు అంటున్నారు. రివర్ కన్జర్వేషన్ యాక్ట్ బూజు దులిపేందుకు సిద్ధమైన జగన్ ధైర్యాన్ని కొనియాడుతున్నారు

Tags:    

Similar News