అక్కడ నాలుగు.. ఇక్కడ మూడు…దేశానికి అంటించారుగా?

ఇదేదో కొత్త సినిమా టైటిల్ కాదు. రాజకీయ తెరపై పండుతున్న సిసలైన పాలిటిక్స్. ఏపీలో మూడు రాజధానుల గొడవ ఇంకా అలాగే ఉంది. పక్కన తమిళనాడులో రెండు [more]

Update: 2021-02-03 15:30 GMT

ఇదేదో కొత్త సినిమా టైటిల్ కాదు. రాజకీయ తెరపై పండుతున్న సిసలైన పాలిటిక్స్. ఏపీలో మూడు రాజధానుల గొడవ ఇంకా అలాగే ఉంది. పక్కన తమిళనాడులో రెండు రాజధానులు కావాలని అంటున్నారు. కర్నాటకలో కూడా రెండో మూడో రాజధానులు కావాలని డిమాండ్ ఉంది. ఇక ఉత్తరాంఖండ్ సర్కార్ రెండు రాజధానులను చేసేసింది. జార్ఖండ్ ప్రభుత్వం అయితే అయిదు రాజధానులు అంటోంది. ఇవన్నీ రాష్ట్రాల డిమాండ్లు అయితే దేశంలో సరికొత్త డిమాండ్ వినిపిస్తోంది. అది నాలుగు రాజధానులు కావాలన్నది ఒక పెద్ద నినాదంగా మారుతోంది.

నాలుగు దిక్కులా…?

భారత దేశం పెద్దది. భోగోళికంగా జనాభా పరంగా కూడా దక్షిణాసియాలోని పెద్ద దేశాల‌లో ఒకటి. అటువంటి ఇండియాకు ఒక్కటే రాజధాని ఏంటి మరీ చిన్నతనంగానూ అంటున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈ దేశానికి నాలుగు దిక్కులా నాలుగు రాజధానులు కావాల్సిందే అంటున్నారు. ఇంత సువిశాల దేశంలో ఒకే చోట రాజధాని ఉంటే ప్రజలకు ప్రగతి ఫలితాలు కూడా అందవని కొత్త వాదన వినిపిస్తున్నారు. నాలుగు రాజధానులలో పాలన సాగించాలని సూచిస్తున్నారు. మరి దీని మీద ఇపుడు ఆలోచనాపరులు, మేధావులు అధ్యయనం చేస్తున్నారు.

దూరదృష్టితోనే…?

జగన్ మూడు రాజధానులు అంటే ఆయనకు పాలన ఏమీ తెలియదు అని తిక్క అని, పిచ్చి తుగ్లక్ అని అన్న వారు ఏపీలో నిండా చాలామందే ఉన్నారు. మరి మమతా బెనర్జీని ఏమంటారు. ఆమె పదేళ్ల పాటు అతి పెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత. అటువంటి మమత బెనర్జీ పాలనా సౌలభ్యంతో పాటు ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా దేశంలో రాజధానులు పెంచాలని కోరుతున్నారు. ఇక వివిధ రాష్ట్రాల‌లో కూడా కొత్త రాజధానుల డిమాండ్ వచ్చింది అంటే ఏపీలో జగన్ మూడు రాజధానుల స్పూర్తితోనే అని తప్పక చెప్పాల్సిందే కదా. అలా ఆలోచించినపుడు జగన్ దూరదృష్టితోనే మూడు రాజధానుల ప్రతిపాదన చేశారనుకోవాలి.

వికేంద్రీకరణ మంత్రం…..

ఇపుడు సమాజం మారుతోంది. చైతన్యం కూడా వస్తోంది. పూర్వం మాదిరిగా ఒక్క చోటనే అన్నీ ఉంచి దేవుడి గది మాదిరిగా మొక్కులు చెల్లించుకోండి అంటే ఊరుకునే తరం కాదిపుడు. పైగా జనాల అభిరుచులు మారాయి. ఆకాంక్షలు కూడా పెరుగుతున్నాయి. రాజధాని అంటే కచ్చితంగా అభివృద్ధి ఉంటుంది అని అంతా నమ్ముతున్నారు. అందుకే ఆ పేరు మీదనే వికేంద్రీకరణ జరపమంటున్నారు. ఇక రాజధాని అన్నది ప్రగతి తో పాటు గర్వానికి రాజసానికి కూడా చిహ్నంగా మారుతోంది. రాజధాని చేయడానికి మా ప్రాంతం ఏం తీసిపోయింది అన్న ఆలోచనలు వస్తున్నాయి. అది వివక్షకు కూడా దారితీసి కొత్త ఉద్యమాలు కూడా పుట్టుకువచ్చేలా ఉన్నాయి. అందుకే తెలివైన వారు చేసేది వికేంద్రీకరణ పాలనే. జగన్ ఈ దేశంలో అందరి కంటే ముందే ఈ విషయంలో ఉన్నారని అంటున్నారు. మరి జగన్ మూడు రాజధానులు సాకారం అయిన నాడు దేశంలో నాలుగు రాజధానుల ఉద్యమం గట్టిగా ఊపందుకున్నా ఆశ్చర్యం లేదు.

Tags:    

Similar News